మాట్లాడే కంప్యూటర్.. ఈ అమెజాన్ ఎకో!
ఏ అంశంపైనైనా మీకు సందేహమొస్తే ఏం చేస్తారు? ఏముంది కంప్యూటర్ ముందు కూర్చుంటారు. గూగుల్‌లో వెతికి సందేహాలను తీర్చుకుంటారు. అంతేకదా... మరి... వంటింట్లో స్టవ్‌పై బిర్యానీ వండుతున్నప్పుడు అందులో ఏఏ మసాలాలు వేయాలో మరచిపోతే? హోంవర్క్‌లో వచ్చే ఆల్జీబ్రా ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పమని మీ అబ్బాయి అడిగితే? చేసే పనులు ఆపేసి కంప్యూటర్ ముందు కూర్చోలేరుగా? మీలాంటి వారి కోసం అమెజాన్ అభివృద్ధి చేసింది... అమెజాన్ ఎకో.
చూసేందుకు ఓ స్పీకర్ మాదిరిగా ఉంటుందిగానీ.. నిజానికి ఇదో మాట్లాడే కంప్యూటర్ అంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్‌తో అనుసంధానమైన స్మార్ట్ పరికరాలన్నింటినీ దీని సాయంతో నియంత్రించవచ్చు. ఉదాహరణకు... ఫిలిప్స్ లైటింగ్ సిస్టమ్‌ను తీసుకుంటే మాటలతోనే ఫలానా గదిలో లైట్ ఆఫ్ చేయమనో... లేదా ఆన్ చేయమనో ఆదేశించవచ్చు. రిఫ్రిజరేటర్, గీజర్, మైక్రోవేవ్ ఓవెన్ ఇలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో పనిచేయగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది.
ఏమేం పనులు చేస్తుంది అంటున్నారా? ‘‘అలెక్సా... ’’ అని మొదలుపెట్టి ఎలాంటి ప్రశ్న వేసినా ఠక్కున సమాధానం చెబుతుంది. నచ్చిన సంగీతాన్ని ప్లే చేయడం, మీ క్యాలెండర్ ఆధారంగా బంధు మిత్రుల పుట్టినరోజులు, ఇతర విషయాల గురించి గుర్తు చేయడం, అలారంలా కూడా పనిచేయగలదు. అంతేకాకుండా... నిత్యవ్యవహారాల్లో మనకు వచ్చే అనేకానేక సందేహాలకు మాటల్లో సమాధానం చెబుతుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న దీని ధర దాదాపు రూ.20 వేలు!