మృత్యు ప్రయాణం
- రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
- మృతుల్లో ఒకరు కాంట్రాక్ట్ పీఈటీ
- మరొకరు మోటార్ మెకానిక్
అనంతపురం జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు అనంత, మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన వారు. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
సంపాదన వేటలో మృత్యుఒడికి..
కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన నాగరాజు, గంగమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్దవాడు చెన్నారెడ్డి (23). తల్లిదండ్రులకు వయసు మీద పడటంతో చెన్నారెడ్డి కుటుంబ బాధ్యతను భూజానికెత్తుకున్నాడు. చిప్పగిరి మండం నంచెర్ల ఎంపీయూపీ పాఠశాలలో కాంట్రాక్ట్ పీఈటీగాను, గుంతకల్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ముగ్గురు అక్కా చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసిన చెన్నారెడ్డి.. మిగిలిని ఒక్క చెల్లి పెళ్లి చేసిన తరువాత తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఫొటోల నిమిత్తం గుంకతల్లుకు వచ్చిన చెన్నారెడ్డి పనులు ముగించుకుని సాయంత్రం 7.30 ప్రాంతంలో చిప్పగిరికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో గుంతకల్లు సమీపంలోని హంద్రీనీవా కాలువ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రగాయాలతో పడి ఉన్న కుమారుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనమేరకు కర్నూలుకు తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో చెన్నారెడ్డి మృతిచెందాడు. గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మండల కన్వీనర్ సుంకన్న, ఫొటోగ్రాఫర్ల సంఘం మాజీ అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని మోటార్ మెకానిక్..
కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన బాలిరెడ్డి(38) మోటార్ల మెకానిక్. తనకున్న పొలంలో సాగు చేసిన పూలకు డబ్బు రావాల్సి ఉంటే బత్తలపల్లికి ద్విచక్ర వాహనంలో వచ్చాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో పోట్లమర్రి సమీపంలోని పెట్రోలు బంకు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ధర్మవరం ఆర్టీసీ బస్సును ఢీకొని అదుపుతప్పి మరో పుట్టపర్తి డిపోకు తగిలి ఎగిరిపడ్డాడు. బలమైన గాయాలు కావడంతో బాలిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు హనుమంతరెడ్డి ద్వారా సమాచారం అందుకున్న బత్తలపల్లి ఏఎస్‌ఐ మహమ్మద్‌అలీ, జయకుమార్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య క్రిష్ణవేణి, కూతురు ఉన్నారు.