విలక్షణం.. బంజారాల జీవనం
సందర్భం : రేపు గిరిజనుల బోనాల జాతర
‘బంజారా’ ఈ పేరు వినగానే విభిన్నమైన వస్త్రధారణతో ప్రత్యేక దినాలలో కనపడే స్త్రీలు, ఆజానుబాహులైన పురుషులు కళ్ల ముందు కదలాడతారు. అసమాన వీరపరాక్రమాలకు ప్రతీకలైన రాజపుత్రులకు వీరు వారసులంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ఇది అక్షర సత్యం. కాలగర్భంలో కలిసిపోకుండా ఇంకా అక్కడక్కడా నిలిచిన సజీవ సాక్ష్యాధారాలు వారి వీరగాథలను చెబుతున్నాయి. మాతృభూమి సంరక్షణకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఆర్పించిన రాజపుత్రల వంశస్తులకు చెందిన వారే ఈ బంజారాలని ఇటీవల చారిత్రాత్మక పరిశోధనల ద్వారా నిగ్గు తేలింది. వీరి వంశాల వెనుక గణనీయమైన చరిత్ర, భిన్నమైన ఆచార వ్యవహారాలను చరిత్ర పరిశోధకులు నిరూపించారు. వీరిలో సంచార జాతులుగా జీవిస్తున్నవారిని ‘గోర్‌వట్’లని, ఇతరులను ‘కోర్‌వట్’లని అంటుంటారు. వీరు ఆటపాటలతో ఆరాధించుకునే బోనాల జాతర ఈ నెల 4న జిల్లా కేంద్రం అనంతపురం సందడిగా జరుగనుంది.
- అనంతపురం కల్చరల్
వంద మందిలో ఉన్నా బంజారాలను గుర్తించేలా చేసేది వారి వస్త్రధారణ. వారి సంప్రదాయ దుస్తులు భిన్నంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆభరణాలు, గుడ్డలు కలబోసి ధరించే ఈ దుస్తులు చాలా బరువుగా ఉంటాయి. వెండి, బంగారు, కంచు ఇత్తడి లోహాలతోపాటు ఏనుగు దంతాలతో చేసిన గాజులను మోచేతి వరకు ధరిస్తారు. తలపై నుంచి ధరించే వస్త్రం (ఛాంటియా) అంచుకు పావలా బిళ్లలు, అద్దాలు పొదగబడి ఉంటాయి. కాళ్లకు ధరించే కడియాలు వారు నడుస్తున్నపుడు చేసే వింత శబ్ధాలు వినసొంపుగా ఉంటాయి. సంప్రదాయ దుస్తుల్లో తమకే సొంతమైన పాటలకు వారు చేసే నృత్యం (పేరిమారన్) మైమరపిస్తుంది. ఉత్సవాల సమయంలో హోదాలను మరచి అందరూ లయబద్ధంగా నృత్యం చేయడం విశేషం. లిపి లేకున్నా వీరు ఎక్కడ జీవిస్తే ఆ భాషలోనే లంబాడీ పదాలతో అద్భుతైన గీతాలను వీరు రచించుకున్నారు. శారీరక శ్రమలో వీరిని మించిన వారు లేరు.
వివాహ వ్యవస్థలో మార్పు
ఒకప్పుడు బంజారాల వివాహ వ్యవస్థ భిన్నంగా ఉండేది. ఆడపిల్లలకే కట్నకానుకలిచ్చి పెళ్లిళ్లు చేసుకునే వారు. నెల రోజుల పాటు వైభవంగా వేడుకలు జరిపేవారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు రెండు మూడు రోజులకు పరిమితమయ్యాయి. అలాగే విడాకుల విషయంలో కూడా నసాబ్ (పంచాయితీ) చేసి పెద్దల సమక్షంలో దంపతులు విడిపోతారు. కాలక్రమంలో హిందూ వివాహ వ్యవస్థనే అనుసరిస్తున్నారు.
రేపు జాతర మహోత్సవం
అనంతపురం నగరంలోని నాయక్‌నగర్‌లో కొలువైన బంజారాల ప్రాచీన ఆలయంలో ‘సీతలాయ్యాడి బోనాల పండుగ’ను ఈ నెల 4న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ఆషాడమాసం ఆరుద్ర కార్తెలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయే వరకూ ఆలయంలోని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఉంటాయి. సంప్రదాయ రీతిలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. బంజారా పూజారులు నాయకుల కులదైవమైన మారెమ్మ తల్లి ప్రతిరూపాలుగా పిలవబడే పెద్దమ్మ, కాంకాళి, మరియమ్మ, సుంకలమ్మ, నాన్‌బాయి, హింగిలా భవానీ, మత్రాళీ తదితర అక్కమ్మ దేవతలను సర్వంగ సుందరంగా అలంకరించి ప్రతిష్టించిన అనంతరం చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా మహిళలు, వృద్ధులు సంప్రదాయ నృత్యంలో మునిగి తేలుతారు. తమ సంస్కృతిని మరచిపోకుండా చేసుకునే పండుగలకు నిదర్శనమే సీతాలయ్యాది ఉత్సవమని నిర్వాహకులు శంకరశివరావు తెలిపారు.
మా దుస్తులను మేమే చేసుకుంటాం
మా సంప్రదాయ దుస్తులను మేమే తయారు చేసుకుంటాం. ఇప్పటి వారి కోసం హంపి ప్రాంతంలో, మన జిల్లాలోని ఉరవకొండ వెంకటాపురం పెద్ద తండాలో వీటిని తయారు చేస్తున్నారు. ఇప్పటికీ మా అమ్మమ్మలు, నానమ్మలు ప్రకృతి పరమైన వస్తువులతో దుస్తులను తయారు చేసుకుంటున్నారు. పెళ్లిలో వక్కాకు శాస్త్రం సమయంలో, దేవతలకు నైవేద్యం పెట్టే సమయంలో డాంకో అనే వస్త్రం తప్పని సరిగా ఉంటుంది.
– శిల్పా బాయి, యూనివర్శిటీ విద్యార్థిని, అనంతపురం
తండాలలో నివసించడం సబబే
పూర్వం రాజ్యాలకు కాపాల ఉండడం, పశు సంపద, అటవీ సంపదను కాపాడుకోవడం చేసేవాళ్లం కాబట్టి ఊళ్లకు దూరంగా తండాలలో నివసించేవారు. మా వేష భాషల పట్ల మేము పూర్తి సంతృప్తిగా ఉన్నాం. భిన్నమైన ఆచార వ్యవహారాలే మమ్మల్ని ప్రత్యేకంగా చూపెడుతున్నాయి.
– శంకర శివరావు రాథోడ్, టీచర్, అనంతపురం
మేమంతా నాయకులమే
రాణాప్రతాప్‌సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్ మా వంశాలకు మూల పురుషులు. లంబాడీలని, సుగాలీలని, బంజరాలని పిలవబడే గిరిజనులు అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఉన్నారు. టిప్పుసుల్తాన్ రాజ్యమేలే రోజుల్లో సర్వసైన్యాధ్యక్షులకు, మహావీరులకు ‘నాయక్’ అని బిరుదులిచ్చి సత్కరించేవారు. కాలక్రమంలో ఆ వీరులంతా చెదిరిపోయి బంజారాలుగా దేశ సంచారులుగా ఉండిపోయినా ‘నాయక్’ అనే పదాన్ని మా పేరులోనే ఉంచేసుకున్నాం.
– కృష్ణానాయక్ రాథోడ్, అనంతపురం