గతి మార్చే సూపర్ ఐడియాలు! | To change the fate of super ideas! | Sakshi
Sakshi News home page

గతి మార్చే సూపర్ ఐడియాలు!

Published Tue, Dec 9 2014 11:24 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

To change the fate of super ideas!

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు! నిజమే కావచ్చు... ఓ సామాన్యుడికి వచ్చే ఆలోచనే అంతమార్పు తేగలిగితే... ఓ మేధావి, శాస్త్రవేత్త మెదళ్లను తొలిచే వాటి మాటేమిటి? ఇవి ఒకట్రెండు కాదు... వందల వేల జీవితాలను... ఇంకా చెప్పాలంటే... మానవజాతి కష్టాలను తీర్చేస్తాయి. జీవితాన్ని మరింతగా సుఖమయం చేస్తాయి. యుగాలుగా జరుగుతున్న ఈ క్రతువులో తాజా ఆలోచనల తీరు ఎలాగుందంటే...
 
భలే ఆప్స్

మెసేజ్‌లకు గొంతు తోడు... వైర్!
వైర్... ఇది కూడా వాట్సప్ మాదిరిగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉపయోగపడే అప్లికేషన్. ఆండ్రాయిడ్, ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతోపాటు డెస్క్‌టాప్ కంప్యూటర్‌పై కూడా పనిచేయగలగడం దీని ప్రత్యేకత. టెక్ట్స్‌ఫైళ్లతోపాటు ఆడియో వీడియో, మ్యూజిక్ ఫైళ్లను మిత్రులతో, గ్రూపుల మధ్య షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకరకమైన మెసేజి నుంచి మరోదానికి  మారడం కూడా సులువే.

ఉదాహరణకు మెసేజీ, పిక్చర్స్ పంపుతూనే దానికి వాయిస్ కూడా జత చేయవచ్చు. మీ స్వరాన్ని హెచ్‌డీ నాణ్యతతో రికార్డు చేసి ప్రసారం చేస్తుందీ అప్లికేషన్. ఫోన్, డెస్క్‌టాప్‌లలోని వైర్ సందేశాలు ఎప్పటికప్పుడు సింక్ అవుతూంటాయి కాబట్టి అవసరమైనప్పుడు అన్నీ ఒకచోట కనిపిస్తాయి.  గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభించే ఈ అప్లికేషన్‌ను రన్ చేయాలంటే కొన్ని రకాల అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.
 
ధ్వని తరంగాలు... బ్యాటరీని నింపుతాయి!
ఆధునిక ప్రపంచంలో ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్ల ప్రాముఖ్యత ఎంతో... ఛార్జింగ్ అయిపోతే పడే ఇబ్బందులెన్నో మనకు తెలియనివి కావు. వైర్‌లెస్ ఛార్జర్లు ఉన్నప్పటికీ దూరం పెరిగే కొద్దీ వీటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ చిక్కులను తప్పించి కేవలం ధ్వని తరంగాల ద్వారా గాడ్జెట్లను ఛార్జ్ చేసేందుకు ఓ‘సూపర్’ ఆలోచన చేశారు మెరిడిత్ పెర్రీ! పెన్ విశ్వవిద్యాలయంలో బయాలజీ చదువుకుంటున్న ఈ యువ శాస్త్రవేత్త కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు వేలాడే తీగలను వదిలించుకునే ప్రయత్నంలో ఈ అద్భుత ఆవిష్కరణ చేశారు.

ఈ టెక్నాలజీ చాలా సింపుల్ కూడా. సాధారణ కరెంట్ ప్లగ్‌లోకి స్పీకర్‌లాంటి పరికరాన్ని కనెక్ట్ చేస్తారు. ఈ పరికరం విద్యుత్తును అల్ట్రాసౌండ్ తరంగాలుగా మార్చి ప్రసారం చేస్తుంది. ఈ ప్రకంపనలను మన గాడ్జెట్స్‌కు తగిలించుకునే చిన్నపాటి పరికరం తిరిగి విద్యుత్తుగా మారుస్తుంది. అంతే! మన గాడ్జెట్‌లు ఛార్జ్ అయిపోతాయి.

ఈ టెక్నాలజీని మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు యూబీమ్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసిన పెర్రీ ఇప్పటికే కొన్ని నమూనా ఛార్జర్లను సిద్ధం చేసింది కూడా. యూబీమ్‌ను వాడితే రకరకాల గాడ్జెట్‌లకు వేర్వేరు ఛార్జర్లు వాడాల్సిన అవసరముండదని ఛార్జర్ సైజును మార్చుకోవడం ద్వారా ఏకకాలంలో కావాల్సినన్ని గాడ్జెట్లను ఛార్జ్ చేసకోవచ్చునని పెర్రీ అంటున్నారు.
 
కణాలను నొక్కితే... మందులొస్తాయి!
మధుమేహం, కేన్సర్... మనిషిని పట్టిపీడిస్తున్న  వ్యాధులు. చికిత్సలు ఎన్ని ఉన్నా... వాటితోపాటే కొన్ని దుష్ఫలితాలూ పొంచి ఉండటం మనకు తెలిసిందే. మన శరీరంలో తయారైన కణాలే ఈ వ్యాధులను నయం చేయగలిగితే? షుగర్‌ని నియంత్రించే ఇన్సులిన్ తయారీకి, కేన్సర్ కణితులపై దాడికి ఉపయోగపడితే..? ఈ ‘సూపర్’ ఆలోచనకు జీవం పోస్తున్నారు... అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూటాఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు.

కణాలను సుతిమెత్తగా ఒత్తినప్పుడు ఏర్పడే చిన్నచిన్న రంధ్రాల ద్వారా ప్రొటీన్లు, న్యూక్లియిక్ యాసిడ్లు, కార్బన్ నానోట్యూబులను పంపించడం ద్వారా వాటిని మందుల ఫ్యాక్టరీలుగా మార్చవచ్చునని 2009లో గుర్తించారు. ఈ శాస్త్రవేత్తలు గత ఐదేళ్లలో దాన్ని మరింత మెరుగు పరిచారు. వేర్వేరు కణాల్లోకి వేర్వేరు పదార్థాలను జొప్పించేందుకు మైక్రోఫ్లూయిడిక్ చిప్‌లను సిద్ధం చేశారు.

ఇమ్యూన్ వ్యవస్థలోని కణాలతోపాటు మూలకణాల ధర్మాలను కూడా హైజాక్ చేసి మనకు కావాల్సిన రీతిలో మలచుకోగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. సెకనుకు దాదాపు 5 లక్షల కణాల లక్షణాలను మార్చే సామర్థ్యమున్న చిప్‌లు ఇప్పటికే తయారయ్యాయి. తమ ఆవిష్కరణను ప్రజలకు చేరువ చేసేందుకు ఎంఐటీ శాస్త్రవేత్త అర్మాన్ షెరాయి ఎస్‌క్యూజెడ్ బయోటెక్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్‌తోపాటు యూకే శాస్త్రవేత్తలు త్వరలో ఈ పద్ధతిని ఉపయోగించనున్నారు.
 
ఈ ప్లాస్టిక్ చాలా స్ట్రాంగ్ గురూ...!
ఇనుము కంటే గట్టిదైన ప్లాస్టిక్‌ను మీరెప్పుడైనా చూశారా? ఈమధ్యకాలం వరకూ జానెట్ గార్షియా కూడా చూడలేదు. ఈ ఐబీఎం రీసెర్చ్ శాస్త్రవేత్త కొంతకాలం క్రితమే ఇలాంటి ప్లాస్టిక్‌ను ఆవిష్కరించారు. పరిశోధనల కోసం వాడిన ఓ గాజుబీకరులో తెల్లటి పదార్థమేదో కనిపిస్తే... ఆమె దాన్ని వెలికితీసే ప్రయత్నం చేశారు. ఎంతకూ రానిదే? లాభం లేదనుకుని గాజుబీకర్‌ను పగులగొట్టి ఆ తెల్లటి ముద్దను బయటకు తీశారు. సుత్తితో కొట్టినా ఆ పదార్థంపై చిన్న పగులు కూడా రాలేదు.

ఇదేమై ఉంటుందబ్బా అనుకుంటూ పరిశీలన మొదలుపెడితే ‘టైటాన్’ ఆవిష్కృతమెంది. స్మార్ట్‌ఫోన్ కేసులు మొదలుకొని విమానాల రెక్కలవరకూ అన్నింటినీ సూపర్ స్ట్రాంగ్ చేసేసే ఈ ప్రత్యేకమైన ప్లాస్టిక్‌ను థెర్మోసెట్ పదార్థాలంటారు. ఇలాంటివి ఇప్పటికే చాలా ఉన్నప్పటికీ టైటాన్ వాటన్నింటికంటే బలమైంది మాత్రమే కాదు... దీన్ని పర్యావరణానికి ఏ మాత్రం హాని కలగకుండా  సులువుగా రీసైకిల్ చేసేయవచ్చు.

సంప్రదాయ ప్లాస్టిక్ దుష్ర్పభావం నుంచి బయటపడేందుకు ఇది ఉపయోగపడుతుందని అంచనా. వచ్చే ఏడాదికల్లా తాము తయారు చేసే కార్లలో 95 శాతం ప్లాస్టిక్ రీసైకిల్‌కు అనువైందిగా ఉండాలని యూరప్, జపాన్‌లు ఇప్పటికే నిర్ణయించాయి. అయితే గార్షియా టైటాన్ కేవలం కార్ల తయారీకి మాత్రమే పరిమితం కాదని నీటి శుద్ధీకరణ మొదలుకొని త్రీడీ ప్రింటింగ్, తుప్పుపట్టని పదార్థంగా, మేలైన జిగురుగానూ ఉపయోగపడుతుందని అంచనా.
 
వృథా వేడితో విద్యుత్తు...
లీటర్ పెట్రోలుతో మీ వాహనం ఇచ్చే మైలేజీ ఎంతైనా కానివ్వండి... అంతకు మూడు రెట్లు ఎక్కువ శక్తి వేడి రూపంలో వృథా అవుతూంటుందని మీకు తెలుసా? తెలిసినా ఏం చేయలేరుగానీ... ఈ వృథాని కూడా విద్యుత్తుగా మార్చేందుకు మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాన్ యంగ్ ఓ ‘సూపర్’ ఐడియా సిద్ధం చేశారు. అతి తక్కువ ఉష్ణోగ్రతలనూ విద్యుత్తుగా మార్చేసే ఈ ప్రక్రియ థెర్మోగాల్వానిక్ ఎఫెక్ట్ అన్న సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.

రాగి ఎలక్ట్రోడ్‌లతో కూడిన బ్యాటరీని వేడిగా ఉన్నప్పుడు ఛార్జ్ చేసి చల్లబరిస్తే వాటిని ఛార్జ్ చేసేందుకు వాడిన ఓల్టేజి కంటే ఎక్కువ  శక్తి విడుదలవడాన్ని గుర్తించిన వీరు అదే సూత్రాన్ని వృథా వేడికి వర్తింప జేశారు. గత రెండేళ్లలో ఎలక్ట్రోడ్‌ల సామర్థ్యం పెరిగిపోవడం వల్ల ఉష్ణోగ్రతల్లోని అతితక్కువ తేడాలను కూడా తాము విద్యుత్తుగా మార్చగలిగామని యాంగ్ అంటున్నారు.

వృథా వేడి అన్నిచోట్లా ఉన్న నేపథ్యంలో ఈ టెక్నాలజీని మరింత సానబెడితే ఎక్కడికక్కడ విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ఉదాహరణకు వంటింటి గ్యాస్ స్టౌ నుంచి వెలువడే వృథా వేడి ఇంట్లో బల్బులను వెలిగించవచ్చు. అలాగే వాహనాల ద్వారా వచ్చే వేడిని విద్యుత్తుగా మారిస్తే అక్కడికక్కడే దాన్ని ఏసీ కోసం వాడుకోవచ్చు.
 
మై స్క్రిప్ట్ నోట్!

స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ స్క్రీన్‌లు ఎంత పెద్దగా ఉన్నప్పటికీ టచ్‌స్క్రీన్‌ను ఉపయోగిస్తూ టైప్ చేయడం కొంచెం కష్టమే. అదే మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభించే మైస్క్రిప్ట్ నోట్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి. సాధారణ స్టైలస్ సాయంతో కూడా స్క్రీన్‌పై రాతలను అక్షరాలుగా మార్చేయవచ్చు. అంతేకాకుండా గణిత సంబంధమైన సూత్రాలతోపాటు, వేర్వేరు ఆకారాలను, సంగీతపు నోట్స్‌ను కూడా ఈ అప్లికేషన్ గుర్తించగలదు.

రాసిన స్క్రిప్ట్‌లో ఏవైనా మార్పులు చేయాలనుకున్నా చాలా సులువు. నిర్దిష్ట సంకేతాలను వాడటం ద్వారా పదాలను ఎడం చేయడం, తొలగించడం, కొత్త అక్షరాలు, పదాలను చేర్చడం చేసేయవచ్చు. అంతేకాకుండా అవసరమైనప్పుడు నోట్స్‌లోకి ఫొటోలు, ఇతర ఫైళ్లను ఇంపోర్ట్ చేసుకోవచ్చు కూడా. కొంత రుసుము చెల్లించి ప్రీమియం వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే కొన్ని అదనపు ఫీచర్లు కూడా లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement