![వాసిరెడ్డి పద్మ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71398942856_625x300.jpg.webp?itok=GGpQzQK8)
వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: దేనికైనా లెక్క ఉంటుంది గానీ, పవన్ కళ్యాణ్ తిక్కకు లెక్కలేదని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన గురించి తెలుసుకుని మాట్లాడమని, చదువుకొని మాట్లాడమని సలహా ఇచ్చారు. ప్రజల మనసులలో స్థిరమైన స్థానం సంపాదించుకున్న వైఎస్ గురించి పవన్ మాట్లాడే మాటలన్నీ కారుకూతలని, పిచ్చిమాటలని కొట్టిపారేశారు. ఆ మహానేత కాలిగోటికి కూడా సరిపోనటువంటి వ్యక్తికి విమర్శించే అర్హత ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. విభజన వాదులైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బిజేపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అంటే పవన్‌కు ఎందుకంత ఇష్టం? అని ఆమె ప్రశ్నించారు. విభజనవాదుల వెంట పవన్ తిరుగుతున్నారని పద్మ విమర్శించారు.
పవన్‌కళ్యాణ్ అజ్ఞాని, వైఎస్‌ఆర్ వల్ల రాష్ట్రం సమైక్యంగా ఉందన్న విషయం ఆయనకు తెలియదన్నారు. విభజన గొడ్డలికి వైఎస్‌ఆర్ ఎదురొడ్డి నిలిచారని చెప్పారు. పవన్‌కళ్యాణ్ లాంటి మూర్ఖులకు ఇది తెలియకపోవచ్చునన్నారు. వైఎస్ఆర్ మరణవార్త విని 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, ప్రజల గుండెలు ఎంతగా క్షోభించాయో చూడగలిగేటువంటి మనసు, కళ్లు పవన్ కళ్యాణ్‌కు లేవన్నారు. ఐదేళ్లు గడిచినా వైఎస్ను ప్రజల గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఈ రాష్ట్రం విడిపోయేవరకూ నిద్రపోని పార్టీ బిజెపి అన్నారు. అలాంటి పార్టీని చెవిలో పువ్వుమాదిరిగా పవన్ పెట్టుకున్నారని విమర్శించారు. విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలో మాట్లాడలేని శక్తిహీనుడు మీ అన్న, అలాంటి అన్నను ప్రశ్నించావా? అని అడిగారు. ఇంతమంది విభజన వాదుల మధ్య నిలబడి సమైక్యత కోసం పోరాడిన జగన్‌పైన ఆరోపణలు చేస్తున్నావని పవన్పై మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజల లెక్కల్లోలేని మనిషి పవన్ కళ్యాణ్ అన్నారు. లెక్కల్లో లేని మనిషిని జగన్ పట్టించుకోరని చెప్పారు. మీరెన్నిచేసినా జగన్‌ను ఒక్క అంగుళం కూడా కదపలేరన్నారు. పవన్, చిరంజీవి, చంద్రబాబు.... ఇలా ఎంతమంది తిట్టినా జగన్‌ను ఏం చేయలేరని చెప్పారు. జగన్‌పై ప్రజలకున్న అభిమానాన్ని తగ్గించలేరని కూడా పద్మ స్పష్టం చేశారు.