భలే ఆప్స్...
ఎస్‌ఎంఎస్‌తో నెట్ సమాచారం...
ఫోన్ సిగ్నళ్లు అందని ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ నుంచి సమాచారం సేకరించేందుకు ఉపయోగపడే అప్లికేషన్ ఈ ఎస్‌ఎంఎస్ స్మార్ట్! ఒకప్పుడు గూగుల్ ఈ రకమైన సేవలు అందించేది. మీరు తెలుసుకోవాలనుకుంటున్న అంశం తాలూకూ కీవర్డ్స్‌ను ఎస్‌ఎంఎస్ చేస్తే క్షణాల్లో సమాచారం అందేది. ఎస్‌ఎంఎస్ స్మార్ట్ అప్లికేషన్ కూడా ఇదే పనిచేస్తుంది. నెట్ కనెక్షన్ లేకున్నా పనిచేయగలగడం దీని ప్రత్యేకత.
వికీపీడియా సెర్చ్‌తోపాటు వార్తలు, వాతావరణ వివరాలు పొందేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. డేటా లిమిట్స్ దాటినా నెట్ ద్వారా సమాచారం పొందేందుకు కూడా ఇది పనికొస్తుందన్నమాట.
గాలెరీ డాక్టర్
స్మార్ట్‌ఫోన్ కెమెరాతో తీసే ఫొటోల్లో కొన్ని అంత సరిగా రాకపోవడం సాధారణమే. అయితే వీటిని వేరు చేసి డిలీట్ చేయాలంటేనే వస్తుంది తంటా. ఈ సమస్యను సులువు చేసే ఆప్ ఈ గాలెరీ డాక్టర్. బ్లర్ అయిన ఫొటోలతోపాటు, ఒకేరకమైన ఫొటోలు రెండు ఉన్నా ఈ ఆప్ దానంతట అదే గుర్తించి డిలీట్ చేస్తుంది. మైరోల్ గాలెరీ క్యూరేషన్ ఇంజిన్ ఆధారంగా ఈ ఆప్ అనవసరమైన ఫొటోలను గుర్తిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఫొటోల సంఖ్య తగ్గిందంటే దాని స్పీడ్ పెరుగుతుందన్నది మనకు తెలిసిందే.
ఫొటో మ్యాథ్
మ్యాథ్స్ పేరు చెప్పగానే మైండ్ గాభరా అవుతోందా? లెక్కలు ఎలా సాల్వ్ చేయాలో తెలియక మీ అబ్బాయి/అమ్మాయి ఇబ్బంది పడుతున్నారా? మీ స్మార్ట్‌ఫోన్‌లోకి ‘ఫొటో మ్యాథ్’ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి చాలు. ఫ్రాక్షన్స్, డెసిమల్ నెంబర్స్, లీనియర్ ఈక్వేషన్స్ లాగరిథమ్స్‌కు సంబంధించిన లెక్కలను ఇట్టే పరిష్కరిస్తుంది ఈ ఆప్. మీరు చేయాల్సిందల్లా... లెక్క ఉన్న కాగితాన్ని ఫొటో తీయడం మాత్రమే. విద్యార్థులు గణితశాస్త్ర సమస్యలను అర్థం చేసుకునేందుకు, దశలవారీగా లెక్కలను సాల్వ్ చేసేందుకు ఈ ఆప్ భేషుగ్గా ఉపయోగపడుతుంది.