గతమెంతో ఘనం
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: గతమెంతో ఘనం అన్నాడు ఓ మహా కవి. జిల్లా పరిషత్‌ను తలచుకుంటే అదే నిజమనిపిస్తోంది. జిల్లా పరిషత్ ఏర్పడి దాదాపు 52 ఏళ్లయింది. నాడు ఎన్నికైన సభ్యులు, ఎన్నికల వివరాలు తలుసుకుంటే ఎవరికైనా అబ్బో అనిపిస్తుంది. గతంలో ప్రత్యేకాధికారులుగా పనిచేసిన కలెక్టర్లు ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్నారు. అందులో ఓ కలెక్టర్ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా కొనసాగుతున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ స్పెషల్ స్టోరీ..
1959 డిసెంబర్ 1న జిల్లా పంచాయతీరాజ్ వ్యవస్థ ఆవిర్భవించింది. ఒకప్పట్లో 20 సమితులుండేవి. 1962లో తొలిసారి జిల్లా అభివృద్ధిబోర్డు ఏర్పాటైంది. ఇందులో 25 సమితులు ఉండే వి. కాలక్రమేణా 65 మండలాలతో విస్తరించి జిల్లా ప్రజాపరిషత్తుగా ఏర్పాటైంది.
బోర్డు అధ్యక్షులుగా అద్దూరి బలరామరెడ్డి పనిచేశారు. అప్పట్లో సమితుల్లోని పాలకులే జిల్లా బోర్డు చైర్మన్లుగా ఎన్నికయ్యేవారు. దాని తర్వాత 1987 జనవరి 15న జిల్లాలోని 65 మండలాలతో కలిపి జిల్లా ప్రజాపరిషత్తు ఏర్పడింది. 1987లో తొలిసారిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు.
జెడ్పీటీసీల్లో ఒకరిని జిల్లా ప్రజాపరిషత్తుకు ఎన్నుకున్నారు. జిల్లా అభివృద్ధి బోర్డుకు ఆరుగురు అధ్యక్షులుగా పనిచేశారు. ముగ్గురు కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా విధులు నిర్వహించారు. ఇదిలావుండగా జిల్లా ప్రజాపరిషత్ బోర్డు చైర్మన్లుగా ఇప్పటివరకు 11 మంది పనిచేశారు.
వీరితో పాటు నలుగురు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా పనిచేశారు. వీరిలో ప్రస్తుత కేంద్ర ఎన్నికల కమిషనరుగా వీఎస్.సంపత్ ఉండడం విశేషం.
తొలి మహిళాధ్యక్షురాలు కుతూహలమ్మ
జిల్లా ప్రజాపరిషత్ చరిత్రలో తొలి అధ్యక్షురాలిగా గుమ్మడి కుతూహలమ్మ పనిచేశారు. అప్పట్లో జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యురాలిగా ఉన్న ఆమె అనూహ్య పరిణామాల మధ్య జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠమెక్కారు. 1981-83 మధ్య జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఎం.రెడ్డెమ్మ 2001-06 మధ్య చైర్‌పర్సన్‌గా కొనసాగారు. ప్రస్తుతం ముచ్చటగా మూడో సారి మహిళే జెడ్పీ అధ్యక్ష పీఠాన్ని ఎక్కనున్నారు.