టెక్నాలజీ కోర్సులు.. కొలువుల బాట
ఇటీవల కాలంలో సిటీ యువతలో రోబోటిక్స్, నానోటెక్నాలజీ, ఏరోనాటిక్స్ వంటి కోర్సులపట్ల ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా విభిన్నమైన కొలువులు తెరపైకి వస్తున్నాయి. ప్రొడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు సమకాలీన జాబ్‌మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. 3డీ ప్రింటింగ్, అటానమస్ యూఏవీలు, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, ఫ్యూయల్ సెల్స్, నానో టెక్నాలజీస్, రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్, రోబోటిక్స్, సిమ్యులేషన్ టూల్స్, స్మార్ట్ స్ట్రక్చర్స్ వంటి టెక్నాలజీస్ సమీప భవిష్యత్తులో చాలారకాల వ్యాపారాలకు చోదక శక్తిగా మారనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా అప్‌కమింగ్ టెక్నాలజీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మంచి కొలువులు లభించే అవకాశముంది.
3డీ ప్రింటింగ్: జాతీయ అంతర్జాతీయస్థాయిలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. 3డీ ప్రింటింగ్. ఏరోనాటిక్స్, ఆటోమోటివ్ కాంపోనెంట్స్, కాస్టింగ్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ గూడ్స్, హియరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, జువెల్లరీ, మెడికల్ ఇంప్లాంట్స్, స్పోర్ట్స్ గూడ్స్, స్పేస్ సిస్టమ్స్ వంటి వాటిలో 3డీ ప్రింటింగ్ ప్రాధాన్యం పెరిగిపోతోంది. బజాజ్, బార్క్, బీఈఎల్, జనరల్ ఎలక్ట్రిక్, హెచ్‌ఏఎల్, హనీవెల్, ఇన్ఫోటెక్, లూకాస్, మహీంద్రా, మారుతి, నోకియా, టాటా మోటార్స్, టైటాన్, టీవీఎస్, విప్రో వంటి ప్రఖ్యాత సంస్థలు 3డీ ప్రింటింగ్ టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
యూఏవీ డెవలప్‌మెంట్స్: ఏరియల్ సర్వే, ఉగ్రవాదులపై ఎదురుదాడి, పర్యావరణ అధ్యయనం, కల్లోలిత ప్రాంతాలపై నిఘా, రహదారులపై ట్రాఫిక్ పర్యవేక్షణ వంటి చాలా పనులకు యూఏవీ(అన్‌మానడ్ ఏరియల్ వెహికల్)మానవ రహిత విమానాలను వినియోగిస్తున్నారు. ఇటీవలే ముంబయిలో యూఏవీతో పిజ్జాను సైతం వినియోగదారుడికి అందించారు. యూఏవీలను సాధారణంగా ‘డ్రోన్’ అని అంటారు. యూఏవీలను మరింత అభివృద్ధి పర్చేందుకు ఏడీఈ, డీసీ డిజైన్స్, డ్రోన్ ఏరోస్పేస్, ఐడియా పోర్జ్, ఎన్‌ఏఎల్, ఎన్‌డీఆర్ ఎఫ్ వంటి సంస్థలు పరిశోధనలు సాగిస్తున్నాయి. యూఏవీల విభాగంలో భవిష్యత్‌లో ఉద్యోగావకాశాల సంఖ్య పెరుగుతుందని నిపుణుల అంచనా.
సిమ్యులేషన్ టూల్స్: మానవ శరీర వ్యవస్థ నుంచి మోటార్‌బైక్‌లో ఇంజన్ వ్యవస్థ వరకూ.. ఏదైనా ఒక సిస్టమ్ పనితీరును తెలుసుకొనేందుకు సిమ్యులేషన్ టూల్స్‌ను ఉపయోగిస్తారు. వీటిద్వారా వ్యవస్థ నిర్మాణం, పనితీరు, కాలపరిమితి వంటివి సులభంగా తెలుసుకోవచ్చు. హెల్త్‌కేర్, గేమింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో సిమ్యులేషన్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది. బీపీ ఎక్స్‌ప్లోరేషన్, జీఈ ఆయిల్ అండ్ గ్యాస్ వంటి సంస్థల్లో సిమ్యులేషన్ టూల్స్ వినియోగం ఎక్కువగా ఉంటోంది.
అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్: ఫిజిక్స్, కెమిస్ట్రీ పరిశోధనల్లోంచి పుట్టిందే అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్. పరిశోధనా రంగంలో అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు కెమికల్ ఇంజనీర్లకు అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ విభాగంలో కోర్సులు చేసినవారికి జీఈ హెల్త్‌కేర్, టాటా అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ లిమిటెడ్, బేయర్ క్రాప్ సైన్స్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థల్లో అవకాశాలున్నాయి.
ఫ్యూయెల్ సెల్స్ : కెమికల్ ఇంజనీరింగ్‌లో ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్ ..ఫ్యూయెల్ సెల్స్. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ ఇంధన వనరులు వేగంగా తరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రత్యామ్నాయ వనరులపై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత పెరిగింది. ప్రత్యామ్నాయ వనరులతో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను సృష్టించేందుకు దోహదపడే కోర్సు.. ఫ్యూయెల్ సెల్స్. ఈ కోర్సు చేసినవారికి ఇంధన, ఆటోమొబైల్ రంగాల్లో అవకాశాలుంటాయి. ప్రస్తుతం దేశంలో ఫ్యూయెల్ సెల్స్ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
నానోటెక్ : భవిష్యత్తంతా నానో టెక్నాలజీదేనని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ రంగంలో పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఐఐటీలు ఇప్పటికే పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు నానో టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఎనర్జీ సిస్టమ్స్: ఒక దేశం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే.. ఆ దేశంలోని విద్యుత్, ఇంధన ఉత్పత్తులదే ప్రధాన పాత్ర. ఇలాంటి ఉత్పత్తులు తయారయ్యేందుకు ఉపయోగపడేవే ఎనర్జీ సిస్టమ్స్. సీమెన్స్ ఎనర్జీ, బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి సంస్థలు ఎనర్జీ సిస్టమ్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి.
రోబోటిక్స్: ఎలక్ట్రికల్, కంప్యూటర్, మెకానికల్ ఇంజనీరింగ్‌ల కలయికతో రోబోటిక్స్ ఇంజనీరింగ్ ఆవిర్భవానికి పునాది పడిందని చెప్పుకోవచ్చు. హెల్త్‌కేర్ రంగంలో సర్జరీలకు రోబోల వినియోగం పెరిగింది. రోబోటిక్స్ రంగంలో పట్టు సాధిస్తే ఆకాశమే హద్దుగా కెరీర్‌లో ఎదగొచ్చు. దేశ విదేశాల్లో చాలా అవకాశాలున్నాయి. భవిష్యత్తులోనూ ఈ రంగం మరింత ప్రగతి సాధించనుంది. సెంటర్స్ ఫర్ రీసెర్చ్ ఇన్ మెకాట్రానిక్స్ అండ్ రోబోటిక్స్... ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్‌లో రోబోటిక్స్ పరిశోధకులకు సహకరిస్తోంది.