ఇక ఫైనల్స్ | YSRCP will win by huge majority in elections | Sakshi
Sakshi News home page

ఇక ఫైనల్స్

Published Thu, May 15 2014 2:21 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

YSRCP will win by huge majority in elections

సాక్షి, నెల్లూరు: ఎన్నికలేవేనా సింహపురిలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతోంది. పంచాయతీ ఎ న్నికలు మొదలుకుని తాజాగా పట్టణ, పల్లెపోరులోనూ తిరుగులేని ఆధిక్యత కనబరచి ప్రత్యర్థి పార్టీలను వైఎస్సార్‌సీపీ మట్టికరిపించింది. శుక్రవారం వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లోనూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతుందని పరిశీలకుల అంచనా. జిల్లాలో పది నియోజకవర్గాలైన నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, కావలి, ఉదయగిరి, గూడూరుతో పాటు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాల వెల్లడికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. జిల్లాలో ముగిసిన ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే సార్వత్రికంలోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యతను సాధించనున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గతంలో 941 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
 
 పురపోరులో హవా:
 ఈ నెల 12 న వెలువడిన మున్సిపల్స్ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ  అధిక మున్సిపాలిటీలు గెలుచుకొని సత్తా చాటింది. జిల్లాలో ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, కావలి, గూడూరు మున్సిపాలిటీతో నెల్లూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. వీటిలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కావలి, సూళ్లూరుపేట మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ దక్కించుకొంది. ఇక  ఆత్మకూరు, గూడూరులలో పోటాపోటీగా నిలిచింది.
 
  వెంకటగిరి మున్సిపాలిటీతో టీడీపీ సరిపెట్టుకొంది.ఈ నెల 13న వెలువడిన పరిషత్ ఫలితాల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యతను సాధించింది. జిల్లాలో మొత్తం 46 మండలాలకు 30 ఎంపీపీ, 46 జెడ్పీలకుగాను వైఎస్సార్‌సీపీ 31  స్థానాలను దక్కించుకొని నెల్లూరు జిల్లా పరిషత్‌ను సొంతం చేసుకొంది.
 
 ఆత్మకూరు జెడ్పీటీసీ స్థానం నుంచి ఎన్నికైన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అధిష్టించడం ఇక లాంఛనమే. మొత్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సోదిలో లేకుండా పోగా టీడీపీ చాలా చోట్ల పోటీకూడా ఇవ్వలేక పోయింది. ఆ పార్టీ అభ్యర్థులు కొన్ని స్థానాల్లో డిపాజిట్లు సైతం కోల్పోయారు. వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న  వైఎస్సార్‌సీపీ శ్రేణులు సార్వత్రికంలోనూ ఘనవిజయాలు సాధించి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement