విలువల పరిధిలో గడపడమే అసలైన ధర్మం
శరీరానికి అనారోగ్యం కలిగితే భౌతిక జీవితం ప్రభావితమవుతుంది. అదే ఆత్మవ్యాధిగ్రస్థమైతే ఇహపర జీవితాలు రెండూ నాశనమౌతాయి. శారీరక అవసరాల పరిపూర్తిపై మాత్రమే శ్రద్ధవహిస్తే, అది పశుప్రాయమైన జీవితం అవుతుంది. అలాగే ఆధ్యాత్మిక అవసరాల పరిరక్షణపై మాత్రమే శ్రద్ధ పెడితే అది దైవదూతలజీవితం అవుతుంది. ఈ రెండింటినీ సమన్వయ పరిచి, రెండిటి అవసరాలు తీరిస్తే, అది మానవ జీవితం.
మానవుడు రెండు వస్తువులు లేదా రెండు పదార్థాల ప్రతిరూపం. ఒకటి శరీరం, రెండు ఆత్మ. ఈ రెండింటి అవసరాలు వేర్వేరు. అందుకని వీటి పోషణ, పరిరక్షణకు దైవం రెండు రకాల వేర్వేరు ఏర్పాట్లు చేశాడు. మాతృగర్భంలోంచి బయటికి రాగానే అమ్మ ఎదలోంచి అమృతధారలాంటి పాల ఏర్పాటు మొదలు, సమాధి గర్భంలోకి వెళ్లేవరకు దైవం ఎన్ని ఏర్పాట్లు చేశాడో ఒక్కసారి ఊహించగలిగితే హృదయం కృతజ్ఞతాభావంతో వినమ్రంగా వంగిపోతుంది. మానవ సృజన మట్టితో జరిగింది కాబట్టి అతని సమస్త భౌతిక అవసరాల పరిపూర్తికి భూ ఉత్పత్తుల నుండే ఏర్పాట్లు చేశాడు దైవం.
మానవుడి భౌతిక అవసరాలన్నీ వీటిద్వారానే పరిపూర్తి అవుతాయి. ముందు చెప్పుకున్నట్లు, మానవుడికి ఆత్మ కూడా ఉంది. దానికీ ఆహారం కావాలి. మనిషి సజీవంగా ఉండాలంటే ఆహారం ఎలా అవసరమవుతుందో, అలాగే ఆత్మ సజీవంగా ఉండాలన్నా దానికీ ప్రత్యేకమైన ఆహారం కావాలి. అయితే శారీరక అవసరాలు తీర్చే ఆహారం దీనికి పనికి రాదు. ఆత్మకు ఆధ్యాత్మిక ఆహారం కావాలి. అంటే దైవిక బోధనలు, దైవప్రవక్తల మార్గదర్శనం, దైవగ్రంథ పారాయణం, సజ్జన సాంగత్యం. వీటి ద్వారానే ఆత్మకు కావలసిన ఆహారం లభిస్తుంది. దేహం, ఆత్మ... ఈ రెండు పరస్పరం భిన్నమైనవి. ఒకటి నాశనమైపోయేది, మరొకటి నాశనం కానిది.
ఒకటి కింది స్థాయికి చెందినది, మరొకటి ఉత్తమశ్రేణికి చెందినది. ఈ రెండిటి మధ్య అసలు పొంతన, సారూప్యత లేనే లేదు. ఎప్పుడూ వీటిమధ్య సంఘర్షణే. ఒకదాని ప్రాబల్యం అధికమైతే, మరొకటి అణిగిపోతుంది. దేని ప్రాబల్యం అధికమైతే, అది మరొక దాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకని ఈ రెండింటి సంస్కరణ, శిక్షణ అత్యంత అవసరం. కేవలం భౌతికతపై మాత్రమే దృష్టి పెట్టి, ఆత్మను పట్టించుకోకపోతే, పైశాచికత్వం ప్రాబల్యం వహిస్తుంది. ఆధ్యాత్మిక ఆహారం లేని ఆత్మ బలహీనమై, వ్యాధిగ్రస్థం కావడం వల్ల మనిషి మానవరూపంలోని దానవుడుగా మారే ప్రమాదమూ ఉంది.
ఒకవేళ ఆధ్యాత్మిక వికాసానికే అధిక ప్రాధాన్యతనిచ్చి, భౌతిక అవసరాలను అణచివేసి, ఆత్మవికాసం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే, మానవుడు ఐహికజీవితాన్ని త్యజించి, ఇల్లూవాకిలీ, భార్యాపిల్లలను వదిలేసి, అడవుల్లోకి పారిపోతాడు. ఈవిధమైన సన్యాసత్వం వల్ల మానవ జీవిత ఉద్దేశ్యమే మరుగున పడుతుంది. ఈవిధమైన రెండు అతిశయాలకు అతీతంగా, మధ్యేమార్గాన్ని అవలంబిస్తూ విలువలతో కూడిన ధర్మబద్ధమైన జీవితం గడపడమే మానవ జీవిత లక్ష్యం. అటుపూర్తిగా ఐహిక వ్యామోహంలో పడటం... ఇటు పూర్తిగా ఆధ్యాత్మికంలో పడి సామాజిక బాధ్యతలనుండి పారిపోవడం రెండూ అతిశయాలే, ధర్మవ్యతిరేక మార్గాలే. ఈ రెంటికి భిన్నంగా ఐహిక జీవితాన్ని నైతిక, ఆధ్యాత్మిక విలువల పరిధిలో గడపడమే అసలైన దైవధర్మం.
-యండి. ఉస్మాన్‌ఖాన్