ఇద్దరు యువకుల దుర్మరణం
Published Tue, Jul 19 2016 10:00 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
ఎం.నాగులపల్లి (ద్వారకాతిరుమల) : రాషీ్ట్రయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి పంచాయతీ పరిధిలో మంగళవారం వేకువజామున ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పి.కన్నాపురం పంచాయతీ సత్తాల గ్రామానికి చెందిన అన్నెం రాజేష్ (32), అన్నెం నరసింహరావు (28) వరుసకు సోదరులు. విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు పయనమైన రాజేష్‌ను భీమడోలు బస్టాండ్ వద్ద దింపేందుకు వేకువజామున 5 గంటల సమయంలో నరసింహరావు తన ద్విచక్రవాహనంపై రాజేష్‌తో బయలుదేరాడు. ఘటనాస్థలం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వేగంగా వీరిని ఢీకొట్టింది. దీంతో వాహనంతో సహా వీరిద్దరూ రోడ్డు పక్కన పంట పొలాల్లోకి ఎగిరిపడ్డారు. పొలంలోని విద్యుత్ స్తంభానికి వీరు తగలడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఓ హైటెక్ బస్ ముందు వెళుతున్న లారీని అతివేగంతో నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్ చేసే సమయంలో వీరిని ఢీకొట్టిందని స్థానికులు అంటున్నారు. ద్వారకాతిరుమల ఎస్సై టి.నాగవెంకటరాజు, సిబ్బంది ఘటనా స్థలం వద్ద మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడు రాజేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరసింహరావుకు గతేడాది వివాహం కాగా భార్య గర్భిణి. వ్యవసాయ కూలీలుగా కుటుంబాలను పోషిస్తున్న వీరి మృతితో గ్రామం శోకసంద్రంగా మారింది.
Advertisement