దుర్భిక్షానికి తోడు.. ‘దండగ’మారి పాలన మిగిల్చిన దౌర్భాగ్యం.. పంట చేలలో ఇంకిన నీళ్లు.. కనుచూపు మేరా బీళ్లు.... అన్నదాత కళ్లలో సుడులు.. ఇవీ.. నాటివ్యథార్థ రైతుల యథార్థ దృశ్యాలు... రెక్కలు ముక్కలు చేసుకున్నా ఆరుగాలం శ్రమ నీరుకారిపోయి... అయినకాడికి మడిచెక్క అమ్ముకున్నా అప్పులు తీరకపోయి, దేహం ముక్కలు చేసుకున్నా, కిడ్నీలు అమ్ముకున్నా బతుకులు మారకపోయి... చెదిరిన ఆశలతో చూరుకు వేలాడిన దేహాలు!! ఇవీ.... తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన మిగిల్చిన గాయాలు... ఆ కన్నీటి గాథలే ‘ప్రజాప్రస్థానం’లో రాజన్న గుండెను తాకాయి.. ఆ దైన్యం... ఆ వేదన రైతన్న భుజం తట్టేలా మహానేత వైఎస్‌ను చలింపజేసింది.. ఊరూరా తిరిగి అన్నదాతకు ఓదార్పు ఇచ్చేలా సంకల్పం ఇచ్చింది... అధికారంలోకి రాగానే రైతు కన్నీళ్లు తుడవడమే లక్ష్యమైంది.. ఉచిత కరెంటుకు బాటలు వేసింది... రైతు రుణాల మాఫీకి పురిగొల్పింది.... జలయజ్ఞానికి స్ఫూర్తినిచ్చింది... రైతు ఇంటికి పండగ తెచ్చింది...
పావలా వడ్డీ రుణాలతో ఊరట
పిన్నింటి గోపాల్ / వనం దుర్గాప్రసాద్: అదనులో పెట్టుబడి ఉంటేనే రైతులకు స్వాంతన అనేది నిజం చేస్తూ పంట రుణాలపై వడ్డీని పావలాకు తగ్గించారు వైఎస్. ఇదే స్ఫూర్తితో రైతులకు రుణ వితరణ కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. దీనికి 2009-10లో రైతులకు ఇచ్చిన రూ. 28,434 కోట్ల పంట రుణాలే సాక్ష్యం. అన్ని రకాల పెట్టుబడి ఉపకరణాలకుతోడు రైతులకు కొండంత మనోధైర్యం కల్పించిన వైఎస్ హయాం(2009)లో రికార్డు స్థాయిలో 121 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనే పేరును నిలబెడుతూ అదే ఏడాది ఏకంగా 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ఈ ఘనతకు గాను కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా దక్కింది.
బీమాతో ధీమా పెంచి..
పెరుగుతున్న పెట్టుబడులకు తోడు ప్రకృతి విపత్తులతో వ్యవసాయం జూదంగా మారిన పరిస్థితుల నుంచి రైతుకు ధీమా కలిగించేందుకు దేశంలోనే మొదటిసారిగా ఖరీఫ్‌లో గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం అమలు చేశారు వైఎస్. దీంతో 2008-09లో రాష్ట్రానికి ఏకంగా రూ.801 కోట్లు వచ్చింది. దీనివల్ల 7.58 లక్షల మంది రైతులకు దాదాపు పంటలు పండిన స్థాయిలో ఉపశమనం కలిగింది. వాతావరణంలోని మార్పుల వల్ల పంట నష్టపోయే రైతులకు భరోసా కల్పించేందుకు 2009 ఖరీఫ్‌లో రాష్ట్రంలోనే మొదటిసారిగా గుంటూరు జిల్లాలో మిరప పంటకు వాతావరణ బీమా అమలు చేశారు. విపత్తులతో పంటలు నష్టపోయే వారికి ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీని మూడింతలు పెంచి రైతుల్లో భరోసా కల్పించారు.
ఆరు లక్షల ఎకరాల భూ పంపిణీ
నిరుపేదలకు ఆరు లక్షల ఎకరాల భూములను వైఎస్సార్ పంపిణీ చేశారు. ఇందిరప్రభ పథకం కింద రూ.500 కోట్లతో ఈ భూములను అభివృద్ధి చేయించారు. బిందు సేద్యం, తుంపర సేద్యంపై రాయితీని 50 శాతం నుంచి 90 శాతానికి పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీ కల్పించారు. ఉపాధిహామీ, ఉద్యానవన శాఖల సమన్వయంతో పండ్ల తోటల అభివృద్ధికి పథకం రూపొందించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు వ్యవసాయ, అనుబంధ శాఖల మధ్య సమన్వయం కోసం అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న 460 వ్యవసాయ అధికారులు, 700 వ్యవసాయ విస్తీర్ణ పోస్టులను భర్తీ చేశారు.
లీజు ఫీజు లేకుండా..
చెరువులు, జలాశయాల్లో చేపలు పెంచినందుకు గాను ఆయా మత్స్యకార సంఘాలు ప్రభుత్వానికి లీజు కింద ఫీజు చెల్లిస్తుంటాయి. ఈ ఫీజు మొత్తం ఏటా 10 శాతం పెరుగుతుండేది. దీనివల్ల మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన వైఎస్ 2008 నుంచి ఈ ఫీజును ఐదేళ్లపాటు పెంచ కూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చేపలను నిల్వచేసేందుకు 50శాతం రాయితీపై ఐస్‌బాక్స్‌లు పంపిణీ చేశారు.
ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక ప్యాకేజీ
అందరికీ అన్నం పెట్టే రైతు పురుగు మందులు తాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకున్న వైఎస్ ఆత్మహత్యల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న 16 జిల్లాలకు రూ.10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కల్పించారు. బాబు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సైతం ఆర్థిక సహాయం అందించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ర్టంలోని 63 లక్షల మంది రైతులకు 11,353 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యేలా చేశారు. రుణమాఫీ పథకం వర్తించని 36 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.ఐదువేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ.1800 కోట్ల ప్రోత్సాహకం అందించారు.
విప్లవాత్మక పథకాలు
గొర్రెలు, మేకల పెంపకాన్ని లాభదాయకంగా చేయడంతోపాటు పెంపకందారుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. జీవక్రాంతి పథకాల పేరుతో సబ్సిడీపై మేలు జాతి గొర్రెలు, మేకలను 50 శాతం రాయితీతో రైతులకు సరఫరా చేశారు. విపత్తులతో పాడిపశువులు, గొర్రెలు చనిపోతే పెంపకందారులు రనష్టపోకుండా బీమా కల్పించారు. నిత్యం చెట్టుపుట్టల్లో తిరిగే పెంపకందారులకు రూ.లక్ష వరకు బీమా కల్పించారు. పల్లెల్లోని నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి గోపాలమిత్ర కార్యకర్తలుగా నియమిం చారు. మూగజీవాల వైద్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా సంచార వైద్యశాలలు ఏర్పాటు చేశారు. సమాఖ్య, దీని పరిధిలోని సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
వరికి వెయ్యి మద్దతు..
పంటలు ఎంత బాగా పండినా వాటికి గిట్టుబాటు ధరలు వస్తేనే రైతు కష్టానికి ప్రతిఫలం ఉంటుందని నమ్మిన నేత వైఎస్. ఆయన పాలనలో మద్దతు ధర 70 శాతం పెరిగింది. వరి మద్దతు ధరను 2009 నాటికి రూ.1030కి పెంచేలా కేంద్రాన్ని ఒప్పించారు. కందుల ఎంఎస్పీని క్వింటాల్‌కు రూ. 1390 నుంచి రూ.3000లకు, రూ.1960 ఉన్న పత్తి ధరను రూ.3000 వరకు వచ్చేలా చేశారు.
‘మోన్శాంటో’పై ‘సుప్రీం’కు
వ్యవసాయానికి మూలాధారమైన నాణ్యమైన విత్తనం సరఫరా చేసేందుకు రాజశేఖరరెడ్డి కృషి చేశారు. 2009లో రూ.315 కోట్లతో 22 లక్షల క్వింటాళ్ల రాయితీ విత్తనాలు సరఫరా చేశారు. రైతులను నిలువునా ముంచుతున్న బహుళజాతి విత్తన కంపెనీ ‘మోన్శాంటో’కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. రూ 1850 బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ ధరను రూ.750కి తగ్గించారు. మోన్శాంటో కంపెనీ దిగివచ్చేలా చేశారు.
వర్సిటీలు నెలకొల్పి..
రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ రంగాల విద్య, పరిశోధన, విస్తరణలకు వైఎస్సార్ అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ మూడు రంగాలకూ వేర్వేరుగా విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. ఐదేళ్లలోనే ఈ సంస్థలను వందల కోట్ల వ్యాపారం చేసే స్థాయికి తీసుకొచ్చి ఆ సంస్థల్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచారు. విత్తన గ్రామం పథకాన్ని పటిష్టంగా అమలుచేసి రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి రెట్టింపు అయ్యేలా చేశారు.
మత్స్యకారుల అభ్యున్నతికి..
సునామీ వల్ల సర్వం కోల్పోయిన మత్స్యకారులు తిరిగి సాధారణ జీవనం గడిపేందుకు వైఎస్ ఎంతో కృషి చేశారు. ఇళ్లు, పడవలు, వలలు.. ఇలా అన్నింటినీ గరిష్ట రాయితీతో పంపిణీ చేశారు. మత్స్యకార మహిళలతో మత్స్యమిత్ర బృందాలు ఏర్పాటు చేశారు. వీరికి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించారు. మత్స్యకారులు వేటాడి తెచ్చిన చేపలను వారే అమ్ముకునేలా 50 శాతం రాయితీతో మొబైల్ మార్కెట్లు ఏర్పాటు చేశారు. రెండువేల మత్స్యకార సంఘాలకు ఉచితంగా చేప విత్తనాలను సరఫరా చేయడం ప్రారంభించారు.
రుణమాఫీకి ప్రత్యేక జీవో
రైతు రుణాల రద్దు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించిన ఘనత వైఎస్‌కే చెల్లుతుంది. 63 లక్షల మందికి రుణాలు రద్దు చేయడం ఒక ఎత్తై, కేంద్ర మార్గదర్శకాల వల్ల రుణ మాఫీ వర్తించని రైతన్నలకు ప్రోత్సాహాన్నివ్వడం విశేషం. 2006 నాటికి బ్యాంకు రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించిన రైతుల కోసం ఆయన ప్రత్యేక జీవో తెచ్చారు. దీనివల్ల మన రాష్ట్రంలో 32 లక్షల మంది రైతులకు రూ. 1600 కోట్ల ప్రోత్సహకం లభించింది. ప్రతీ రైతన్న రూ. 5 వేలకు తగ్గకుండా ఆర్థిక సాయం అందుకున్నారు.
పంపుసెట్లకు ఉచిత విద్యుత్
రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడానికి ఆయన కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలను కున్నారు. దీనికోసం లక్ష కోట్ల బడ్జెట్ రూపొందించారు. 70 ఏళ్ళుగా కాగితాలకే పరిమితమైన పోలవరం దశ, దిశ మార్చారు. 25 ఏళ్ళ పులిచింతల పురిటినొప్పులకు పరిష్కారం కనుగొన్నారు. 12 ప్రాజెక్టులను పూర్తి చేశారు. 22 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. 56 ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు రూపొందించారు. 30 లక్షల పంపుసెట్లకు ప్రతీ రోజూ ఏడు గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ ఇచ్చారు.
పైసా పెరగని ఎరువులు
అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు చుక్కల కెక్కాయి. 200 నుంచి 700 శాతం పెరిగాయి. అయినప్పటికీ రాష్ట్ర రైతాంగంపై ఆ భారం పడకుండా వైఎస్ ఆదుకున్నారు. 2003-04లో ఏ ధరకు రైతు ఎరువులు కొన్నారో, 2009 వరకు అదే ధరకు అందు బాటులో ఉండేలా సబ్సిడీ ఇచ్చి రైతులపై పెరిగిన ధరల భారం పడకుండా చూశారు.
మిర్చి రైతుకు భరోసా
మిరప సాగు వ్యయ ప్రయాసలతో కూడింది. వైఎస్ అధికారంలోకి వచ్చేనాటికి మిర్చి రైతు ఏనాడూ లాభాల పంట చూసింది లేదు. ప్రకృతి వైపరీత్యాలు నష్టాల్లోకి నెట్టాయి. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మిర్చిరైతుకు వైఎస్ భరోసా ఇచ్చారు. వ్యవసాయ పెట్టుబడుల సబ్సిడీ కింద చెల్లించే రూ. 2250 మొత్తాన్ని రూ. 4500 పెంచారు. దీని కోసం రూ. 169 కోట్లు వెచ్చించారు. రైతుల ఎంపిక కూడా హైదరా బాద్ సచివాలయంలో కాకుండా, గ్రామ సభ లకే ఆ అధికారాన్ని అప్పగించడం విశేషం.
ఉచితంపైనే తొలి సంతకం
- అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారు. రైతుల విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తూ ఆయన రెండో సంతకం చేశారు.
- ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ లభించింది. రైతులు బకాయిపడ్డ రూ. 1250 కోట్ల కరెంటు బకాయిలు మాఫీ అయ్యాయి. సుమారు రెండు లక్షల మంది రైతులపై నాటి చంద్రబాబు ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు రద్దయ్యాయి.
- ప్రతీ ఏటా కొత్తగా లక్షన్నర వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
- 2004 నుంచి ఒక్క ఏడాది కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. కనీస సర్వీస్ చార్జీ అయిన రూ. 20లను కూడా వసూలు చేయలేదు.
- వచ్చే ఐదేళ్లు కూడా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని 2009 ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ హామీ ఇచ్చారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌ను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతామన్నారు.
వ్యవసాయం.. పండగ చేసిండు...
Published Tue, Apr 15 2014 2:24 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM
Advertisement
Advertisement