నెల్లూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటిస్తే వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని పట్టుబట్టారని నాయకులు విమర్శించారు.
ఎన్నికలయ్యాక 15 సంవత్సరాలు హోదా కావాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఓటుకు కోట్లు కేసుకు భయపడి నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు వైఖరి వల్లే రాష్ట్రానికి హోదా దక్కడం లేదన్నారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం తప్ప రెండేళ్లలో చంద్రబాబు సాధించిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. హోదా కోసం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న ఆందోళన చంద్రబాబుకు తప్ప రాష్ట్రంలోని ప్రజలందరికీ కనపడుతోందన్నారు. చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని వారు డిమాండ్ చేశారు.