టీడీపీకి ఓటేస్తే మళ్లీ అధోగతే
సాక్షి, కాకినాడ :టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఉద్యోగులు ప్రత్యక్ష నరకం చూశారని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ర్ట మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాలరెడ్డి అన్నారు. మరోసారి ఆయనకు ఓటేస్తే మళ్లీ నాటి అవస్థలు తప్పవని ఉద్యోగులను హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల అభ్యున్నతికి పాటుపడిన వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన మళ్లీ కావాలంటే వెఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని ఆ వర్గాలకు పిలుపునిచ్చారు. కాకినాడలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ‘నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనీయన’ంటూ ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేసి వారి జీవితాలతో చంద్రబాబు ెలగాటమాడారన్నారు. చీఫ్ ఇంజనీర్ అప్పారావు వంటి మంచి అధికారులెందరో చనిపోయిన ఘటనలు ఇంకా ఉద్యోగుల కళ్లెదుట కదలాడుతున్నాయన్నారు.
చిన్న ఉద్యోగులైన ఏఎన్‌ఎంలను వేదికపైకి పిలిచి ప్రజల సమక్షంలో ఇష్టమొచ్చినట్టు తిడుతూ అవమానించే వారన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు వెళ్తే ఏనాడూ కూర్చోబెట్టి మాట్లాడలేదన్నారు. ‘మీకు ఎప్పుడూ ఉండే సమస్యలే’ అంటూ చాలా హేళనగా మాట్లాడే వారన్నారు. ఆర్నెల్లకోసారి పెన్షనర్లకు డీఎన్‌ఎస్ రిలీఫ్ ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు ఇవ్వలేదని, అడిగితే ‘మేము ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాం..ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పార’ని గుర్తు చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతామంటున్న బాబు ఎన్టీఆర్ హయాంలో 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు కుదించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఉద్యోగ వ్యవస్థను బాబు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.
ఇంటికో ఉద్యోగం ఎలా ఇస్తారు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేపీఆర్సీ ఇస్తానంటూ ఉద్యోగులను మభ్యపెడుతున్నారని, అలా చేస్తే మొత్తం పాలనా యంత్రాంగమంతా కుప్పకూలే ప్రమాదం ఉందని గోపాలరెడ్డి హెచ్చరించారు. తన హయాంలో ఏనాడూ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయని బాబు ఇప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానంటున్నారని, ఏ విధంగా ఇస్తారో వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పారు. బషీర్‌బాగ్‌లో ఉద్యమకారులను కాల్చిచంపిన బాబు హయాంలో ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని అన్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు జీతాలు ఇవ్వలేననే కుంటిసాకుతో బాబు మద్యపానానికి షట్టర్లు ఎత్తివేయడమే కాక ఊరూవాడా బెల్టు షాపులకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ర్టంలో రైతులకు రూ.2.50 లక్షల కోట్లకు పైగా రుణాలుంటే వాటిని రద్దు చేయడం ఏ మేరకు సాధ్యమని ప్రశ్నించారు.
రూ.5 లక్షల కోట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మించుకుంటామని చెబుతున్నారని, ఇప్పటికే విడిపోయిన రాష్ట్రాలకు రూ.50 వేల కోట్లు కూడా ఇవ్వలేదని చంద్రబాబుకు తెలియక పోవడం శోచనీయమన్నారు. తన హయాంలో ఒక్క టీఎంసీ నీటిని సాధించలేని, ఒక్క మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేని బాబు ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబితే నమ్మేందుకు ఎవరు సిద్ధంగా లేరన్నారు. మాట్లాడితే హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానని చెబుతున్న బాబు ఎవరి హయాంలో రాజధాని అభివృద్ధి చెందిందో పబ్లిక్ డిబేట్‌కు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి పంపిన విభజన బిల్లును చర్చించడానికే తప్ప ఓటింగ్‌కు కాదన్న విషయం తెలిసి కూడా కిరణ్ కుమార్‌రెడ్డి విభజన బిల్లును ఓడిస్తామంటూ మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ఆర్టికల్-3 ఎత్తివేసేందుకు పోరాడతామని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు.