‘అనగనగా ఒక రాజు... అనగనగా ఒక రాణి’... అంటూ ఆయన గురించే పాడుకున్నారు. ‘రాజశేఖరా.. నీపై మోజు తీర లేదురా’ అని నిండు దర్బార్‌లో ఆయనకే స్తోత్రాలు విడిచారు. ఎస్.వి.రంగారావు. వెండితెర సింహం. కాని ఈ సింహానికి గర్జిండమే కాదు.. వీనులకు విందు కలిగించే పాటకు తల ఆడించడం తెలుసు. పెదాలు తోడు కలపడం కూడా తెలుసు. ఎస్.వి.రంగారావంటే అందరికీ ఆయన మాటలే గుర్తుకొస్తాయి. భీషణ భాషణలే మతికి వస్తాయి. కాని వెండితెర మీద ఆయనకు మంచి పాటలు కూడా దక్కాయి. కొన్ని ఆయన పాడాడు. కొన్నింటిని ఆయన కోసం పాడారు. కొన్నింటిని ఆయన విన్నాడు. ‘నర్తనశాల’లో సైరంధ్రి అను సావిత్రి ఆయన కోసం పాడింది. పరస్త్రీ మీద ఆశ పడిన ఆ యొక్క కీచకుడిని మాయ చేయడానికి ‘దరికి రాబోకు రాబోకు రాజా’ అని పాడింది. ఆ సరసానికి ఆయన మురిసిపోయాడు. చివరకు ఆమె పరిష్వంగానికి బదులు మృత్యుపరిష్వంగంలోకి వెళ్లాడనుకోండి. అది వేరే విషయం.
ఎస్.వి.ఆర్ కెరీర్ మొదలులోనే ఆయనకు ‘బంగారుపాప’లో ఎంతో మంచి పాట దొరికింది. మాధవపెద్ది సత్యం గొంతు ఆయనకు సరిగ్గా సరిపోతుందని అప్పుడే అందరికీ అనిపించింది. పాపాయిని నిద్దరుచ్చడానికి కృష్ణశాస్త్రి అందించిన మాటలను ఎస్.వి.ఆర్ ఎంతో ఆర్ద్రతతో అభినయిస్తాడు. ‘తాధిమి తకధిమి తోల్‌బోమ్మ.. దీని తమాష చూడవె కీల్‌బొమ్మ’ అని తన మునివేళ్లతో అట్టబొమ్మతో పాటు ప్రేక్షకులను కూడా ఆడిస్తాడు. కాని ఆయన రాక్షసుడు. కంసుడు ఆయనే. హిరణ్యకశిపుడు ఆయనే. భస్మాసురుడూ ఆయనే. ‘మోహినీ భస్మాసురుడు’లో ఆయన తన రాక్షస ప్రతిభతో ఏకంగా డాన్సింగ్ స్టార్ పద్మినితోనే పదం కలుపుతాడు. ‘విజయమిదిగో లభించే’ పాటలో తాండవం ఆడి చూసేవారికి భయోద్విగ్న అనుభూతి కలిగిస్తాడు. అయితే ‘మాయాబజార్’ వచ్చేసరికి ఆయన అందరికీ ప్రియమైన రాక్షసుడు అయ్యాడు. అందులో ఆయన తెలుగువారికి శాశ్వతంగా ఒక భోజనపు గీతం ఇచ్చాడు. ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు’... లడ్లను ఎగరేసి తిని మనకు తీపి మిగిల్చాడు. సావిత్రిలా ‘అహ నా పెళ్లి అంట’ పాడుతూనే మధ్యలో తనలాగా మారి ‘తధోంతోంతోం’ అని బెదరగొట్టి నవ్విస్తాడు.
సోషల్ పిక్చర్స్‌లో ఆయన పాటలు ఘంటసాల గొంతుతో గుండెల్లో బరువు నింపుతాయి. జీవనమర్మాలు విప్పి చెబుతాయి. ‘బాబూ... వినరా... అన్నాదమ్ముల కథ ఒకటి’... ‘పండంటి కాపురం’లో ఈపాట ఆయన పాడుతుంటే మనింట్లో కూడా ఇలాంటి పెదనాన్న ఉండాలని అలాంటి నీడ కింద బతకాలని అనిపిస్తుంది. ‘లక్ష్మీ నివాసం’లో ‘ధనమేరా అన్నింటికీ మూలం... ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’ పాట ఈ కలికాలంలో గీతోపదేశం కాకుండా ఎలా ఉంటుంది. ‘తాత మనవడు’లో ‘అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం... ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం’ అని ఆయన నిర్థారిస్తూ ఉంటే కాదనడానికి సిగ్గేస్తుంది. అయితే ఎస్.వి.రంగారావు అల్లరి పాటలు పాడలేదా? పాడాడు. ‘అందరూ దొంగలే’లో నాగభూషణంతో కలిసి ‘చంటి బాబు.. ఓ బుజ్జిబాబు.. నీ పంట పండితే నవాబు’ చాలా సరదాగా ఉంటుంది. చలం చేసిన ‘సంబరాల రాంబాబు’లో ఎస్.వి.రంగారావు పాత్రే కీలకం. ‘విన్నారా విన్నారా ఈ వింతను విన్నారా... సంబరాల రాంబాబు శ్రీమంతుడయ్యాడు’ అని చాలా సందడి సృష్టిస్తాడు.
తెలుగులో చాలా అందమైన పాటలకు ఆయన శ్రోత. ప్రమేయకర్త. ‘బాలభారతం’లో ‘మానవుడే మహనీయుడు’ అని ఆయన సమక్షంలోనే తెలుస్తుంది. ‘మిస్సమ్మ’లో అమాయక జమీందారులా ఆయన ఆ దొంగ మొగుడూ పెళ్లాల పాటలు ఎన్ని వినలేదు. ‘రావోయి చందమామ’ అని వాళ్లు పడితే ఆ వెన్నెల తన పిల్లలదే అనుకున్నాడు. ఆయన రేడియోలో వినడం వల్లే ‘ఇది మల్లెల వేళ అనీ’ పాటకు భావ గాంభీర్యం వచ్చింది. ‘దేవుడు చేసిన మనుషులు’లో ‘విన్నారా.. అలనాటి వేణుగానం’ పాటలో పాడే ఎన్.టి.ఆర్‌తో పాడని ఎస్.వి.ఆర్ అంతే సరిగ్గా తుల తూగుతాడు. సామర్ల వెంకట రంగారావు అను ఎస్.వి. రంగారావు మన మనోరంజనం కోసం వెండితెర మీద మాట్లాడాడు. పద్యాలు పాడాడు. పాటలు వినిపించాడు. నేడు ఆయన జయంతి. ఒకనాటి ఆ నటుడికి కృతజ్ఞతగా నేటికీ ముకుళితం అయ్యే చేతులు ఉన్నాయని చెప్పడానికే ఈ చిన్న నివాళి. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment