ప్లాటైనా... ఫ్లాటైనామంచి మదుపు కోసం..
పెట్టుబడులు పెట్టడానికి షేర్ మార్కెట్ ఎంత గొప్ప సాధనమో... రియల్ ఎస్టేట్ కూడా అంతే. దీన్లో కూడా ఎంత డబ్బు అయినా పెట్టగలిగే అవకాశముంటుంది. పెపైచ్చు ఇతర సంప్రదాయ పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఎక్కువ రాబడి వస్తుంది. అలాగని రియల్టీలో ఏది పడితే అది కొంటే పెరుగుతాయా? చాలా కష్టం. కొన్ని సార్లు రియల్ ఎస్టేట్ ఆస్తుల్ని అమ్మాలనుకుంటే పెట్టుబడి కూడా వెనక్కి రాకపోవచ్చు. కొన్నిసార్లు అమ్ముతామన్నా కొనేవారు ఉండకపోవచ్చు. అందుకే రియల్టీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసేముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో తెలుసా...?
కొనేది ఇల్లయినా, ఫ్లాటయినా, ప్లాట యినా... ఏదైనా సరే! దాన్ని మన సొంతానికి వాడుకోవటం కోసం కొంటున్నామా! లేక పెట్టుబడి కోణంలో కొంటున్నామో తొలుత నిర్థారించుకోవాలి. అతర్వాతే అడుగు ముందుకేయాలి.
స్థిర నివాసం కోసం ఇండిపెండెంట్ ఇల్లో, ఫ్లాటో కొనేవారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లోనే కొంటే మేలు. ఆరు నెలల్లోపు పూర్తయ్యే వాటిలోనూ కొనొచ్చు. కాకుంటే వీటిలో కాస్త రేటు ఎక్కువే ఉంటుంది. కొన్న వెంటనే గృహప్రవేశం చేస్తే సేవాపన్నూ కట్టాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లో నగదు కొరత ఉన్న సమయాల్లో ఇలాంటి నిర్మాణాలే మేలు. అయితే ఆ ప్రాంతం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. ఒకవేళ అమ్మాలనుకున్నప్పుడు మన పెట్టుబడి మనకొస్తుందో రాదో తెలుసుకోవాలి.
సొంతింట్లోకి వెళితే అద్దె మిగులుతుంది. కానీ లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలి. ఈ రెండింటి మధ్యా తేడా ఎంత ఉంటుందో చూసుకోవాలి.
మొదట్లో ఈ రెండింటి మధ్యా ఎక్కువ తేడా ఉంటుంది. మున్ముందు జీతాలు, అద్దెలు కూడా పెరుగుతాయి కనుక తేడా త గ్గుతుంది. ఈఎంఐ కూడా తేలికైపోతుంది.
పెట్టుబడి కోసమైతే ‘ప్రీ లాంచ్’ ప్రాజెక్టుల్లో కొనుక్కోవటం ఉత్తమం. అలాగైతే రేటు చాలా తగ్గుతుంది. వెంటనే ఈఎంఐలు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు.
పనులు పూర్తయి, నిర్మాణానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులకన్నా ఇలాంటి ప్రాజెక్టుల్లో అయితే ధరలు 20-25% తక్కువగానే ఉంటాయి. అయితే కొనేముందు స్థలం యాజమాన్య హక్కులు ఎవరి పేరిటున్నాయో తెలుసుకోవాలి. స్థల యజమాని, బిల్డర్ మధ్య రాతకోతలు, స్థానిక సంస్థల అనుమతులు.. అన్నీ ఉంటేనే ఊకొట్టాలి.
పెట్టుబడి కోణంలో కొనేవారు వాటిపై వచ్చే అద్దెను, మున్ముందు పెరిగే స్థిరాస్తి విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దాన్నంతటినీ పెట్టుబడిపై వచ్చే రాబడిగానే భావించాలి.
ఫ్లాటు కొనేముందు..
నిర్మాణం పూర్తి కాగానే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి.
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చాక సుమారు రెండేళ్ల వరకూ బిల్డర్ /డెవలపరే అపార్ట్‌మెంట్ నిర్వహణ బాధ్యతను తీసుకోవాలి.
రెండేళ్లయ్యాక నివాసితులంతా కలసి ఒక సంఘంగా ఏర్పడటానికి బిల్డర్/ డెవలపర్ ప్రతిపాదించాలి.
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సంఘం పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన కార్పస్ ఫండ్ మొత్తాన్ని అందులో జమ చేయాలి.
నిర్మాణానికి సంబంధించిన కీలకమైన పత్రాలను బిల్డర్/డెవలపర్ నుంచి తప్పకుండా తీసుకోవాలి. బిల్డర్/డెవలపర్ స్థలానికి సంబంధించిన టైటిల్‌ను సంఘం పేరిట బదిలీ చేయాలి.
ప్లాన్ ప్రకారమే బిల్డర్/డెవలపర్ నిర్మాణం చేపట్టాడని తెలియజేసే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక సంస్థ నుంచి తీసుకోవాలి.
సాంకేతికాంశాలూ చూడాలి...
సంబంధిత లేఅవుట్‌కు నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల అనుమతులున్నాయా? లేదా? చూసి తెలుసుకోవాలి. రెవెన్యూ రికార్డులో స్థలం వివరాలు తెలుసుకోవాలి.
అమ్మకందారుకు భూమిని అమ్మడానికి ఉన్న హక్కులను పరిశీలించాలి. పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ పత్రాలు చూసుకోవాలి.
గడిచిన 12 ఏళ్లుగా స్థలానికున్న లింక్ డాక్యుమెంట్స్ పరిశీలించాలి. దీన్నే ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్)గా వ్యవహరిస్తారు. దీన్ని మీ సేవ కార్యాలయంలో తీసుకోవచ్చు.
భూమి సంబంధిత సర్వే నెంబరులో ఉందా లేదా తెలుసుకోవడానికి మండల రెవెన్యూ కార్యాలయ సర్వేయర్‌ను సంప్రతించి, స్థలం కొలిపించుకోవాలి.
బ్యాంకుల్లో గాని ఇతరత్రాగానీ భూమిని తనఖాపెట్టి రుణాలు పొందారా అనే విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించాలి.
స్థలం అన్నివిధాల నచ్చితే ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం మంచిది. దానివల్ల క్రయవిక్రయాల గురించి నలుగురికి తెలిసి ఎవరికైనా ఆక్షేపణలుంటే తెలియడానికి వీలుంటుంది. కొన్న తర్వాత మరెవరో వచ్చి ఆ భూమి తమదని తగాదా పెట్టుకోరన్న నమ్మకం కుదిరితే అప్పుడు భూమిని కొనుగోలు చేయాలి.