మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కేందుకు కేజ్రీవాల్ యత్నం!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు ముఖ్యమంత్రి పదవిపై మళ్లీ వ్యామోహం పుట్టుకొచ్చిందా ? తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను చూస్తే అవుననక తప్పదు. గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్.. 45 రోజుల అనంతరం ఆ పదవిని కూడా తూచ్ అన్నారు. ఇప్పుడు తాజాగా కేజ్రీవాల్ కు ఆ పదవిని అలంకరించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా తో కలిసి లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ వద్దకు వెళ్లిన కేజ్రీవాల్ అరగంట పాటు సమావేశమైయ్యారు.
ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 28 సీట్లు గెలుచుకున్న ఆప్.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకుంది. అనంతరం సీఎం పీఠాన్ని కేజ్రీవాల్ కాదనడం.. అనంతరం అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం చకచకా జరిగిపోయాయి. ఈ తరుణంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడం..బీజేపీ గాలిలో ఆప్ తో సహా అన్ని పార్టీలు దాదాపు మట్టికరవడం అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వెళితే.. మోడీ ప్రభంజనంలోనెట్టుకురావడం కష్టమని ఆప్ నాయకులు బావిస్తున్నారని వినికిడి. ఈ క్రమంలోనే లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని కేజ్రీవాల్ పరిశీలిస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.