నిధుల కోసం ఎదురుచూపు.. | Waiting for SC,ST sub plan funds | Sakshi
Sakshi News home page

నిధుల కోసం ఎదురుచూపు..

Published Sat, Aug 6 2016 11:02 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

Waiting for SC,ST sub plan funds

  • అధికారుల అత్యుత్సాహం, కాంట్రాక్టర్లకు శాపం
  • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రాకముందే పనులు
  • రూ.4.5 కోట్ల నిధుల కేటాయింపునకు నానా యాతన
  • జనరల్‌ ఫండ్‌ నుంచి తీసేందుకు ససేమిరా అంటున్న పాలక మండలి
  • ఖమ్మం : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరు కాకముందే అధికారులు పనులు ప్రారంభించారు. సగం పనులు పూర్తి చేసిన తర్వాత కూడా నిధులు రాకపోవడంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి తేవడం, జనరల్‌ ఫండ్‌ నుంచి నిధులు కేటాయించేందుకు పాలక మండలి ససేమిరా అనడంతో కార్పొరేషన్‌ అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. కార్పొరేషన్‌లోని పలువురు అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నిధులు రాకుండానే పనులు ప్రారంభించారని, వారిలో కొందరు ఉద్యోగులు తప్పించుకొని తిరుగుతున్నారని, మరికొందరు జిల్లా నుంచి వెళ్లడంతో ఆ చికాకు తమకు చుట్టుకుంటోందని పలువురు అధికారులు వాపోతున్నారు.
    నిధులు రాకుండానే పనులు ప్రారంభం..
    బలహీన వర్గాల ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో మెరుగైన వసతులు కల్పించడం, స్లమ్‌ ఏరియాలను అభివృద్ధి చేయడం కోసం 2015 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు నివసించే ఆవాస ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధి కోసం ప్రణాళిక తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలో కాక్పొరేషన్‌ ఉన్నతాధికారులు ఇంజనీరింగ్‌ అధికారుల ద్వారా సీసీరోడ్లు, డ్రెయినేజీలు, మెటల్‌ రోడ్లతోపాటు ఇతర మౌలిక వసతుల కల్పకనకు ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళిక తయారు చేశారు. ఇలా ఎస్సీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో రూ.1.9 కోట్లతో 16 పనులు, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో రూ.2.70 కోట్లతో 24 పనులను గుర్తించారు. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల మంజూరు కాకముందే కాంట్రాక్టర్లను పిలిచి పనులు అప్పగించారు. దీంతో కార్పొరేషన్‌ పరిధిలో శ్రీనివాసనగర్, సారథినగర్, జహీర్‌పురతండా, పుట్టకోట, కొత్తగూడెం, ప్రకాష్‌నగర్, అల్లీపురం తదితర ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు. వాటిల్లో ఇప్పటి వరకు సగానికిపైగా పనులు పూర్తి చేశారు. అయితే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు మాత్రం విడుదల కాకపోవడంతో చేసిన పనులకు బిల్లులు ఇవ్వక.. మిగిలిన పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.
    పాలక మండి బ్రేక్‌
    ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రాకపోయినా జనరల్‌ ఫండ్‌ నుంచి నిధులు తీసి కాంట్రాక్టర్లకు ఇవ్వాలని భావించిన అధికారులకు పాలక మండలి బ్రేక్‌ వేసింది. ఈ నిధులను జనరల్‌ ఫండ్‌ నుంచి తీయాలని కార్పొరేషన్‌ పాలక మండలి సమావేశంలో పెట్టి తీర్మానం చేయించాలని అధికారులు ప్రయత్నించారు. అయితే నిధులు రాకుండానే పనులు చేయడం సరికాదని, ఎప్పుడో చేసిన పనులకు కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి డబ్బులు తీయడమేంటని, పలువురు అధికారులు, ఉద్యోగులు కమీషన్లకు కక్కుర్తిపడి చేయించిన పనులకు పాలక మండలి ఏలా మద్దతు తెలుçపుతుందని పలువురు కార్పొరేటర్లు ప్రశ్నించారు. ఈ విషయంపై ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్చ జరుగుతుండగానే గత నెల 14న నిర్వహించాల్సిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశానికి ముందురోజే కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి బదిలీ అయ్యారు. దీంతో ఈ సమావేశం వాయిదా పడింది. అనంతరం కౌన్సిల్‌ ఎప్పుడు నిర్వహించాలి.. ఏ అంశాలు చర్చించాలి అనే విషయంపై జూలై 27న నూతన కమిషనర్‌ భోనగిరి శ్రీనివాస్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మేయర్‌ పాపాలాల్‌ అధ్వర్యంలో నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పనులకు జనరల్‌ ఫండ్‌ నుంచి నిధులు కేటాయించడాన్ని కార్పొరేటర్లందరూ వ్యతిరేకించినట్లు తెలిసింది. కొత్తగా పనులు గుర్తించి చేపడితే ఆ పనులు చేయించిన ఘనత తమకు దక్కుతుందని, ఎవరో గుర్తించి చేసిన పనులకు తామెందుకు ఆమోదం తెలుపుతామని ముక్తకంఠంతో చెప్పడంతో ఈ నెల 10న నిర్వహించే కౌన్సిల్‌ తీర్మానాల నుంచి ఈ అంశాన్ని తొలగించారు. దీంతో బిల్లులు వచ్చి మిగిలిన పనులు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement