ఆబాలగోపాలం ఒకే రీతిలో ఆనందించి, అనుభూతి చెందే కళకు వయసుతో పనేమిటి? బుడ్డోడు ఆలివర్ జోనెస్ (గోస్‌పోర్ట్, ఇంగ్లండ్) కూడా అదే నిరూపించాడు. బ్రిటన్‌లోని పల్లెప్రాంతాలకు వెళ్లడం అంటే ఇష్టపడే ఆరుసంవత్సరాల ఆలివర్‌కు చిన్న వయసులోనే ప్రకృతి అందాలు మనసున చేరాయి.
చెట్టు ఆకులపై మంచుబిందువులు ముత్యాల్లా వేలాడుతుండే దృశ్యాన్ని, పొద్దు తిరుగుడు పువ్వు గాలిమాటలకు తల వయ్యారంగా తిప్పుతుండడాన్ని ఇష్టంగా చూడడం, సెలయేటి గుసగుసల సవ్వడిని వినడం, సముద్రతీరాన అలల ఆలాపనలకు చెవి వొగ్గడం, పిట్టల పాటల కచేరి విని ఆహా అనడం ఆ అబ్బాయికి ఎంతో ఇష్టమైన పని.
ఆ ఇష్టాన్ని, ప్రకృతిలోని దృశ్యమాధుర్యాన్ని...ఊరవతల విడిచి రావడం కాకుండా, ఊరిలోకి తన ఇంట్లోకి తెచ్చుకోవాలనుకున్నాడు. అందుకే అతని చేతిలో ఒక కెమెరా ఉంటుంది. తాను చెప్పిన మాటలను అది వింటుంది. అసలు అందానికి కొసరు అందం జత చేసి అబ్బో అనిపిస్తుంది. ఫొటోగ్రాఫర్ అయిన తన తండ్రి మార్క్‌తో కలిసి ఆలివర్ ఇంగ్లండ్ మొత్తం దాదాపుగా తిరిగాడు. అందమైన దృశ్యాల కోసం అలుపెరగని వేట సాగించాడు.
ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది అన్నట్లు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయిన తండ్రిని చూసి కెమెరా మీద ప్రేమను పెంచుకున్నాడు ఆలివర్. చాలా చిన్నవయసులోనే తనకు కెమెరా కావాలని అడిగితే బర్త్‌డే గిఫ్ట్‌గా తల్లిదండ్రులు ఆ అబ్బాయికి బొమ్మ కెమెరా కొనిపెట్టారు. బొమ్మ కెమెరా నుంచి నిజమైన కెమెరాకు మారడానికి ఆలివర్‌కు అట్టే కాలం పట్టలేదు.
మూడు సంవత్సరాల వయసులో ఆలివర్ తీసిన ఫొటోలను చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ‘టాలెంట్ ఫర్ ది ఆర్ట్’ ఆ అబ్బాయిలో ఉన్నట్లు గ్రహించారు. వెంటనే పుత్రరత్నానికి సెకండ్- హ్యాండ్ నికాన్ డిజిటల్ యస్‌ఎల్‌ఆర్ కెమెరా కొనిపెట్టారు. ‘‘ఆలివర్‌లో ప్రతిభ ఉన్నట్లు అనిపించింది. నేను ఫొటోషూట్ కోసం ఎక్కడికి వెళ్లినా అబ్బాయిని నాతోపాటు తీసుకెళ్లేవాడిని. వాడి సందేహాలకు ఓపికగా సమాధానం చెప్పేవాడిని. ఆలివర్ కంపోజిషన్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది’’ అంటున్నాడు తండ్రి మార్క్.
తండ్రిలా ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కావాలనేది ఆలివర్ కల. ‘కళ’ ఉన్న వారి కలలు తప్పక నెరవేరతాయి కదా!
ఆబాలగోపాలుడు!
Published Sun, Nov 17 2013 11:18 PM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM
Advertisement
Advertisement