తు‘ఫ్యాన్’
సాక్షి, ఏలూరు : కుట్రలు కుతంత్రాలకు కాలం చెల్లింది. విశ్వసనీయతకు పట్టం గట్టేందుకు ప్రజలు ఓటు అస్త్రాన్ని సంధించారు. జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో ‘ఫ్యాన్’ దుమ్ముదులిపిందని విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలోని ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుచుకోనున్నారు. ఈ స్థానాల్లో ఏకపక్షంగా ఓటింగ్ జరిగింది. ఓటమి ఖాయమని తేలడంతో టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరావు (బాబు) ఉక్రోషంతో ఊగిపోయారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అధికారులపై దాడులు, దూషణలకు పాల్పడ్డారు. ఆయన నైజం ఇంతేనని జనం సరిపెట్టుకున్నారు. నరసాపురం పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు రూ.కోట్లు కుమ్మరించగలిగారు తప్ప ఓట్లు రాబట్టుకోలేకపోయారు. ప్రజలు వైఎస్సార్ సీపీపై పెట్టుకున్న విశ్వాసాన్ని ఎంత డబ్బు కుమ్మరించినా కొనలేమని ఆయనకు తెలిసొచ్చింది.
అసెంబ్లీ స్థానాల్లోనూ... : అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందనే నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో ఏర్పడింది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 12 స్థానాల్లో వైఎస్సార్ సీపీ ఏకపక్ష విజయం ఖాయమని పోలింగ్ సరళి చెబుతోంది. మిగిలిన మూడు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు గట్టిపోటీ ఇస్తున్నారు. వాటిని సైతం కైవసం చేసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకున్నారు. బడుగు, బలహీనవర్గాల ఓట్లు వైఎస్సార్ సీపీకే పడ్డాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన బూటక హామీకి తలొగ్గకుండా అన్నదాతలు వైఎస్ రుణం తీర్చుకున్నారు. ఎవరినోట విన్నా ఫ్యాన్ గుర్తుకే మాఓటు అనే పదమే వినిపించింది. టీడీపీ కంచుకోటలుగా ఉన్న కొన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీకే ఓట్లు వచ్చాయి. ఈ ప్రాంతాల్లో సెలైంట్ ఓటింగ్ జరిగింది. వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని తేలడంతో కొన్ని సెగ్మెంట్లలో ప్రత్యర్థులు అస్త్రసన్యాసం చేశారు.
మరికొన్ని చోట్ల భారీగా డబ్బు, మద్యం పంచారు. యువతర నుంచి వృద్ధుల వరకూ, కార్మికుల కూలీల నుంచి వాణిజ్య వర్గాల వరకూ అందరూ వైఎస్సార్ సీపీకే ఏకపక్షంగా ఓటేశారు. వైఎస్సార్ సీపీని ఎదుర్కోవడానికి టీడీపీ, బీజేపీ కూటములు చేయని తప్పులు లేవు, తొక్కని అడ్డదారులు లేవు. కులం పేరుతో ఓటర్లకు గాలమేశారు. భవిష్యత్ ఉండదని భయపెట్టారు. ప్రత్యేక ప్యాకేజీలు పంచారు. ద్వితీయ శ్రేణి నాయకులను కొన్నారు. పవన్ కల్యాణ్ జనసేనను వాడుకున్నారు. ఇవేవీ కుదరని చోట ఓటర్లను బెదిరించారు. తమకు ఓటెయ్యకపోతే అంతు చూస్తామంటూ బెదిరించారు. పోలింగ్ రోజు సైతం భౌతిక దాడులకు దిగారు. రిగ్గింగ్ చేసేందుకూ వెనకాడలేదు. ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చివరకు ఓటు అనే అస్త్రం ముందు పటాపంచలయ్యాయి. భారీ మెజారిటీతో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయ శిఖరం వైపు దూసుకుపోతున్నారు.