‘సిప్’ కొట్టు! కోట్లు పట్టు!!
టెస్ట్‌బడ్స్
‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు... మహా పురుషులవుతారు’ అన్నాడో సినీ మహాకవి. కానీ, ఇప్పుడీ మాటను ‘రుచి ఉంటే మనుషులు... మహా ధనికులవుతారు’ అని మార్చి పాడుకోవాలనిపిస్తోంది. నాలుక మీద ఉంటే రుచి మొగ్గల (టేస్ట్ బడ్స్)కు ఇంత విలువా అని ఆశ్చర్యపోక తప్పదనిపిస్తుంది. లండన్‌కు చెందిన సెబాస్టియన్ మైఖేలిస్ అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన టేస్ట్ బడ్స్ విలువ దాదాపు 10 లక్షల పౌండ్లు. అంటే, మన లెక్కలో సుమారు 10 కోట్ల రూపాయలు. ఆయన రుచిమొగ్గలను అంత భారీ మొత్తానికి బీమా చేయించింది ఆయన పనిచేసే ‘టాటా గ్లోబల్ బెవరేజెస్ లిమిటెడ్’ సంస్థ. ఆయన పని ఏమిటంటే, రోజూ కొన్ని వందల రకాల టీలు రుచి చూసి, ఏ తేనీరు రుచికరంగా ఉందో, ఏది రుచి తక్కువగా ఉందో చెప్పడమే. ఇలా వారంలో కొన్ని వేల కప్పుల తేనీటిని టేస్ట్ చేస్తారాయన.
అలా బ్రిటన్‌లోని టెట్లీ సంస్థలో పనిచేసిన గడచిన పదేళ్ళలో ఆయన ఏకంగా 5 లక్షల రకాల తేనీటిని రుచి చూసి చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్‌లో ఫిలాసఫీ సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేట్ అయిన సెబాస్టియన్ వయసు ఇంతా చేస్తే కేవలం 32 ఏళ్ళే. అంటే, అబ్బాయి గారు గడచిన పదేళ్ళుగా ఈ పనిలోనే ఆరితేరిపోయారన్న మాట. ఇంతకీ ఇలా టీని టేస్ట్ చేసే టీ టేస్టర్ వల్ల ఉపయోగం ఏమిటీ అంటే, ఏ తేనీటి రుచి బాగుంటే, ఆ రకమైన టీని కంపెనీలు తయారుచేస్తాయి. ఆ రకం తేయాకును విస్తృతంగా మార్కెట్ చేసి, వ్యాపారం పెంచుకుంటాయి. ‘‘బాగా చిక్కగా టీని సిద్ధం చేస్తాం. దాని రంగు, వాసన లాంటివన్నీ నోట్ చేసి పెట్టుకుంటాం. ఆ తరువాత చిన్న స్పూన్‌తో ఆ టీని నాలుక మీద వేసుకొని రుచి చూస్తాం. రుచి తెలియగానే, చటుక్కున ఉమ్మేసేస్తాం. అలా రుచిని కనిపెట్టి చెబుతాం’’ అని సెబాస్టియన్ వివరించారు.
నాలుక మీద రుచి మొగ్గలు అద్భుతంగా పనిచేసే సెబాస్టియన్ లాంటి వాళ్ళకు మార్కెట్‌లో బోలెడంత గిరాకీ. ఒక్క తేనీరే కాదు... కాఫీ మొదలు వైన్ దాకా రకరకాల రుచి ఉత్పత్తుల నిగ్గు తేల్చేందుకు ఈ ‘టేస్టర్స్’కు చాలానే పారితోషికం ఇస్తారు. ‘టాటా గ్లోబల్ బెవరేజెస్ లిమిటెడ్’ (టి.జి.బి.ఎల్)లో పనిచేసే వారందరి అనుభవం కలిపితే దాదాపు 900 ఏళ్ళకు పైగానే ఉంటుంది. అక్కడ ప్రతి వారం దాదాపు 40 వేల కప్పుల తేనీటి రుచిచూస్తారు. వీళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎంత అంటే, ప్రపంచం నలుమూలల్లోని ఏ తేయాకు తోట నుంచి చేసిన టీ ఏదో కూడా చెప్పేయగలరట. ఏ తేనీటి రుచి అద్భుతంగా ఉందో, దేనికి ఏది కలిపితే అనుకున్న రుచి వస్తోందో చెప్పాలంటే, వాళ్ళ టేస్ట్ బడ్స్ చురుగ్గా పనిచేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే, మనవాళ్ళు అలాంటి టేస్టర్స్‌ను వెతికి మరీ పట్టుకుంటారు. దొరికినవాళ్ళను జాగ్రత్తగా కాపాడుకుంటారు.
ఇప్పుడు సెబాస్టియన్ నాలుక మీది రుచి మొగ్గల్ని టి.జి.బి.ఎల్. 10 కోట్ల రూపాయలకి ఇన్సూర్ చేసింది అందుకే. ఈ విషయం గురించి సెబాస్టియన్‌ను అడిగితే, ‘‘మా కంపెనీ నా ట్రైనింగ్‌కి బోలెడంత టైమ్ వెచ్చించింది. నా టేస్ట్ బడ్స్‌కు ఇంత విలువ అని ఇప్పుడే అర్థమైంది’’ అని ముసిముసి నవ్వులు నవ్వేస్తున్నారు. అంతేకాదు, ‘‘కస్టమర్లకు రుచికరమైన టీ అందించడానికి మా కంపెనీ ఎంత ప్రాధాన్యం ఇస్తోందో కూడా అర్థం చేసుకోవచ్చు’’ అని పనిలో పనిగా స్వామిభక్తి ప్రకటించుకున్నారు. రుచి చెప్పడమే కాదు... రుచిగా మాట్లాడడంలోనూ మనవాడు దిట్టేనండోయ్!