ఊపందుకున్న నామినేషన్ల పర్వం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుం డడంతో జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మొదటి రోజు శనివారం అసెంబ్లీ స్థానాలకు రెండు, ఎంపీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలు కాగా, తరువాత వరుసగా రెండు రోజులు(ఆది, సోమవారాలు) సెలవులు రావడం తో నామినేషన్లు దాఖలుచేయడానికి వీలుపడలేదు. మంగళవారం అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది, లోక్‌సభ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. గజపతినగరం, ఎస్.కోట, నెల్లిమర్ల మినహా అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖల య్యాయి. ఈ కార్యక్రమాలకు ఆయా పార్టీల అభ్యర్థులు శక్తి వంచన లేకుండా కార్యకర్తలను తరలించారు. వైఎస్‌ఆర్ సీపీ తరఫున విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మంగళవారం బేబీనాయన నామినేషన్ దాఖలు చేయడంతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి స్వచ్ఛందంగా కార్యకర్తలు, ప్రజలు వేల సంఖ్యలో చేరుకోవడంతో విజయనగరం కిక్కిరిసి పోయింది.
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అభ్యర్థులు విజయనగరం ఎంపీ స్థానంతో పాటు చీపురుపల్లి, విజయనగరం అసెంబ్లీ స్థానాలకూ నామినేషన్లు వేశారు. విజయనగరంలో ఎంపీ స్థానానికి నంద ప్రసాదరావు, అసెంబ్లీ స్థానానికి వి.విజయరామరాజులు నామినేషన్‌లు దాఖలు చేయగా, చీపురుపల్లికి ఎస్.అనంతరాజు నామినేషన్ వేశారు. కురుపాం వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థిగా పాముల పుష్పశ్రీవాణి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా, డమ్మీ అభ్యర్థిగా శత్రుచర్ల చంద్రశేఖరరాజు నామినేషన్ వేశారు. పార్వతీపురం టీడీపీ అభ్యర్థిగా బొబ్బిలి చిరంజీవులు, ఇతనికి డమ్మీ అభ్యర్థిగా బొబ్బిలి రత్నాకర్ నామినేషన్లు దాఖలు చేశారు. జై సమైక్యాంధ్ర తరఫున బొబ్బిలి నియోజకవర్గానికి వాసిరెడ్డి అనూరాధ, సాలూరులో ఉయ్యక ముత్యాలు సీపీఐఎంఎల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.