అవును! వీళ్లకూ అక్కా చెల్లెళ్లు ఉన్నారు!
క్రైమ్ పేరెంటింగ్
అమ్మ మీద అరిచేవాడు..
చెల్లెలి జుట్టు పట్టి లాగేవాడు..
నానమ్మతో చాకిరీ చేయించుకునేవాడు..
వీధిలో ఆడపిల్లల్నిగౌరవిస్తాడా?!
మనింట్లో అబ్బాయికిడిమాండ్ ఎక్కువ.
ఆ అబ్బాయికి..అమ్మాయి మీదకమాండ్ ఎక్కువ.
వీళ్లకు అక్కాచెల్లెళ్లు ఉంటారు.
గౌరవమే ఉండదు.
ఈవ్ టీజింగ్‌కిఇల్లే బిగినింగ్ పాయింట్.
ఈవ్ టీజింగ్‌నుఇంట్లోనే తుంచేస్తే..
బయట మన ఆడపిల్లలు నిశ్చింతగా ఉంటారు.
హైదరాబాద్... అమీర్‌పేట్.
సాయంకాలం ఏడున్నర గంటలు.. బస్టాప్‌లో అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారు. అర్చనకు కొంచెం బెరుకుగా ఉంది. అక్కడ గుంపుగా ఉన్న మగవాళ్లను చూసి అనుకుంది.. ‘ఛ.. అనవసరంగా ఫ్రెండ్ వాళ్లింటికి వెళ్ళాను. కాలేజ్ అయిపోగానే నేరుగా ఇంటికెళితే బాగుండేది’ అని. స్టాప్‌లో కాకుండా కాస్త దూరంగా వచ్చి నిలబడింది బస్ కోసం ఎదురుచూస్తూ! మగవాళ్లలోని గుంపులో అయిదుగురు యువకులు అర్చనను చూసి వాళ్లలో వాళ్లు కళ్లతో సైగ చేసుకున్నారు. ముందు ముగ్గురు వెళ్లి అర్చనకు కుడివైపు నిలబడ్డారు. ‘రేయ్.. టైమ్ ఎంతరా?’ అడిగాడు ఒకడు కాలర్ పైకి లాక్కుంటూ. ‘ఏడున్నర మామా’ చెప్పాడు ఇంకొకడు సెల్‌ఫోన్‌లో టైమ్ చూస్తూ. ‘ఏడున్నర వరకు కాలేజ్ ఉంటుందా మామా?’ అన్నాడు మూడోవాడు. ఇంతలోకే మిగిలిన ఇద్దరూ వచ్చి అర్చన ఎడమవైపు నిలబడ్డారు. ‘నాకు ఏడున్నర దాకా క్లాసెస్ ఉంటాయ్ మామా’ అన్నాడు ఎడమవైపు నిలబడ్డవాడు. ‘ఇంట్లో చెప్పావా మరి?’... అడిగాడు ఎడమవైపు నిలబడ్డ రెండోవాడు. ‘మామా.. మొహం చూస్తే బాయ్‌ఫ్రెండ్స్.. సారీ .. గర్ల్ ఫ్రెండ్స్‌ని మెయిన్‌టైన్ చేసేవాడిలా కనపడ్తున్నానా?’ అన్నాడు కుడివైపు ఉన్న మొదటి వాడు.
‘ఏమో... ఎవరికి తెలుసు?’ అన్నాడు మూడోవాడు. వీళ్ల మాటలకు ఇబ్బంది పడుతోంది అర్చన. అవి తనను ఉద్దేశించే అని ఆ అమ్మాయికి అర్థమైంది. ఇంకాస్త ముందుకెళ్లింది. ఈ అయిదుగురూ అడుగులు కదిపారు ఆమె కేసి. ‘పేరేంటి?’ అయిదుగురిలో ఒకడు అడిగాడు అర్చన వైపు తిరిగి. తీక్షణంగా చూసింది అర్చన వాడిని. ‘మిమ్మల్నికాదు.. మావాడిని అడుగుతున్నా’ అంటూ ఆ నలుగురిలో ఒకడిని ‘రేయ్.. నిన్నేరా పేరు అడిగితే చెప్పవేంటి?’ అన్నాడు రెట్టిస్తూ.‘మర్చిపోయా మామా’ అన్నాడు వాడూ అర్చననే చూస్తూ!‘ఏ కాలేజ్‌రా..?’ మళ్లీ ప్రశ్న.అసహనంగా కదిలింది అర్చన. ‘అరే.. డ్రెస్ బాగుంది ఎక్కడ కొన్నావ్? మిక్స్ అండ్ మ్యాచా..’ అడిగాడు వాళ్లలో ఒకడు అర్చన చున్నీ పట్టుకుంటూ.విసురుగా విదిలించుకొని కాస్త ముందుకు జరిగింది అర్చన. వాళ్లూ ముందుకు వచ్చారు. బస్టాప్‌లో ఉన్న గుంపూ పలచబడింది. అది గమనించుకున్నారు ఆ అయిదుగురూ. కళ్లతో సైగ చేసుకున్నారు. చటుక్కున ఆ అమ్మాయిని చుట్టుముట్టారు. బెరుకు, భయం మొదలైంది అర్చనకు.
‘ఇందాకటి నుంచి చూస్తున్నాం.. ఏం స్టయిలా?’ అన్నాడు ఒకడు అర్చన పైపైకి వెళుతూ. ‘పేరు చెప్పు?’ ఇంకొకడు.‘నా పేరుతో నీకేం పని?’ అంది కాస్త భయంగానే ఎదురిస్తూ.‘వెడ్డింగ్ కార్డ్స్ కొట్టిద్దామని’ అన్నాడు వెటకారంగా. ఘొల్లున నవ్వారు మిగిలిన వాళ్లు.‘ఈడియట్’ అంది అర్చన కోపంగా.‘మామా.. ఇడియట్ అటరా.. అంటే ఐ డూ ఇష్క్ ఓన్లీ తుమ్ సే’ మరొకడు.‘ఆ ముక్క ముందే ఏడవచ్చు కదా.. ఇంత బిల్డప్ ఎందుకు? డ్యూయెట్ పాడుకుందాం పదా’ అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వణికి పోయింది అర్చన. ‘వదులు..’ అంటూ చెయ్యి విసిరికొట్టే ప్రయత్నం చేసింది.‘పట్టుకోవడమే.. వదలడం ఉండదు పాపా’ అంటూ ఇంకొకడు ఇంకో చేయి పట్టుకున్నాడు. చెమటలు పట్టేశాయి అర్చనకు. చుట్టూ చూసింది గాబరాగా.. సాయం కోసం! ట్రాఫిక్ పోలీస్ కనబడ్డాడు. ‘సర్’ అని పిలిచింది. అది గ్రహించిన అంతా ఒక్క అంగలో మాయమయ్యారు. ఊపిరి పీల్చుకుంది ఆ అమ్మాయి. ఇంక క్షణం కూడా అక్కడ నిలవకుండా తన రూట్ వైపు వచ్చిన బస్ ఎక్కేసింది.
అమీర్‌పేట్ బస్టాప్‌లో అర్చన కావచ్చు.. విజయవాడ వన్ టౌన్‌లో ఒక సంయుక్త, అమలాపురం నల్లొంతెనలో ఒక మౌనిక.. వైజాగ్ జగదాంబ సెంటర్‌లో ఒక సబిత.. ఇలా ప్రతి ఊళ్లో ఏదో ఒక సెంటర్లో అమ్మాయిలు ఈవ్ టీజింగ్‌కు గురవుతూనే ఉన్నారు. కారణమేమై ఉండొచ్చు?అర్చనను ఇబ్బంది పెట్టినఅబ్బాయిలలో ఒకరి ఇల్లు...ఉదయం.‘ఏమేవ్.. నేను మొహం కడిగి ఎంతసేపయిందో తెలుసా? కాఫీ ఏదీ?’ ఆర్డరేశాడు అబ్బాయి తండ్రి తన భార్యకు.‘అయ్యో.. టిఫిన్ హడావిడిలో ఉండి చూడలేదండీ.. ఇదిగో తెస్తున్నా’ అంటూ పరుగులు పెట్టింది ఆ ఇల్లాలు. ‘ఏయ్.. ఆగు. నేను ముందు వెళ్లాలి! నీకంత కొంపలంటుకుపోయే పనేముందే?’ స్నానానికి వెళ్తున్న చెల్లిని జుట్టు పట్టి లాగి ఆపి.. తను వెళ్లాడు బాత్రూమ్‌లోకి అబ్బాయి.
నొప్పెడుతున్న తలను చేత్తో రుద్దుకుంటూ వంటింట్లోకి వెళ్లింది అమ్మాయి.. ‘అమ్మా... నేను ఈ రోజు త్వరగా కాలేజ్‌కి వెళ్లాలని నీకు చెప్పాను కదే. చూడు.. నన్ను స్నానానికి వెళ్లనివ్వకుండా బాత్రూమ్‌లోకి దూరాడు అన్నయ్య’ కంప్లయింట్ చేసింది బిక్కమొహంతో.‘వాడు మగాడే. సవాలక్ష పనులుంటాయ్. వెళ్లనీ. అంతగా తొందరున్న దానివి పెందలాడే లేవొచ్చు కదా..?’ కూరలు తరుగుతున్న నానమ్మ తప్పుపట్టింది మనవరాలిని.. మనమడిని వెనకేసుకొచ్చి. ‘అయిదింటికి లేచా. చాలదా? కళ్లాపి నేనే చల్లాలి, ఇల్లు నేనే ఊడవాలి, వేడినీళ్లు నేనే కాచాలి, పాలూ నేనే తేవాలి.. వాడు ఇప్పుడు లేచి నేరుగా బాత్రూమ్‌లోకి వెళ్లాడు. తప్పు నాదా? వాడిదా?’ అక్కసు పెదవి దాటింది. ‘ఏయ్.. నోరులేస్తోందేంటే? మూస్కో.. చెప్పిన పని చెయ్’ హాల్లో ఉన్న తండ్రికి విషయం తెలియకపోయినా కూతురి గొంతు హై పిచ్‌లో వినపడింది కాబట్టి నొక్కే ప్రయత్నం చేశాడు. కళ్లనిండా నీళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ పిల్ల. తల తుడుచుకుంటూ గర్వంగా బయటకు వచ్చాడు అబ్బాయి. మిగతా ఇళ్లలోనూ ఇదే సీన్!
ఇంచుమించు ఇదే సీన్ మిగిలిన నలుగురబ్బాయిల ఇళ్లలోనూ కంటిన్యూ అవుతుంది రోజూ. అదే విజయ గర్వాన్ని అనుభవిస్తారు అందరూ. ఆ ఫీల్ ఇంటి బయటా కంటిన్యూ చేస్తుంటారు. అర్చన లాంటి వాళ్ల మీద చూపిస్తున్న ప్రతాపం తాలూకు ప్రభావం అదే. మనం ఈవ్ టీజింగ్ అని పిలిచినా, హెరాస్‌మెంట్ అనుకున్నా, అబ్యూజ్ అన్నా, డొమెస్టిక్ వయెలెన్స్ అని పేరు పెట్టినా.. దేనికైనా పునాది ఇల్లే. పేరెంటింగ్‌లోనే ఉంది అంతా! మగాడు ఏం చేసినా చెల్లు... అని నానమ్మ చెప్తోంది. తండ్రి చేసి చూపించి రోల్ మోడల్ అవుతున్నాడు. తల్లి భరించి బాధితురాలిగా మిగిలిపోతుంది. పెత్తనం చేయమని కొడుక్కి, నోరెత్తొద్దని కూతురికీ ఇల్లే ఆజ్ఞాపిస్తోంది. నేరాన్ని ప్రోత్సహిస్తోంది.
మన దేశంలో మగవాళ్లు ఏదీ రిక్వెస్ట్ చేయరట. ఆర్డర్ వేస్తారట అంతే. అందుకే ఈవ్ టీజింగ్, హెరాస్‌మెంట్, అబ్యూజ్ వంటి నేరాలన్నిటికీ ఈ పెంపకమే కారణం అని విశ్లేషిస్తున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ఈ పద్ధతి మారాలంటే.. మగపిల్లల పెంపకం మారాలి.
ఆగని అఘాయిత్యాలు!
ఉత్తరప్రదేశ్, రాంపూర్ సమీపంలోని ఒక గ్రామంలో పట్టపగలు 14 మంది యువకులు.. దారినపోతున్న ఇద్దరు యువతుల్ని అటకాయించారు. వాళ్లని వేధించి, వారిలో ఒకరి ఒంటిపై చేతులు వేసి అత్యాచారానికి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఇటీవల దేశాన్ని కుదిపివేసింది. దేశంలోని అమ్మాయిల తల్లిదండ్రుల్ని కలవరపరిచింది. ఆ పద్నాలుగు మందిలో కొందరు అమ్మాయిల్ని వేధిస్తుండగా, మిగతావాళ్లు సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చెయ్యడంతో ఈ ఘోరం బయటికి వచ్చింది. నిర్భయ చట్టం, యాంటీ–రోమియో స్క్వాడ్ వంటివి కూడా మహిళలపై అఘాయిత్యాలు జరిపే మనస్తత్వం గలవారిని ఏమీ చేయలేకపోతున్నాయనడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. ఈ కేసులో ఇప్పటికే కొందరిని యు.పి.పోలీసులు అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటనను చూసిన పోలీసులు తామే స్వచ్ఛందంగా నిందితులపై ఐ.పి.సి. సెక్షన్‌లు 354(ఎ), 354 బి ల కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.