భారత సుప్రీంకోర్టు
ఏ కేసులోనైనా సాక్షుల పాత్ర అత్యంత విలువైంది. న్యాయస్థానాల్లో కేసుల విచారణ సక్రమంగా సాగాలన్నా, అవి త్వరితగతిన పరిష్కారం కావాలన్నా సాక్షులే కీలకం. గత్యంతరం లేనప్పుడు మాత్రమే నేరం జరిగినప్పుడున్న పరిస్థితుల ఆధారంగా న్యాయస్థానాలు దోష నిర్ధారణ చేస్తాయి. చిత్రమేమంటే ఇంతటి ముఖ్య భూమిక పోషిస్తున్న సాక్షులకు మన దేశంలో కట్టుదిట్టమైన రక్షణ నిబంధనలు లేవు! ఈ స్థితి మారాలని, సాక్ష్యమిచ్చేవారి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని న్యాయ కోవిదులు చాన్నాళ్లనుంచి కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో సాక్షుల పరిరక్షణకు సంబంధించిన ముసాయిదా పథకాన్ని కేంద ప్రభుత్వం రూపొందించటం, దాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆమోదించటం హర్షించదగిన విషయం. పార్లమెంటు ఒక చట్టం చేసేవరకూ వేచి ఉండకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ముసాయిదా పథకం అమలును ప్రారంభించాలని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా జీవించే హక్కు పరిధిని విస్తరించింది. న్యాయస్థానాల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా సాక్ష్యమిచ్చే హక్కు కూడా ఈ పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. ఇకపై బెదిరిం పులు, ఒత్తిళ్ల కారణంగా ఎవరైనా సాక్ష్యం చెప్పలేని స్థితి ఏర్పడితే అది రాజ్యాంగంలోని 21వ అధిక రణను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది.
బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో సాక్షుల రక్షణకు ప్రత్యేక చట్టాలున్నాయి. తమకుండే ప్రమా దాన్నిబట్టి విచారణ సమయంలో లేదా విచారణ పూర్తయిన కొన్నాళ్లవరకూ లేదా జీవితాంతం రక్షణ కల్పించాలని సాక్షులు కోరతారు. నేరాలకు పాల్పడేవారు తాము చేసే పనులకు సాక్ష్యా ల్లేకుండా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి ముందుకొస్తే తమకు శిక్ష పడే ప్రమాదం ఉంటుంది గనుక బెదిరింపులకు దిగుతారు. అవసరమైతే వారి ప్రాణాలు తీస్తారు. సాక్ష్యం చెప్పే వారు లేకపోవడం, వచ్చినా విచారణ దశలో వెనక్కు తగ్గడం లేదా బెదిరింపులకు భయపడి స్వరం మార్చడం వంటి కారణాల వల్ల మన న్యాయస్థానాల్లో కేసులు ఏళ్లతరబడి పెండింగ్ పడుతున్నాయి. ఆ తరహా కేసుల్లో నేరగాళ్లు శిక్ష పడకుండా తప్పించుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఆశారాం బాపుపై ఉన్న హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో 10 మంది సాక్షులపై దాడులు జరిగాయి. ముగ్గురు సాక్షుల ప్రాణాలు తీశారు.
ఉత్తర ప్రదేశ్‌లోని ఉనావ్‌లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కులదీప్‌సింగ్ సెంగార్‌పై ఉన్న అత్యాచారం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, అందులో సాక్ష్యమిచ్చిన బాధితురాలి బంధువు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కేసు నుంచి తప్పించు కోవడానికే అతన్ని హతమార్చారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 1న మహా రాష్ట్రలోని భీమా–కొరెగావ్‌లో తలెత్తిన ఘర్షణలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న 19 ఏళ్ల యువతి పూజా సాకేత్ మరో మూడునెలలకు బావిలో శవమై తేలింది. తమ కుటుంబానికి బెదిరింపులొస్తున్నా యని, కాపాడాలని అంతక్రితం ఆమె వినతిపత్రాలిచ్చినా ఫలితం లేకపోయింది. సినీ నటుడు సల్మా న్‌ఖాన్ తాగి కారు నడిపి ఒకరి ప్రాణం తీసిన కేసులో అతని అంగరక్షకుడు రవీంద్ర పాటిల్ సల్మా న్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత కాలంలో వచ్చిన బెదిరింపుల పర్యవసానంగా మాన సికంగా కుంగిపోయి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అటుపై ఆ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యాడు. మొన్న అక్టోబర్‌లో కేరళ బిషప్‌పై వచ్చిన అత్యాచారం ఆరోపణల్లో సాక్షిగా ఉన్న క్రైస్తవ గురువు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు.
మన దేశంలో 1872నాటి భారతీయ సాక్ష్యాధారాల చట్టం విచారణ ప్రక్రియలో సాక్షులకుండే రక్షణ గురించి మాట్లాడుతోంది. ఏదైనా కేసులో సాక్షిగా ఉండే వ్యక్తిని న్యాయస్థానంలో అనుచి తమైన లేదా ఆగ్రహం తెప్పించే ప్రశ్నలు వేయకూడదని అది నిర్దేశిస్తోంది. నిజానికి ఏ చట్టమూ సాక్షి పదానికి నిర్వచనం ఇవ్వడం లేదు. అందుకోసం మన న్యాయస్థానాలు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులపైనే ఆధారపడుతున్నాయి. 2006లో సాక్షుల రక్షణకు భారతీయ శిక్షాస్మృతిలో 195ఏ కింద కొత్త నిబంధన పొందుపరిచారు. ఈ సెక్షన్ కింద సాక్షుల్ని బెదిరించినా, వారి ఆస్తులు ధ్వంసం చేస్తామని హెచ్చరించినా ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. అలాగే తప్పుడు సాక్ష్యంతో అమాయకులను ఇరికించి వారికి శిక్ష పడటానికి కారకులైనవారికి అదే రకమైన శిక్ష వేసేందుకు ఈ సెక్షన్ వీలు కల్పిస్తోంది. కానీ ఇది సమగ్రంగా లేదు. కనుకనే సుప్రీంకోర్టు ఇప్పుడీ ముసాయిదాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర ముసాయిదా సాక్షులను మూడు రకాలుగా విభజించింది. దర్యాప్తు విచారణ సమయంలో లేదా ఆ తర్వాత సైతం ప్రాణాలకు ముప్పు ఉన్న సాక్షులు, వారి కుటుంబసభ్యులు మొదటి కేటగిరీలోకి వస్తారు. దర్యాప్తు/విచారణ సమయంలో ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నవారు రెండో కేటగిరీలోకి వస్తారు. దర్యాప్తు సమయంలో సాధారణమైన బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొంటున్నవారు మూడో కేటగిరీలోకి వస్తారు. సాక్షులు కోరితే వారి గుర్తింపు బయటపడకుండా న్యాయస్థానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, నిందితులూ, సాక్షులూ ఎదురుపడకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవడం కూడా ముసాయిదాలో ఉన్నాయి.
సాక్షు లను గుర్తుపట్టకుండా ఉండేందుకు వీలుగా ఛాయాచిత్రాల్లో వారి ముఖకవళికలు సవరించడం, ఆడియో ఫైల్స్‌ను వారి కంఠస్వరం పసిగట్టడానికి వీల్లేకుండా సాంకేతికంగా మార్చడం వంటివి కూడా ఇందులో చేర్చారు. ఇలాంటి రక్షణలు సహజంగానే సాక్షుల్లో ఉండే భయాన్ని పోగొడతాయి. కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడతాయి. ముసాయిదా సక్రమంగా అమలయ్యేలా చూసి, ఆచరణలో ఎదురవుతున్న సమస్యలేమిటో గుర్తిస్తే మున్ముందు సమగ్రమైన చట్టం రూపకల్పనకు వీలవుతుంది. ఈ ముసాయిదాతో పని ముగిసిందని భావించకుండా సాధ్యమైనంత త్వరలో చట్టాన్ని రూపొందించటం కేంద్రం బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment