బాస్‌కే ఎర్త్ | earth to boss | Sakshi
Sakshi News home page

బాస్‌కే ఎర్త్

Published Mon, May 30 2016 10:28 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

బాస్‌కే ఎర్త్ - Sakshi

బాస్‌కే ఎర్త్

చేతనబడి


బాస్ స్ట్రిక్ట్‌గా ఉంటే అందరికీ కరెంటు షాకే!
అలాంటి బాస్‌కే షాక్ ఇస్తే!
ఒకప్పుడైతే బాస్‌గారి బాస్ దగ్గరికి వెళ్లో... పైరవీలు చేసో
క్యాండిడేట్‌ని ట్రాన్స్‌ఫర్ మీద పంపించేవారట...
లేకపోతే కొంచెం బురద పులిమి సస్పెండ్ చేయించో... వదిలించుకునేవాళ్లట!
ఇవన్నీ సినిమాల్లో చూశాం లెండి!
కానీ కొందరు అవినీతి ఆఫీసర్లు చాలా ఇంటెలిజెంట్‌లు.
పాత సినిమాలు, పాత టెక్నిక్కులు కాకుండా
కొత్తగా ఆలోచించారు.
బల్లకింద చెయ్యిపెట్టే ఆఫీసులా మార్చుకోడానికి
బాస్ కుర్చీ కింద చెయ్యి పెట్టారు.
బాస్‌కే ఎర్త్ పెట్టారు.

 

‘‘బజ్‌జ్‌జ్... ’’ బెల్ మోగింది. అది మోగింది ఆఫీసర్ క్యాబిన్ డోర్ దగ్గరే అయినా, సెక్షన్‌లో అందరూ తమ గుండెలో మోగినట్లే ఉలిక్కిపడ్డారు. ‘పిలుపు ఎవరికో’ గుండెల్లో పీచుపీచుమంటోంది అందరికీ. ఫైల్‌లో తలదూర్చి ప్యూన్ కదలికలను ఓరకంట గమనిస్తూన్నారు. ప్యూను... కోటేశ్వర్రావు దగ్గరకొచ్చి ‘పిలుస్తున్నారు’ అంటూ కళ్లతో క్యాబిన్ వైపు చూపించాడు. ‘వీడికి పని తక్కువ, మాటలు కూడా తక్కువే. కొనుక్కొచ్చినట్లు తూకంగా వాడుతాడు వెధవ. లోపలి వాడు కళ్లతో మనిషిని చదివేస్తాడు, వీడు విషయాన్ని కళ్లతోనే చెప్తాడు... వీడికి సాగినట్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాక్కూడా సాగదు’ లోపల్లోపలే విసుక్కుంటూ ముఖం మీద చిరునవ్వు అతికించుకుని క్యాబిన్‌లోకి వెళ్లాడు.



‘కోటేశ్వర్రావుకి అక్షింతలు పడుతున్నాయా, అప్రిసియేషన్ ఏమైనా ఉండవచ్చా, అడిషనల్ అసైన్‌మెంట్ పడుతోందా...’ మిగిలిన వాళ్లంతా చెవులు విప్పార్చుకుని సిద్ధంగా ఉన్నారు.  క్యాబిన్ తలుపు తెరుచుకుంది. కోటేశ్వర్రావు బాడీ లాంగ్వేజ్‌ని చదవడానికి కళ్లద్దాలు సర్దుకున్నారు కొందరు.

 

అత్యంత మామూలుగా వచ్చి సీట్లో కూర్చున్నాడు కోటేశ్వర్రావు. మిగిలిన వారందరిలోనూ ఉత్సుకత ఉంది. కానీ ఎవరూ బయటపడడం లేదు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం లోపు ప్రతి ఒక్కరికీ ఎదురయ్యేదే అయినా ప్రతిదీ ఒకరితో ఒకరు పంచుకోకుండా ఉండరు. అది వారి ఒద్దిక, ఐకమత్యం ఏమాత్రం కాదు. జస్ట్ అలవాటు అంతే.


అందరూ తన నోటి వెంట వచ్చే మాట కోసమే ఎదురు చూస్తున్నారని కోటేశ్వర్రావుకీ తెలుసు. అందుకే నోరువిప్పాడు... ‘రేపు ఆఫీస్‌కొచ్చే ముందు ట్రెజరీ ఆఫీసుకెళ్లమంటున్నాడు. మా ఇల్లు ఆ దారిలోనే కావడంతో పెద్ద చిక్కొచ్చింది. ప్రతిసారీ ఆ ట్రెజరీ ఆఫీసు నా నెత్తినొచ్చి పడుతోంది’’ సమాచారంతోపాటు అక్కసును కూడా కక్కేశాడు.

 

‘‘అయినా అన్నేసి బిల్స్ ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి? మనోడు ప్రాపర్‌గా సబ్‌మిట్ చేయట్లేదా?’’ చాలా లౌక్యంగా తప్పంతా ఆఫీసర్ మీదకు తోసేస్తూ అడిగాడు యుడిసి కిరణ్‌కుమార్. ‘‘డీటైల్స్ సబ్‌మిషన్‌లో తేడా ఉన్నా అది బాస్ తప్పెలా అవుతుంది? ఫైల్ పుటప్ చేసేది మనమే కదా’’ కొత్తగా ఉద్యోగంలోకి చేరిన సుచిత్ర ఆశ్చర్యపోయింది. ‘తల్లీ నువ్వాపుతావా?’ అని... ‘పని చేయడం నేర్చుకుంటే చాలదు, తప్పు అవతలి వారి మీదకు తోయడం, ఒప్పులు మన ఖాతాలో వేసుకోవడం... ఇలా చాలా నేర్చుకోవాలి’ అన్నట్లు చూశారామె వైపు.  కోటేశ్వర్రావే కల్పించుకుంటూ ‘‘మన డిపార్ట్‌మెంట్ ఒక్కటే కాదు, దాదాపుగా అన్ని డిపార్ట్‌మెంట్‌ల పరిస్థితీ అలాగే ఉంది. అలాగని ట్రెజరీ ఆఫీసర్ నాగరాజు తప్పు కూడా లేదు. అతడు ప్రతిదీ పట్టి పట్టి చూస్తున్నాడు. పోయిన్నెల పంచాయితీరాజ్ నుంచి ఒక రోడ్డు వర్క్ ఫైల్ వెళ్లింది... ఎమ్ బుక్‌లో రికార్డ్ చేసిన మెజర్‌మెంట్స్ మ్యాచ్ అవలేదు. అదే క్వెర్రీ రాశాడు. దాన్ని కరెక్ట్ చేయాలంటే మళ్లీ ఫీల్ట్ మేనేజర్, ఇంజనీర్ అందరూ కూర్చోవాలి. చీఫ్ ఇంజనీర్ కవరింగ్ లెటర్ రాయాలి. అదంతా ఎన్నాళ్లు పడుతోందో. ఆ కాంట్రాక్టర్ ‘నా బిల్లో, నా బిల్లో’ అంటూ చంపుతున్నాట్ట. అంతెందుకు మొగల్రాజపురంలో వాటర్ ట్యాంకు కట్టిన కాంట్రాక్టర్ మన బాస్ దగ్గరకొచ్చి ‘వడ్డీలు పెరిగిపోతున్నాయి లేటయితే వచ్చే బిల్లు అప్పులకు చాలద’ంటూ భోరుమన్నాడు. నన్ను రేపెళ్లి ఆ ఫైల్‌ని కదిలించి రమ్మంటున్నాడు’’ అని ట్రెజరీ ఆఫీసు కష్టాలను, బాధితుల గోడును ఏకరువు పెట్టాడు.

  

ట్రెజరీ ఆఫీస్. కోటేశ్వర్రావు చాలా అలవాటుగా ఎటిఓ (అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్) నాగరాజు అనే బోర్డు ఉన్న గది వైపు వెళ్తున్నాడు. గది ఎదురుగా ఉద్యోగులు గుమిగూడి ఉన్నారు. నాగరాజు కుర్చీ ఖాళీగా ఉంది. కుర్చీ కింద సగానికి కోసి కుంకుమ అద్దిన నిమ్మకాయలు. వెంట్రుకల తాడు, పటిక రాయి, ఎర్రనీళ్లతో ఏదో క్షుద్రపూజ చేసినట్లు ఆనవాళ్లున్నాయి. ‘‘ఏ అర్ధరాత్రో చేసినట్లున్నారు. కోసిన నిమ్మకాయలు వాడి ఉన్నాయి’’ అన్నాడు నాగరాజు వాటిని పరిశీలనగా చూస్తూ.

 
అవునని కాని, కాదని కాని నోరు తెరవట్లేదు కింది ఉద్యోగులు. అందరూ చోద్యం చూస్తున్నారు. నాగరాజు భయపడుతున్నాడా లేదా అనే ఉత్సుకత కనిపిస్తోంది కొందరిలో.  కోటేశ్వర్రావుకి పరిస్థితి అర్థమైంది. అయినా ఎవరు చేసి ఉంటారిదంతా... అనే ప్రశ్న అతడిని తొలుస్తూనే ఉంది. సమాధానం దొరికే వరకు అక్కడి నుంచి వెళ్లాలనిపించడం లేదు. ఆ ఆవరణలోనే తచ్చాడుతున్నాడు. ‘గవర్నమెంట్ ఆఫీసు, అందరూ బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులు. అందరూ చదువుకున్న వారే. అలాంటి వాళ్లలో ఇంతటి మూఢవిశ్వాసాలు ఎందుకుంటాయి?’ అనే సమాధానం లేని ప్రశ్న చికాకు పెడుతోంది. ఇలాంటిది ఆఫీసు సిబ్బంది ప్రమేయం లేకుండా జరగలేదని మాత్రం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.

 
‘‘నిన్న సాయంత్రం గదులన్నీ సరిగ్గా లాక్ చేశావా’’ ప్యూన్‌ని అడుగుతున్నాడు ఎల్‌డిసి కాంతారావు. ‘‘లాక్ చేశాను, తాళాలు నా దగ్గరే ఉన్నాయి’’ తన తప్పేమీ లేదన్నట్లు వివరణ ఇస్తున్నాడు ప్యూను వెంకటేశ్వర్లు. ‘‘అర్ధరాత్రి ఇక్కడికి భూతవైద్యులెవరైనా వచ్చారేమో చుట్టు పక్కల షాపుల వాళ్లనడిగిరా’’ మరెవరో ఆదేశిస్తున్నారు. ‘‘ఎవరు చేస్తే ఏంటి? ఇక్కడితో ముగించండి. వెంకటేశ్వర్లూ వాటిని తీసెయ్’’ ఆ సీన్‌కు అంతటితో కట్ చెప్పాలనుకున్నట్లున్నాడు నాగరాజు. స్వరంలో అధికారాన్ని ధ్వనింపచేస్తూ ఆదేశించాడు. ‘‘ఎప్పుడూ మాట పూర్తయ్యేలోపు పని అందుకునే వెంకటేశ్వర్లు ఈ రోజు బాస్ ఆదేశించిన పని చేయడానికి సుముఖంగా లేడు. నిస్సహాయంగా చూస్తున్నాడు. నాగరాజుకు వెంకటేశ్వర్లు సంశయం అర్థమైంది. ‘‘అందరూ దూరంగా జరగండి’’ అంటూ తానే కుర్చీ పక్కకు జరిపి మొత్తం శుభ్రపరిచి చేతులు కడుక్కుని వచ్చి సీట్లో కూర్చున్నాడు.

  

ట్రెజరీ ఆఫీసులో జరిగిన సంఘటన బయటకు పొక్కింది. మీడియా ప్రతినిధులు వచ్చేశారు. అప్పటికి వాతావరణం మామూలుగా కనిపిస్తోంది. కానీ ఉద్యోగులు మామూలుగా లేరు. మీడియా దర్యాప్తులో తేలిన విషయం ఏమిటంటే... నాగరాజు ఎవరికీ కొరుకుడు పడని స్ట్రిక్టు ఆఫీసర్. ఉద్యోగం సిన్సియర్‌గా చేస్తాడు. ఏ ఒత్తిడులకూ లొంగడు. ‘ఏ బిల్లు వచ్చినా పదో పరకో తీసుకుని ఫైల్‌పాస్ చేయాల్సింది పోయి, ప్రతి దానికీ క్వెరీలు రాస్తుంటాడ’ని కింది ఉద్యోగుల ఆరోపణ. అతడి నిక్కచ్చితనం కింది ఉద్యోగులకు పెద్ద సంకటంగా ఉంది. అందుకే అందరూనో కొందరో కలిసి అతడిని భయపెట్టడానికి పన్నిన కుట్ర ఇది. మూఢవిశ్వాసాలతో భయపెడితే ఒత్తిడులకు లొంగుతాడనే కుయుక్తి ఇదంతా. కింది ఉద్యోగుల్లో ఎవరు చేశారనేది కూపీలాగి వారి గౌరవానికి భంగం కలిగించడానికి ఇష్టపడలేదు నాగరాజు. తాను భయపడననే సంకేతాన్ని జారీ చేసి ఆ ఇష్యూకి అంతటితో ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

 

తాళాలు  తీసిందెవరు?
ఆఫీసు గదులకు వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. కానీ లోపలికి ఎలా వెళ్లారనేది అందరినీ వేధించిన ప్రశ్న. పాతకాలం నాటి కట్టడం, వెనుక వైపు ఉన్న చిన్న తలుపు ఎప్పుడూ తెరవరు. అటుగా ఎవరూ నడవరు. ఆ తలుపు గడియ తీసి తలుపు యథావిధిగా మూసేసి వచ్చారు సిబ్బందిలో ఒకరు. ప్యూన్‌కు ఆ సంగతి తెలియదు. ఎప్పటిలాగానే ముందు తలుపులకు మాత్రమే తాళాలు వేశాడు.

- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement