ప్లీజ్ రండి
సాక్షి, మంచిర్యాల : అగ్రనేతలు ప్రచారానికి వస్తున్నారంటే సంబంధిత పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరిలో ఉత్సాహం నెలకొం టుంది. కానీ జిల్లాలోని తెలుగుదేశం వర్గాల్లో మాత్రం ఇందు కు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు పర్యటనకు జనసమీకరణ ఎలా చేయాలని టీడీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
పార్టీని నడిపించడం నుంచి పొత్తు ధర్మాన్ని పాటించడం వరకు తమ నాయకుడి ఒంటెద్దు పోకడలతో తలెత్తుకోలేని స్థితిలో ఉన్నామని వారు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం చంద్రబాబు జిల్లాలో ఆరు సభల్లో ప్రసంగించనున్నారు. కాగజ్‌నగర్‌లో ప్రారంభ సభ, నిర్మల్‌లో ముగింపు సభ నిర్వహించేలా ఆ పార్టీ ఏర్పాట్లు చేసింది. సభలకు ఏర్పాట్లు బాగానే ఉన్నా జన సమీకరణ ఎలా అని తెలుగు తమ్ముళ్లు మథనపడుతున్నారు. జిల్లాలో టిక్కెట్ల కేటాయింపులో పెద్ద రభస జరిగిన విషయం తెలిసిందే.
కాగజ్‌నగర్ నియోజకవర ్గంలో సీనియర్ నేత జి.బుచ్చిలింగంకు మూడే ళ్ల క్రితం నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే టిక్కెట్ల కేటాయింపులో మాత్రం ఆయన్ను కాదని సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ కేటాయించడం ఇక ్కడ అసంతృప్తిని రాజేసింది. మంచిర్యాల నియోజకవర్గంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొని ఉంది. ఈ స్థానాన్ని రెండోసారి మిత్ర పక్షాలకు కేటాయించడం పార్టీ శ్రేణులకు విస్మయానికి గురి చేసింది. పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించేది లేదని చివరి వరకు స్థానిక పార్టీ ఇన్‌చార్జీకి చెప్పి ఆఖరి నిమిషంలో మొండిచేయి చూపారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ భంగపాటుకు గురయింది నేతలిద్దరూ బీసీలే కావడం గమనార్హం. దీంతో ఈ ప్రభావం బీసీలు పార్టీకి దూరమయ్యేలా చేసింది.
పొత్తుల్లో భాగంగా బలమైన స్థానాలను బీజేపీకి కేటాయించడం సైతం శ్రేణులను అసంతృప్తికి గురిచేసింది. దీంతో బీజేపీ నేతలు తెలుగుదేశం నాయకులను కలుపుకోలేక పోతున్నారనే విమర్శలున్నాయి. వెరసి చంద్రబాబు పర్యటన కు జనసమీకరణ ఎలా సాధ్యమని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక వైఖరితో తామిప్పటికే ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంటే ఆ తర్వాత చంద్రబాబు చేసిన పనులు పుండుమీద కారం జల్లినట్లున్నాయని మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో ఎన్ని సభలు నిర్వహించినా పెద్దగా పార్టీకి ఒరిగేదేమీ ఉండదని.. ఇప్పటికే పార్టీ దాదాపుగా కనుమరుగైందని సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. వెరసి చంద్రబాబు సభపై నీలినీడలు కమ్ముకున్నాయి.