తప్పుచే స్తే దిద్దుకోవటం కష్టమే | Real estate investment | Sakshi
Sakshi News home page

తప్పుచే స్తే దిద్దుకోవటం కష్టమే

Published Mon, May 15 2017 12:24 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

తప్పుచే స్తే దిద్దుకోవటం కష్టమే - Sakshi

తప్పుచే స్తే దిద్దుకోవటం కష్టమే

సాధారణ ఇన్వెస్టర్లలో తప్పులు చేసేవారే అధికం
ఒకే తరహా ఫండ్లలో మొత్తం పెట్టుబడి పెడుతున్నారు
కొందరు బోలెడన్ని ఫండ్లు ఎంచుకుంటున్నారు
మార్కెట్లలో తక్షణ లాభాలకోసం ప్రయాసలు
పడిపోతుంటే మాత్రం వైదొలగటానికే ప్రాధాన్యం
అవసరం లేకున్నా డివిడెండ్‌ పథకాలపైనే దృష్టి
ఫండ్లలో పెట్టుబడిపై మర్నాటి నుంచే సమీక్షలు
జాయింట్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు మొగ్గు చూపని తీరు
ఇవన్నీ తప్పిదాలేనంటున్న ఆర్థిక సలహాదారులు

 
దేశంలో ఎగువ మధ్య తరగతి వారంతా ఇన్వెస్టర్లే!! అంటే తమ సంపాదనలో మిగిలే డబ్బును పొదుపు పథకాల్లోనో, రియల్‌ ఎస్టేట్‌ తదితర ఆస్తుల్లోనో, స్టాక్‌ మార్కెట్లలోనో... ఇలా ఎక్కడో ఒకచోట పెట్టుబడి పెడుతున్నవారే. కాకపోతే వీరిలో కొందరు అతివేగంగా భారీ మొత్తాలు ఆర్జిస్తారు. కోటీశ్వరులవుతుంటారు. కొందరేమో తమ అసలును కాపాడుకుంటూ... పెద్దగా ఎదుగూబొదుగూ లేకుండా అలాగే ఉంటారు. ఇంకొందరు మాత్రం ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. ఎందుకిలా?

ఎందుకంటే... చాలామంది అదృష్ట–దురదృష్టాలపైకి నెట్టేస్తుంటారు. ఇవి కొంతమేరకు పనిచేస్తాయేమో కానీ... ప్లానింగ్, అవగాహన, రీసెర్చ్‌ వల్లే ఎదుగుదల సాధ్యమవుతుంది. ఎందుకంటే మిగతా చోట్ల తప్పులు చేస్తే దిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ పెట్టుబడి పెట్టేటపుడు తప్పు చేస్తే చేతులు కాలతాయి. డబ్బులు పోతాయి. ఇన్వెస్టర్లు సాధారణంగా చేసే తప్పిదాల గురించి ఆర్థిక సలహాదారులు పలు అంశాలు చెబుతుంటారు. అవేంటో తెలుసుకుని... దిద్దుకుంటే సరైన దారిలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయొచ్చు. తద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందొచ్చు కూడా. అవేంటో చూద్దాం.

ఒకే తరహా... ఫండ్స్‌ వద్దు
సాధారణంగా ఇన్వెస్టర్లు గత రాబడుల చరిత్ర ఆధారంగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. దీంతో ఒకే తరహా ఫండ్స్‌ వారి పోర్ట్‌ఫోలియోలో కనిపిస్తుంటాయి. ఉదాహరణకు మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ చక్కగా రాణిస్తూ అధిక రాబడులను ఇస్తున్నాయనుకోండి. ఉన్న డబ్బంతా వాటిలో పెట్టడానికి ఇష్టపడతారు. కానీ మార్కెట్లు బూమ్‌లో ఉన్న సమయంలో మంచి పనితీరున్న ఫండ్స్‌... ఒకవేళ మార్కెట్‌ పనితీరు బాగులేకుంటే ఏమవుతుంది? అనే ఆలోచన చేయరు. మార్కెట్‌ బాగులేని సమయాల్లో కూడా చక్కని రాబడులిచ్చిన ఫండ్స్‌ను ఎంచుకోవాలన్నది నిపుణుల సూచన. అందుకే 15 ఏళ్ల దీర్ఘ కాలంలో రిస్క్‌ లేని రేటుపై (7 శాతం) మూడు నుంచి నాలుగు శాతం రాబడులుంటాయని, దీన్ని పరిగణనలోకి తీసుకుని పెట్టుబడి పెట్టాలన్నది వారు చెప్పే మాట.

మార్కెట్‌ ప్రకారం నడుచుకోవడం...
మార్కెట్‌ బూమ్‌ను క్యాష్‌ చేసుకునే ధోరణి కూడా ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. ఈక్విటీల మాదిరిగా ఫండ్స్‌లోనూ ఎప్పటికప్పుడు లాభాలను బుక్‌ చేసుకోవాలన్న అభిప్రాయంతో ఇన్వెస్టర్లు ఉంటున్నట్టు కొందరు సలహాదారులు పేర్కొంటున్నారు. ‘‘రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడరు. గానీ, రాబడులు మాత్రం అధికంగా ఉండాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్టే కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తున్నారు. ఇది ఇబ్బంది కరం. ఇన్వెస్ట్‌మెంట్‌లో భావోద్వేగాలను నియంత్రించుకోవటం చాలా ముఖ్యం’’ అని రీసెర్చ్‌ అనలిస్ట్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. మార్కెట్లలో ఆటుపోట్లను చూసి అనవసరంగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, సిప్‌లను ఆపివేయడం కొందరు చేసే పని. నిధుల ఉపసంహరణకు డబ్బులతో అవసరం ఉందని, ఉద్యోగం పోయిందని, రుణాల వాయిదాలు చెల్లించాలని పలు కారణాలు చెబుతుంటారు. కానీ, వాస్తవంగా ఆటుపోట్లను తట్టుకునేంతటి మానసిక దృఢత్వం వారిలో లేకపోవడమే అసలు కారణమన్నది నిపుణుల అభిప్రాయం. మార్కెట్లు పతనంలో ఉన్నప్పుడు వాస్తవానికి ఇన్వెస్ట్‌ చేయాలి. కానీ అలాంటి సమయాల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటం కనిపిస్తోంది.

డివిడెండ్‌ కోసం కాదు...
పెట్టుబడులకు చాలామంది డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటున్నారు. ‘‘ఐదుగురు సభ్యులున్న ఓ కుటుంబానికి 150 ఫోలియోలు ఉండడాన్ని ఓ సందర్భంలో నేను గుర్తించాను. పైగా వారు ఒకే పథకంలో ఒకరికి తెలియకుండా ఒకరు పెట్టుబడులు పెట్టడం కూడా కనిపిం చింది. పైపెచ్చు అవన్నీ కూడా డివిడెండ్‌ ఆప్షన్‌ ఉన్నవే. వారే కాదు, యువ ఇన్వెస్టర్లలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది’’ అని టికా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఈఓ కొఠారి చెప్పారు. కానీ, నిజానికి సంపద వృద్ధి కోరుకునే వారు డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంచుకోకూడదన్నది ఆయన సూచన. లాభాల్లోంచే డివిడెండ్లను చెల్లింపులు చేస్తారు కనుక ఆ తర్వాత ఇన్వెస్టర్ల దగ్గరున్న యూనిట్ల విలువ ఆ మేరకు తగ్గిపోతుంది.

తరచుగా సమీక్ష అక్కరకు రాదు!
దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు అయితే పెట్టుబడి పెడుతున్న ఫండ్స్‌ తమ పనితీరు చూపించేందుకు కొంచెం సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, పెట్టుబడి పెట్టిన మరుసటి రోజు నుంచే వాటి రాబడులను సమీక్షించడం, సరిగా లేకుంటే వాటిని విక్రయించేసి, వేరే వాటిని ఎంచుకోవడం కూడా ఇన్వెస్టర్లు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏ తరహా పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు? మార్కెట్‌ పనితీరు ఎలా ఉంది? వంటి ఎన్నో అంశాలు రాబడులను నిర్ణయిస్తాయి. కనుక ఫండ్స్‌లో పనితీరును సమీక్షించేందుకు కనీసం ఓ ఏడాది పాటు అయినా ఆగాల్సి ఉంటుంది.

జాయింట్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌
ఆర్థిక సలహాదారులు సూచించేదేమంటే జాయింట్‌గా ఇన్వెస్ట్‌ చేయమని. ఇలా చేస్తే ఇన్వెస్టర్లలో ఒకరు అకాల మరణం చెందితే హోల్డింగ్స్‌ రెండోవారి పేరిట సులభంగా బదిలీ చేసుకోవచ్చు. లేదంటే ఆ హోల్డింగ్స్‌ను మార్చుకోవడం పెద్ద ప్రయాసతో కూడుకున్న కార్యక్రమం. కానీ, నిజానికి ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది జాయింట్‌గా ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ అవసరం తెలియని వారు ఎక్కువైతే, తెలిసిన వారు కూడా ఆ దిశగా చొరవ చూపకపోవడం కనిపిస్తోంది.

అధిక వైవిధ్యమూ ఇబ్బందే...
ఎందులో ఇన్వెస్ట్‌ చేయాలి? ఏఏ సాధనాల్లో పెట్టాలి? అన్న విషయమై ఓ ఇన్వెస్టర్‌కు స్పష్టత ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా గత పనితీరు ఆధారంగా, మంచి ప్రచారంలో ఉన్న వాటినే ఇన్వెస్టర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారన్నది ఆర్థిక సలహాదారుల మాట. ‘‘మా దగ్గరకు సలహా కోసం వచ్చే ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో ఈ తరహా ఫండ్సే ఎక్కువగా ఉంటున్నాయి’’ అని ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాదారు ధీరేంద్ర కుమార్‌ పేర్కొన్నారు. అలాగే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఎక్కువ సిప్‌లను నిర్వహించడం కూడా చేస్తున్నారు. ఎన్నో ఫండ్స్‌లో సిప్‌ రూపంలో పెట్టుబడి పెడుతూ అధిక వైవిధ్యాన్ని పాటించడం కనిపిస్తోంది. ఉదాహరణకు రూ.500 చొప్పున పది ఫండ్స్‌లో రూ. 5,000 పెట్టుబడి పెట్టడం కంటే మంచి ఫండ్స్‌ పథకాలు రెండింటిని ఎంచుకుని వాటిలోనే రూ. 5,000ను పెడితే పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. లెక్కకు మిక్కిలి పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువన్నది నిపుణుల అభిప్రాయం. అయితే ఫండ్‌ తీరు విశ్లేషణ శ్రమతో కూడుకున్నదేనని  వారు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement