వ్యక్తిత్వం పువ్వులా వికసించాలి | Personality blooms like a flowers | Sakshi
Sakshi News home page

వ్యక్తిత్వం పువ్వులా వికసించాలి

Published Sun, May 22 2016 12:27 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

వ్యక్తిత్వం పువ్వులా వికసించాలి - Sakshi

వ్యక్తిత్వం పువ్వులా వికసించాలి

విద్య - విలువలు
‘వ్యక్తిత్వ వికాసం’ అనే మాట ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. వికసనము - అన్న మాటకు అర్థం.. క్రమక్రమంగా విచ్చుకొనుట, వికసించుకొనుట - అని. సాధారణంగా దీన్ని పువ్వు విషయంలో వాడతాం. పువ్వు అనేక రేకులతో ఉంటుంది. తొలిదశలో మొగ్గగా ఉంటుంది. ఆ దశలో దాని రేకులు బలవంతంగా తుంచే ప్రయత్నం చేస్తే దానిలో నుంచి పసరిక వాసన వస్తుంది. కానీ అదే మొగ్గ సూర్యకిరణాల స్పర్శతో వికసనాన్ని పొందుతుంది. దాని మధ్యలో ఉన్న దిమ్మచుట్టూ ఆ రేకులన్నీ క్రమపద్ధతిలో విచ్చుకుని, వికసనం పొందిన పువ్వు సువాసనలు వెదజల్లుతూ ఎంతో అందంగా ఉంటుంది.

అలా సుగుణాలతో వికసనం పొందిన వ్యక్తి ఎక్కడ ఏ పదవిలో ఉన్నాడన్న దానితో సంబంధం లేకుండా ఎవరితో ఏ అనుబంధం ఉన్నా ఆ వ్యక్తివల్ల ఒక మార్గదర్శనం లభిస్తుంది. అటువంటి వ్యక్తిని అనుసరించినవారికి మనశ్శాంతి లభిస్తుంది. అతను ఉన్నచోట అందరికీ కూడా ‘‘మనకు ఇక్కడ ఒక పెద్ద దిక్కు ఉన్నాడు’’ అన్న ఉపశాంతి లభిస్తుంది. అలా తయారుకావడానికి అవసరమైన మంచి గుణాలు సంతరించుకునే ప్రక్రియను ‘వ్యక్తిత్వ వికాసం’ అంటారు. దీనికీ చదువుకూ సంబంధం లేదు.

 ఇవి అందరికీ పుట్టుకతో వచ్చే గుణాలు కావు. ప్రయత్నపూర్వకంగా తెలుసుకుని జీవితపర్యంతం అనుష్ఠించాలి. ఇది లేనప్పుడు ఎంత చదువున్నా అది నిష్ర్పయోజనం. ప్రయోజనం లేకపోగా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పల్లెపట్టున ఉండి ఏమీ చదువుకోని వ్యక్తి చేయదగిన పెద్దనేరం జేబు దొంగతనం లేదా ఇళ్ళల్లో దొంగతనం. అదే బాగా చదువుకున్న వ్యక్తి, తనకింద పనిచేస్తున్న వందమందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి దోషభూయిష్టంగా ప్రవర్తించి తప్పులు చేస్తే, ఆ తప్పులు తప్పులు కావని తన మేధస్సుతో నమ్మించడానికి వాటిని ఒప్పులుగా నిరూపించే ప్రయత్నం చేశారనుకోండి. అటువంటి వ్యక్తిని కట్టడి చేయడం అంత తేలికైన విషయమేమీ కాదు. ‘నీవిలా ప్రవర్తించకూడదు’ అని తన కింద పనిచేసే వందలమందికి చెప్పడానికి సాహసించడు. అందుకే వికసించిన వ్యక్తిత్వంతో కూడిన జీవితం అందరికన్నా ముందు - బాగా చదువుకున్నవాళ్ళకే ఉండాలి.

 ‘వికాసం’ అన్న అంశంలో ఐదు లక్షణాలుంటాయి. మొట్టమొదటిది ఆరోగ్యం. ఇది శరీర సంబంధమైనది. తరువాత వరుసగా అత్యవసాయం, ఆలోచనలో సునిశిత ప్రజ్ఞ, సర్వకాల సర్వావస్థల్లో ఆవేశంలో సమతౌల్యత. చివరిది ఆధ్యాత్మికమైన ప్రగతి. ఈ ఐదింటినీ కలిగి ఉన్నవారు ‘‘వీటిని పూర్తిగా సంతరించుకున్నాను, నా వశం చేసుకున్నాను’’ అని చెప్పడం కూడా ఏ ఒక్కరికీ ఎప్పుడూ సాధ్యపడదు. కారణం - అది నిరంతర ప్రక్రియ.

 బతికున్నంతకాలం ఈ ఐదూ కొనసాగుతూనే ఉంటాయి. అందుకే వికసనం, విచ్చుకోవడం కాలం గడిచే కొద్దీ  జరుగుతూనే ఉంటుంది. అది ఎవరు అలవాటు చేసుకున్నారో  వారు చాలా వృద్ధిలోకి వస్తారు. దీన్నే ఆంగ్లంలో చెప్పాలంటే  ‘One should be physically fit, mentally alert, interllectually sharp, emotionally well balanced and spiritually elevated.

ఈ ఐదు లక్షణాలు జీవితపర్యంతం సాధన చేస్తున్నవారు తగినవిధంగా వ్యక్తిత్వ వికాసాన్ని పొంది ఉంటారు. మన పౌరాణిక వాఙ్మయాన్ని పరిశీలిస్తే ‘వీరు మహాత్ములు’ అని ఎవరిని మనం పౌరాణికంగా ప్రస్తావిస్తుంటామో వారందరిలో ఈ ఐదు లక్షణాలు కనబడతాయి.

 మొదటిది - ఆరోగ్యం : పరమేశ్వరుడు మనకు శరీరమనే అద్భుతమైన సాధనాన్నిచ్చాడు. ఇది ఎక్కడికో అంగట్లోకి వెళ్ళి తెచ్చుకున్నది కాదు. 80లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి మాత్రమే శరీరంతోపాటూ బుద్ధిని, కంఠాన్ని (వాక్కును) కూడా ఇచ్చాడు. పక్షిలా ఎగరలేకపోయినా, చేపలాగా ఈదలేకపోయినా ఈ బుద్ధిబలం చేత నీళ్ళలో, గాలిలో వెళ్ళగల శక్తి (ఓడలు, విమానాల ద్వారా) సమకూర్చుకోగలిగాడు. నెమలిని చూసి నృత్యాన్ని, కోకిలను అనుకరించి గానాన్ని నేర్చుకున్నాడు. ఇంతటి ప్రజ్ఞ సమకూర్చుకోవడమేగాదు, ప్రదర్శించగలుగుతున్నాడు.

 అయితే ఇంతటి ప్రజ్ఞకు ఆధారభూతమైన శరీరాన్ని జాగ్రత్తగా పోషించకపోతే అనారోగ్యం చేత నశించిపోతుంది. దీన్ని నిరంతరం ఆరోగ్యంగా నిలబెట్టాలంటే దీని గొప్పతనమేమిటో ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మహాత్మాగాంధీ తన జీవిత చరిత్రలో ఇలా రాసుకున్నారు - ‘‘ నేను చిన్నతనంలో ఆటలాడేవాణ్ణికాను, అందరూ ఆడుకునే సమయంలో అవి మానేసి వెళ్ళిపోయిన కారణంగా నా శరీరం ఆరోగ్యంగా తయారుకాలేదు. తరచూ వ్యాధులకు గురవుతుండేవాడిని. రోగనిరోధక శక్తి తక్కువైపోయింది.

అందుకే పిల్లలు  ఆ వయసులో ఆటలు బాగా ఆడాలి అని చెబుతుంటాను’’ అని రాసుకున్నారు. ఆటల ద్వారా వ్యక్తిగత మనస్తత్వం కంటే జట్టు మనస్తత్వం ఏర్పడుతుంది. అంటే పెద్దయిన తర్వాత కూడా ఈ టీం స్పిరిట్ జీవితంలో ప్రతి దశలో ముందుకు తీసుకెడుతుంది.’’ మేం ఎప్పుడూ గెలవాలి. అందరికంటే ముందుండాలి’’ అనే భావన కేవలం మీరు ఆడే అటల్లోంచే వస్తుంది. ఏ వయసులో ఉన్న వాళ్ళు ఆ వయసుకు తగ్గ వ్యాయామం నిరంతరం చేస్తుండాలి. యజుర్వేదం కూడా శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఒక మంత్రంలో నొక్కి చెపుతుంది.

 వికాసం అనేది అకస్మాత్తుగా ఒక్కరోజులో వచ్చి ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి. వ్యాయామమే కాదు, దాని ఆరోగ్యం కాపాడాలంటే చక్కటి పోషకాహారం అందించాలి. నా చిన్నతనం నుండీ ఉద్యోగంలో చేరేవరకూ అమ్మపెట్టే చద్దన్నం తినడం మినహా ఫలాహారం (బ్రేక్‌ఫాస్ట్) అంటే మరేదీ తెలియదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఉదయం తీసుకునే ఆహారం పెరుగన్నం మాత్రమే. దీనిని ‘మాత్రా ప్రసాదం’ అంటారు.

నిజానికి అది ‘మాత్రా’ కాదు, ’మాతృప్రసాదం’. వకుళమాత దగ్గర తయారుచేస్తారు. పెరుగన్నం తయారుచేసి కొత్తకుండ పగులగొట్టి, కుండ పెంకులో ఈ అన్నం పెట్టి కులశేఖరుపడి ఆళ్వారు దాటి లోపలకు తీసుకెడతారు. మిగిలినవి ఎన్ని ప్రసాదాలు చేసినా ప్రధాన గడపకు ఇవతలే ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఏం తింటారంటే..అమ్మచేత్తో పెట్టిన పెరుగు-అన్నం. ఇది ఉదయాన్నే తింటే విశేషమైన బలం ఇస్తుంది. రాత్రిపూట తినగూడదు. త్వరగా జీర్ణం కాదు.

 అందువల్ల పిల్లలందరూ కూడా బాగా ఆటలాడడం ద్వారా వ్యాయామం చేసి, తాజా ఆహార పదార్ధాలతో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉండడమన్నది మానవ ప్రయత్నంగా ఉంటుంది. ఆరోగ్యం లేక మంచాన పడితే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఏం ప్రయోజనం? మనం మనకే కాదు, పదిమందికీ పనికిరావాలి అంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే వ్యక్తిత్వ వికాసంలో మొదటిమెట్టు విజయవంతంగా ఎక్కినట్టే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement