సుస్వరాలు పలికిన రూతు జీవితం
అనామకురాలైన మోయాబీయురాలు రూతు. బెత్లెహేముకు చెందిన సనాతన యూదుడు ఎలీమెలెకు అతని భార్య నయోమి తమ ఇద్దరు కుమారులతో సహా మోయాబు దేశానికి వలస వెళ్లారు. మోయాబు విగ్రహారాధికులుండే అన్యుల దేశమైనా తమ కుమారులిద్దరికీ మోయాబు అమ్మాయిలనే వివాహం చేశారు. ఇద్దరు కోడళ్లలో రూతు చిన్నది. అక్కడున్న పదేళ్లలో కోడళ్లిద్దరూ విధవరాళ్లుగా మిగిలారు. ఇక చేసేదేమీ లేక నయోమి తిరిగి బెత్లెహేము వెళ్లిపోవాలని నిర్ణయించుకొని మోయాబు స్త్రీలకు తన యూదుల దేశంలో భవిష్యత్తు, సరైన ఆదరణ ఉండదని, అందువల్ల కావాలంటే వాళ్లిద్దరూ మోయాబులోనే ఉండిపోయి పునర్‌వివాహం చేసుకొని భవిష్యత్తును పునర్ నిర్మించుకోవచ్చునని సలహా ఇచ్చింది. పెద్ద కోడలు అందుకు ఒప్పుకుంది కాని రూతు ససేమిరా అంది. ‘నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు’ అని ప్రకటించింది. పట్టుబట్టి అత్తతో సహా బెత్లెహేముకొచ్చింది (రూతు 1:16).
అలా అనామకురాలుగా, అన్యస్త్రీగా, నిరుపేదగా బెత్లెహేముకొచ్చిన రూతు తన సౌశీల్యం, భక్తి, సత్‌ప్రవర్తనతో అనతికాలంలోనే అందరి మన్ననలు పొందింది. బోయజు అనే యూదు వంశీయుడైన భూస్వామి ఆమెను కోరి పెళ్లి చేసుకోగా పుట్టిన ఓబెదు ఆ తర్వాత దావీదు చక్రవర్తికి తాత అయ్యాడు. చివరకు ఆ వంశంలోనే యేసుక్రీస్తు జన్మించగా ఆ రాజవంశం కాస్తా రక్షకుని వంశమయింది. అలా అన్యురాలైన రూతును దేవుడు రాజవంశంలో, రక్షకుని వంశంలో భాగం చేశాడు (మత్తయి 1:5 ; లూకా 3:32).
నిరుపేదగా, అన్యస్త్రీగా రూతు దేవుని ద్వారా పొందిన ఆశీర్వాదాలు అపారం. దేవుడు మట్టి పాత్రల్లో తన మహదైశ్వర్యాన్ని సత్‌క్రైస్తవులమని చెప్పుకునే మనం రూతు కన్నా ఎక్కువగా ఆశీర్వదింపబడాలి కదా? కాని అలా జరగడం లేదు. పగలూ రాత్రి ప్రయాసపడి బోలెడు వ్యవసాయం చేస్తున్నా పిడికెడు గింజలు కూడా పండించలేకపోతున్న ఆత్మీయ దుస్థితి మనది. అన్యురాలైనా రూతుకున్న సౌశీల్యం, సత్‌ప్రవర్తన, భక్తి, కష్టపడేతత్వం, దేవుని పట్ల నిబద్ధత మనలో కొరవడటమే దానిక్కారణం. ‘నీ దేవుడే నా దేవుడు’ అన్న రూతు కృత నిశ్చయం వెనుక, ఆమెలో దేవుని పట్ల తిరుగులేని విశ్వాసముంది.
రూతు నిజానికి ఆ దేవుని ముందు ఎరుగదు. అయినా తన అత్తమామల్లో, భర్తలో ఆ దేవున్ని, ఆయన శక్తిని చూసి విశ్వాసి అయింది. తల్లిదండ్రులు తాత అవ్వల వంటి కుటుంబ పెద్దల్లో దేవుడుంటే, వారిలో ఆయన శక్తి ప్రత్యక్షత ఉంటే, దాంతో తరువాతి తరాల వాళ్లు తప్పక ప్రభావితమవుతారు. దేవునికి దూరంగా నామమాత్రపు క్రైస్తవులుగా బతికే తల్లిదండ్రుల పిల్లల ఆత్మీయ జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మన జీవితాలను దేవుడు మార్చిన రుజువులు లోకానికి, మన పిల్లలకు కూడా చాలా స్పష్టంగా కనిపించాలి. ప్రార్థన, బైబిలు పఠన మన ఆత్మీయ జీవితాల్లో అంతర్భాగం కావాలి. అయితే బైబిలు మన జ్ఞానం పెంచడానికి కాదు, మనల్ని మార్చడానికి ఉద్దేశించబడింది. ఆధునిక జీవనశైలిలో బోలెడు స్వేచ్ఛ, డబ్బు, విలాసాలు, వినోదావకాశాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. కాని దేవునితో ప్రతినిత్యం నిర్దిష్టమైన, నాణ్యమైన ప్రార్థన, వాక్యధ్యాన సమయం గడిపే క్రమశిక్షణ కొరవడింది. ఆత్మీయానందమంతా కారిపోయి చెప్పుకోలేని లోటుపాట్లతో జీవితం తల్లడిల్లుతోంది. తీగలు వేలాడే వయోలిన్ సుస్వరాలనెలా పలుకుతుంది? ఆ తీగల్ని ‘క్రమశిక్షణ’తో బిగిస్తేనే కదా వయోలిన్‌కు సాఫల్యం, సుస్వరాల చైతన్యం!
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్