షాపింగ్ మాల్‌నంతా కొని తెచ్చుకున్నా, మళ్లీ పచారీ కొట్టుకు పరుగులు తీస్తున్నారంటే.. మీ బడ్జెట్ తప్పిందనే. హెడేక్‌ను మీరు కొని తెచ్చుకున్నారనే!
‘‘పది మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్స్, అయిదు పాస్తా పాకెట్లు, పన్నెండు బాంబినో ఇన్‌స్టంట్ సూప్ ప్యాకెట్స్, మల్టీగ్రెయిన్ పిండి, ఇన్‌స్టంట్ ఉప్మా, పులిహోర పాకెట్లు, ఇడ్లీ, దోశపిండి, బటర్, చీజ్...’’ కప్‌బోర్డ్‌లోంచి కొన్ని, ఫ్రిజ్‌లోంచి కొన్ని తీసి కింద పడేసిన వస్తువుల జాబితా చదువుతూ చదువుతూ ఆగిపోయింది బబిత ఉస్సూరుమంటూ. ‘‘మేడమ్.. ఇంకా ఉన్నాయ్’’ పనమ్మాయి నందా అంటోంది. ‘‘హూ..’’ నిట్టూరుస్తూ ‘‘ఇంతకీ ఇప్పుడు కావల్సిన పసుపు, ఎండు మిరపకాయల పాకెట్లు ఉన్నాయా? లేవా?’’ అడిగింది బబిత.‘‘ప్చ్..’’ లేవన్నట్టు చేతులు తిప్పుతూ నిలుచుంది నందా. ‘‘పచారీ కొట్టుకు పరిగెత్తాల్సిందే కదా..’’ – హాల్లోంచి వంటగదిలోకి వస్తూ బబిత అత్తగారు. సమాధానం ఇవ్వకుండానే ఫ్రిజ్‌పైన కవర్‌లోంచి రెండు వందల రూపాయల నోటు తీసి నందాకు ఇచ్చింది బబిత... వెంటనే వెళ్లి వాటిని తెమ్మన్నట్లు. ‘‘మా కాలంలో ఒక్కసారి లిస్ట్‌రాసి పంపిస్తే నెలకు సరిపడా సరకులు ఇంటికొచ్చి పడేవి. మళ్లా నెల దాకా పచారీ కొట్టు మొహం చూసే వాళ్లం కాదు. అవసరమైనవి తప్ప అనవసరమైనవి వచ్చేవీ కావు’’ అంటూ నేల మీద చిన్న రాశిగా పోగేసి ఉన్న పాకెట్లలోంచి ఓ పాకెట్ తీసింది పెద్దావిడ.. ముక్కు మీదకు జారిన కళ్లద్దాలను సవరించుకుంటూ ఆ పాకెట్ మీదున్న ఎక్స్‌పైరీ డేట్ చూసే ప్రయత్నం చేస్తూ.ఇంకా అక్కడే ఉంటే అత్తగారు తన హయాంలోని రామాయణాన్ని వినిపిస్తారని గబగబా హాల్లోకి వచ్చేసింది కానీ ఆవిడ మాటల్లోని నిజాన్ని మాత్రం మెదడులోంచి తీసేయలేకపోయింది బబిత. నిజమే.. సూపర్‌మార్కెట్ల మాయలో అవసరమైనవే కాకుండా అనవసరమైనవి ఎన్ని వస్తున్నాయి ఇంటికి! ఆలోచనలో పడింది బబిత.
సూపర్‌మార్కెట్.. శ్రావ్యమైన సంగీతం.. అద్దాల అల్మారాలు.. అందమైన ర్యాక్‌లు.. ఆకర్షణీయమైన ప్యాక్‌లు.. ట్రాలీ పట్టుకొని ఏ వస్తువు నచ్చితే ఆ వస్తువు దగ్గరకు వెళ్లే సౌకర్యం.. దేన్నయినా మనమే తీసుకొని ట్రాలీలో వేసుకునే వెసులుబాటు. అందుకే పర్స్‌లో తెచ్చుకున్న డబ్బు అయిపోవడంతోపాటు పాటు క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, కార్పొరేట్ ఆఫీస్‌లు ఇచ్చే ఫుడ్ కార్డ్‌లూ స్వైప్ మిషన్‌లో సర్రుమంటాయి!
పర్యవసానం
‘‘తెచ్చుకున్న లిస్ట్ అలాగే ఉంటుంది. లిస్ట్‌లోలేని సరుకులు ట్రాలీ నిండుతాయి. వేసుకున్న బడ్జెట్ ఓవర్ అయిపోయి.. డెట్‌లో పడిపోతాం’’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన ఎన్. శైలజ. ఆమె నిమ్స్ ఉద్యోగి. ‘‘వర్కింగ్ ఉమన్‌ని కాబట్టి ఈ సూపర్‌మార్కెట్ల ఎంట్రీ హ్యాపీగానే అనిపించింది మొదట్లో. కిరాణా షాప్‌లో లిస్ట్ ఇస్తే కావల్సిన సరకులు ఇంటికొచ్చేవి. కాని పప్పులు, బియ్యాలు శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది. సూపర్‌మార్కెట్లోనైతే అలాంటి బాదర బందీ ఉండదు. చక్కగా నీట్‌గా ప్యాక్ చేసి ఉంటాయి. దాదాపు పదేళ్ల నుంచి సూపర్ మార్కెట్లోనే కొంటున్నాను. అయితే ఈ పదేళ్లలో ఏ నెల కూడా నేను వేసుకున్న బడ్జెట్‌లో సరుకులు రాలేదు. ఓన్లీ పప్పులు, ఉప్పు, చింతపండు, ఎండు మిర్చి, నూనె, సబ్బులు, షాంపూలకు వెళితే నాలుగు రకాల షాంపూలు, నాలుగు రకాల సబ్బులు, రెండు రకాల వంట నూనెలు, డిష్ వాష్ లిక్విడ్ సోప్, రెండు రకాల హ్యాండ్ వాష్‌లు ఎట్‌సెట్రా తీసుకెళ్తా. బడ్జెట్ ఎక్కువై పోతుందని ఒకసారి పచారీ కొట్టు నుంచి సరుకులు తెప్పించా. మా ఇంట్లో నలుగురం ఉంటాం.. రెండున్నర వేలల్లో బియ్యంతోపాటు సరుకులన్నీ వచ్చాయి. అదే సూపర్‌మార్కెట్‌కి వెళితే ఏడు వేలు దాటుతుంది. అవసరమైనవి మైనస్ అవుతాయి’’ అని చెప్పారు శైలజ.
క్రెడిట్ కార్డ్స్‌తో డెబిటే
నిజామాబాద్‌కు చెందిన లక్ష్మీతివారి అనుభవం కూడా ఇంచుమించు ఇలానే ఉంది. ‘‘పచారీ కొట్టు అంటేనే పరిమితమైన బడ్జెట్ అని. చచ్చు, పుచ్చులు వచ్చినా వెళ్లి తిరిగి ఇచ్చే సౌకర్యం ఉండేది.సూపర్‌మార్కెట్లోనూ ఉన్నా.. అదో పెద్ద ప్రహసనం. ఎవరికి ఎవరు పూచీకత్తు అన్నట్టే ఉంటుంది. డబ్బులుంటేనే వస్తువులు. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ వచ్చి డబ్బులు లేకపోయినా వస్తువులు వస్తున్నాయి. పద్దు హద్దు దాటుతోంది. అంతేకాదు ఉన్నవి డబుల్ డబుల్ ఉంటున్నాయి. లేనివి అసలే ఉండట్లేదు. వాటి కోసం మళ్లీ వీధిలో ఉన్న కిరాణా షాప్‌కి పరిగెత్తడమే. ఏం సుఖం? శ్రమ, డబ్బులు అన్నీ వేస్ట్. క్రెడిట్ కార్డ్స్‌తో అప్పులు’’ అని అంటున్నారు లక్ష్మి.
పరిష్కారం ఏమిటి?
ఇంటికి అవసరమైనవి. మాత్రమే లిస్ట్ చేసుకొని.. వాటి కోసమే సూపర్‌మార్కెట్‌కి వెళితే మంచిది. వీలైనంత వరకు ఇన్‌స్టంట్ ఫుడ్ జోలికి వెళ్లకుండా.. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్‌ను ఇంట్లోనే వదిలేసి.. క్యాష్‌నే క్యారీ చేస్తే.. సూపర్‌మార్కెట్లనూ మన బడ్జెట్‌లోనే బంధించొచ్చు అని అనుభవంతో సలహా ఇస్తున్నారు శైలజ, లక్ష్మిలాంటి వినియోగదారులు.
వాడేది తక్కువ.. పడేసేది ఎక్కువ
ఇన్‌స్టంట్ ఫుడ్ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచయితే చెప్పక్కర్లేదు. అంతకు ముందు ఆఫీస్ నుంచి రాగానే చక్కగా ఇడ్లీ, దోశకు పిండి మిక్సీలో పట్టి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇన్‌స్టంట్ కనిపించేసరికి బద్దకం ఎక్కువై పాకెట్లు కొనేసుకోవడమే. ఉప్మా, పులిహోర అన్నీ. టేస్ట్ నచ్చక.. వాడేది తక్కువ, పారేసేది ఎక్కువ. డబ్బు దండగా.. ఆరోగ్యమూ పాడు.
– శైలజ
పచారీ కొట్టు తీరే వేరు
పచారీ కొట్టు ఓ షాప్‌లా కాకుండా.. ఓ ఫ్రెండ్‌షిప్‌లాంటిదిగా ఉండేది. ఇంట్లో పిల్లలను పంపించి ఫలానా ఇంటి వాళ్లం.. ఫలానా వస్తువు కావాలి.. రాసి పెట్టమన్నారు అని చెబితే చాలు ఆ వస్తువు ఇంటికి వచ్చేసేది. అంటే అంత నమ్మకం ఉండేది. సూపర్‌మార్కెట్లలో ఆ క్రెడిట్ ఉండదు కదా!
– లక్ష్మీ తివారీ
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment