తక్కువ ముంపుతో రిజర్వాయర్లు
♦ సీఎం కేసీఆర్ నిర్దేశం
♦ డిండి ఎత్తిపోతల భూసేకరణకు మరో 100 కోట్లు
♦ విడుదల చేయాలని ఆర్థికశాఖకు ఆదేశం
♦ {పాజెక్టు పనులపై ముఖ్యమంత్రి సమీక్ష
♦ మేడిగడ్డపై నేడు తుది నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: వీలైనంత తక్కువ ముంపుతో ఎక్కువ గ్రామాలకు నష్టం వాటిల్లకుండా రిజర్వాయర్లు నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 3.5 లక్షల ఎకరాలకు సాగు నీరందించే డిండి ఎత్తిపోతల పథకం పనులపై సీఎం శనివారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్ నిర్మాణానికి ఎంత భూమి సేకరించాలో నిర్ణయించి, అంచనాలు తయారు చేయాలన్నారు. రైతులకు అనుకూలంగా పరిహారం చెల్లిస్తున్నందున భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, పరిహారం ఒకేసారి అందజేసి వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు.
భూ నిర్వాసితులకు భూమి విలువ, ఆస్తి విలువతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షలను ఒకే విడతలో చెల్లించాలన్నారు. నల్లగొండ జిల్లాలోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల, కృష్ణరాంపల్లి, శివన్నగూడెం, మహబూబ్‌నగర్ జిల్లా అర్కపల్లిలో భూసేకరణ చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం గతంలో కేటాయించిన రూ.75 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కేసీఆర్ ఆదేశించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి, అచ్చంపేట, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు సాగు నీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించేలా ప్రాజెక్టు డిజైన్లు ఉండాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో భాగంగా 6 కి.మీ. మేర సొరంగ మార్గం నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్దేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, నల్లగొండ కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యాప్కోస్‌తో నేడు సమావేశం
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి 160 టీఎంసీల నీటిని మళ్లించే అంశంపై సీఎం కేసీఆర్ ఆదివారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణంతో పాటు, ఎల్లంపల్లికి నీటిని తరలించే మార్గాలపై సర్వే బాధ్యతను వ్యాప్కోస్‌కు కట్టబెట్టిన విషయం తెలిసిందే. లైడార్ సర్వే పూర్తి చేసిన నేపథ్యంలో ఆదివారం వ్యాప్కోస్‌తో జరిగే సమావేశంలో మేడిగడ్డ, ఎల్లంపల్లి నడుమ అలైన్‌మెంట్‌కు సీఎం తుది రూపునిచ్చే అవకాశం ఉంది. సమావే శంలో పాల్గొనేందుకు వ్యాప్కోస్ చైర్మన్ శంభు ఆజాద్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గతంలో మేడిగడ్డ, ఎల్లంపల్లి మధ్య కాల్వల తవ్వకానికి 16 అడ్డంకులను తొలగిస్తూ, కొత్త మార్గంలో నీటిని తరలించే అంశంపై వ్యాప్కోస్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయన నివేదికపై ప్రధానంగా చర్చించే అవకాశముంది.