బాబుకు పవన్ రాజకీయ బినామీ
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు పవన్ కల్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు రాజకీయ బినామీగా వ్యవహరిస్తూ దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రంగా దుయ్యబట్టారు. ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పవన్ ముసుగు తొలగి ఆయన నిజస్వరూపం ఏమిటో బయటపడిందని చెప్పారు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఎవరో ఆడిస్తే ఆడే తోలుబొమ్మ, కీలుబొమ్మలాగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు, చంద్రబాబు భావజాలానికి అక్షరరూపం తొడిగి పవన్ కల్యాణ్ చేత చెప్పించారని విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడారు. ఇప్పటికే బినామీ పేర్లతో ఆస్తులున్న చంద్రబాబు తాజాగా రాజకీయాల్లో కూడా పవన్‌లాంటి వారిని తన బినామీలుగా పెట్టుకున్నారని తెలిపారు.
చంద్రబాబుకు బినామీగా ఉంటున్నందుకు పవన్‌కు సిగ్గేయడం లేదా అని ఆమె ప్రశ్నించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లలేని శిఖండి చంద్రబాబు అయితే.. పార్టీ పెట్టి కూడా ఎన్నికల్లో పోటీ చేయనని శిఖండిగా పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడాయనకు తోడయ్యారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు సొంతంగా గెలవలేరు కనుక నరేంద్ర మోడీ , పవన్ కల్యాణ్ ముసుగులతో ముందుకు వస్తున్నారని చెప్పారు. ‘‘చంద్రబాబు గెలుపు ప్రజలకు అవసరం లేదు గానీ, ‘ఈనాడు’ రామోజీరావుకు, ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణకు చాలా అవసరం. రాజకీయ నాయకులుగా మారి టీడీపీలో చక్రం తిప్పుతున్న పారిశ్రామికవేత్తలకు మరింత అవసరముంది’’ అని పద్మ ఎద్దేవా చేశారు. చంద్రబాబును అధికారంలోకి తేవాలన్న ఆరాటంతోఎన్నికలొచ్చినప్పుడల్లా ‘ఈనాడు’ సహా ఎల్లోమీడియా మొత్తం చంద్రబాబు భావజాలానికి అక్షరరూపం ఇస్తూ ప్రజలకు నొప్పి తెలియని ఇంజెక్షన్ల మాదిరిగా వార్తలు రాస్తున్న విషయం ఆమె గుర్తుచేశారు. తాజాగా నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తుతూ ఆయన ఇంటర్వ్యూ, పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను ‘ఈనాడు’ ఎన్నికల ప్రత్యేక పేజీల్లో పతాక శీర్షికన అచ్చేయడం కూడా అందులో భాగమేనన్నారు. టీడీపీ, బీజేపీ పొత్తు ఒకట్రెండు రోజుల్లో కుదురుతుందనగా మోడీని ‘ఈనాడు’ ఆకాశానికెత్తడాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన గెలుపు చారిత్రక అవసరమంటూ అంతకుముందెప్పుడూ ఆ పత్రిక ఎందుకు చెప్పలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు.
పెట్టింది పార్టీయో, క్లబ్బో తెలియని
వ్యక్తికి అంత ప్రాధాన్యమా?
పవన్ రాజకీయాల్లోకి కొత్తగా రాలేదని, 2009 ఎన్నికల నుంచే ఆయన ఉన్నారని, అప్పుడెందుకు ‘ఈనాడు’ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదని పద్మ ప్రశ్నించారు. తాను పెట్టింది పార్టీయో, క్లబ్బో తెలియని వ్యక్తి ‘ఈనాడు’కు అంత గొప్ప రాజకీయవేత్తగా కనిపించడం, ఆయన ఇంటర్వ్యూకు అంత ప్రాధాన్యతనివ్వడాన్ని బట్టే విషయం అర్థమవుతోందన్నారు. సోనియాగాంధీని ఎదిరించి కడప ఉప ఎన్నికల్లో ఐదున్నర లక్షల భారీ మెజారిటీతో గెలుపొందడంతో పాటు ఉప ఎన్నికల్లో సైతం 17 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఒక పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలకు ‘ఈనాడు’, ఎల్లో గ్యాంగ్ ఇస్తున్న ప్రాధాన్యత ఎంత? అని పద్మ ప్రశ్నించారు.
పత్రికారంగంలో ఎప్పటినుంచో ఉన్న రామోజీకి ఇలా చేయడానికి సిగ్గనిపించడం లేదా? అని మండిపడ్డారు. సాక్షి పత్రికను తమ సమావేశాలకు రానివ్వకపోయినా చంద్రబాబు, టీడీపీ వార్తలకు సాక్షి పత్రికలో ప్రాధాన్యత ఇచ్చి ప్రచురిస్తున్నారని చెబుతూ.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన సంబంధిత వార్తను చంద్రబాబు ఫోటోతో సహా సాక్షి మొదటి పేజీలో ప్రచురించడాన్ని ఆమె విలేకరులకు చూపించారు. కానీ ఈనాడు జగన్‌కు సంబంధించిన వార్తలను ప్రచురించకపోవడం బాధాకరమని, అరుుతే ఇలా చేయడంలోని ఆంతర్యమేమిటో మాత్రం ప్రజలకు బాగానే అర్థమవుతోందని చెప్పారు.
2009లో శత్రువైన చంద్రబాబు 2014 నాటికి మిత్రుడై పోయూరా?
చంద్రబాబు హయాంలో శాంతిభద్రతలు బాగుండేవని పవన్ చెప్పడాన్ని పద్మ తప్పు పట్టారు. ‘బాబు పాలనలో టీడీపీ నేత పరిటాల రవి పాల్పడిన హత్యాకాండ పవన్ కల్యాణ్‌కు గుర్తు లేదా? టీడీపీ పాలనలో వంగవీటి రంగాను హత్య చేసిన విషయం మర్చిపోయారా? చేగువేరా, గద్దర్ విప్లవభావాలు తనవని చెప్పుకునే పవన్‌కు.. వామపక్ష తీవ్రవాదులు చంద్రబాబుపై ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే హత్యాయత్నం చేసే స్థారుులో శాంతిభద్రతలు దిగజారడం గుర్తు లేదా?’ అని ఆమె నిప్పులు చెరిగారు. 2009లో శత్రువుగా ఉన్న చంద్రబాబు 2014 ఎన్నికలొచ్చేనాటికి పవన్‌కు మిత్రుడైపోయారా అని పద్మ ప్రశ్నించారు. ‘జగన్‌పై కేసులున్నాయని అంటున్నారు... ఆ కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని, అక్రమంగా పెట్టినవని, కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ అయిన సీబీఐ పెట్టినవేనని రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు కూడా తెలుసే.
మేధావిననుకుంటున్న పవన్ కల్యాణ్‌కు ఆ మాత్రం తెలియదా. ఇన్ని విషయాలు మాట్లాడుతున్న పవన్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి ఏమిటో, ఆయన ప్రజా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు ఏమిటో తెలియకుండా పోవడం ఆశ్చర్యంగా ఉంది. బహుశా ఆయన సామాన్యుల మాదిరిగా ఆలోచించలేరేమో! కానీ సామాన్య ప్రజలకు తెలుసు వైఎస్ ఏమిటో, ఆయన పథకాలు ఏమిటో. మేధావిననుకుంటున్న పవన్‌కు వాస్తవానికి ఉన్నదంతా పైత్యమే..’ అని పద్మ వ్యంగ్యంగా అన్నారు. ‘అయినా సినీహీరో అయిన పవన్‌కు అన్నీ అధ్యయనం చేసి తెలుసుకునే తీరిక ఎక్కడిది? కేవలం చంద్రబాబు అద్దె గొంతుకతో ఆయన మాట్లాడుతున్నారు..’ అని ఆమె అన్నారు.
మీ అన్నయ్య మంచం కింద దాచిన డబ్బు సంగతేమిటి?
అవినీతి అధికారుల కేసుల గురించి మాట్లాడుతున్న పవన్ తమ నేత జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెడితే ఇదేం అన్యాయం అని ప్రశ్నించలేదెందుకు? అని నిలదీశారు. 90 రోజుల్లో బెయిల్ రావాల్సిన వ్యక్తికి బెయిల్ రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించలేదే అని ప్రశ్నించారు. ‘పవన్‌కు నిజంగా చైతన్యం ఉంటే నిష్పాక్షికంగా మాట్లాడాలి, అలా కాకుండా మునిగిపోతున్న చంద్రబాబుకు ఆసరా ఎందుకిస్తున్నట్లు? ఎవరో చెప్పిన మాటలను ఎందుకు వల్లె వేస్తున్నట్లు?’ అని సూటిగా ప్రశ్నించారు. జగన్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల్లో రహస్యాలు లేవని, అన్నింటికీ రికార్డులున్నాయని చెబుతూ, అన్నయ్య చిరంజీవి మంచం కింద డబ్బు దాచిపెట్టిన కేసు గురించి పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని పద్మ నిలదీశారు. ‘సోనియాను ఎదిరించి అక్రమ కేసులకు గురైన వారు దొంగలవుతారా? సోనియా కాళ్లు పట్టుకుని తనపైకి కేసులు రాకుండా చేసుకున్న చంద్రబాబు దొంగ కాదా?’ అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడుతున్నందుకు పవన్ కల్యాణ్ తనపై తానే జాలిపడే రోజొస్తుందని పద్మ హెచ్చరించారు.