సాహిత్య మరమరాలు
భావకవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు పరంపరలోనివారు మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి. ఈయనకు ఫలహారాల మీద కొంత మోజు. ఏ స్నేహితుడినో కలవడానికి ఏ ఊరైనా వెళ్తే, ఉదయం అల్పాహారమైనా, మధ్యాహ్న భోజనమైనా వడ్డించింది తినేసేవారుగానీ సాయంత్రం మాత్రం ఫలహారం మీదికి ఆయన మనసు పోయేది. మరి దాన్ని నేరుగా అడగలేరు కదా, అందుకని, ‘ఈ వేళప్పుడు ఈ ఊళ్లో ఏం తింటారూ?’ అని దీర్ఘం తీస్తూ అడిగేవారు. అప్పుడు ఆతిథ్యం ఇచ్చినవాళ్లు ఆయన అంతరంగాన్ని గ్రహించి, ఏదైనా చేసిపెట్టాలి. ఇలా ఆయన అడిగేతీరు నెమ్మదిగా అందరికీ తెలిసిపోయింది.
ఒకసారి ఆయన బందరులోని కృష్ణాపత్రిక ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఏడెనిమిది మంది కవులు కూర్చునివున్నారు. అందులో ‘పింగళి(లక్ష్మీకాంతం) –కాటూరి’ జంట కవుల్లో ఒకరైన కాటూరి వేంకటేశ్వరరావు ఒకరు. సాయంత్రం అవుతోంది. సుందరరామశాస్త్రికి ఫలహారం మీదకు మనసు లాగుతోంది. తన అలవాటైన శైలిలో ‘ఈ వేళప్పుడు ఈ ఊళ్లో ఏం తింటారూ?’ అని ‘సభ’ను ఉద్దేశించి ప్రశ్నించారు. కాటూరి చప్పున, ‘చీవాట్లు తింటారండి’ అని అదే తరహాలో జవాబిచ్చారు. అందరూ నవ్వుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment