నేను మీ నాలుకను
రుచులు తెలిసేది నా వల్లనే
ఆనంద్ తినేటప్పుడు రకరకాల రుచులను ఆస్వాదిస్తుంటాడు. అతడికి అవన్నీ తెలిసేది నా వల్లనే. చిన్న చిన్న కండరాలు, చాలా నరాలతో కూడి ఉంటాన్నేను. నా పైవైపు ఉపరితలం మీద చిన్న చిన్న బుడిపెల్లా కనిపించే కండరాలపై రుచి మొగ్గలు (టేస్ట్‌బడ్స్) ఉంటాయి. ఇవి రుచులను గ్రహించి, ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి. అలాగని రుచిమొగ్గలు నా వరకే పరిమితం కాదు. అవి ఆనంద్ నోట్లోని మిగిలిన భాగాల్లోనూ ఉంటాయి. అయితే, ఏదైనా ఆహారం అసలు రుచి తెలియాలంటే, అది ద్రవరూపం సంతరించుకోవాల్సిందే.
లాలాజలంతో కలిసి ఆహారం ద్రవరూపం సంతరించుకున్నప్పుడు నా రుచిమొగ్గల్లో జరిగే సూక్ష్మ విద్యుత్ రసాయనిక చర్య ఫలితంగా రుచుల సంకేతం మెదడుకు చేరుతుంది. అప్పుడు ఆ రుచులు బాగున్నదీ, లేనిదీ మెదడు తీర్పునిస్తుంది. ఉదాహరణకు ఐస్‌క్రీమ్ రుచి అద్భుతంగా ఉందనో, కాకరకాయ కూర రుచి మరీ చేదుగా ఉందనో... అలాగని అందరికీ అన్ని రుచులు ఒకేలా ఉండవు. రుచుల పట్ల ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు సోడియం బెంజోయేట్ కొందరికి తీపిగా అనిపించవచ్చు. ఇంకొందరికి అదే పదార్థం పుల్లగా అనిపించవచ్చు.
ఆనంద్‌కు ఏమీ తోచనప్పుడు ఒక్కోసారి నన్ను బయటకు తీసి, అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. తను దేని కోసం నన్ను చూస్తున్నాడో తనకే సరిగా తెలీదు. ఒకవేళ నాలో ఏదైనా తేడా కనిపిస్తే తన ఆరోగ్యానికి ఏదో జరిగిపోతోందని రకరకాల కారణాలు ఊహించుకుంటాడు. అయితే, అతడు ఊహించే కారణాలేవీ సరైనవి కావు. ఆనంద్ నోట్లో ఉండే నేను సుమారు పది సెంటీమీటర్ల పొడవు ఉంటాను. నా బరువు కాస్త అటూ ఇటుగా అరవై గ్రాములు ఉంటుంది. నేను ఆనంద్ నాలుకను. అతడి శరీరంలో నేనే బలమైన కండరాన్ని.
నాపైనే ఒత్తిడి ఎక్కువ
ఆనంద్ కళ్లు, చెవులతో పోలిస్తే, నేను భరించే ఒత్తిడే ఎక్కువ. అయినా, పంచేంద్రియాల జాబితాలో నా స్థానం చిట్టచివరే ఉంటుంది. ఇది అన్యాయం అంటాన్నేను. నేను లేకుండా ఆనంద్‌ని బతకమనండి చూద్దాం! పోనీ... అంతొద్దు. నన్ను నోటి బయటకు చాచి, పళ్ల మధ్య కాస్త కరిచిపట్టి ఆనంద్‌ని మాట్లాడమనండి చూద్దాం! అప్పుడు అతడి మాటలు ఎవరికైనా అర్థమవుతాయా? మాట్లాడటం, తినడం అనే ప్రక్రియల్లో నాది ప్రధాన పాత్ర. ఆహారాన్ని దంతాలు నములుతాయి గానీ, వాటి కింద సమానంగా నలిగేలా ఆహారాన్ని పంపేది నేనే. శుభ్రంగా నమిలిన ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యే స్థితిలో గొంతు ద్వారా కడుపులోకి చేరవేసేది కూడా నేనే.
మింగాలంటే నేనుండాల్సిందే
ముఖ్యంగా ఆహారాన్ని మింగే ప్రక్రియ నా సహకారం లేనిదే సాధ్యం కాదు. ఈ ప్రక్రియలో నా ముందు భాగం నోటి పైగోడను ఒత్తుతుంది. అప్పుడు నా వెనుక భాగం రంగంలోకి దిగి, నమిలిన ఆహారాన్ని గొంతు ద్వారా కడుపులోకి నెడుతుంది. ఇదంతా చాలా సులువైన ప్రక్రియలా అనిపిస్తుంది. నరాలు, కండరాలు ఒక క్రమపద్ధతిలో వెనువెంటనే చేసే చర్యల సమాహారమే ఈ ప్రక్రియ. నిజానికి ఆనంద్‌కు మింగడం అనే ప్రక్రియ పుట్టుకకు ముందు నుంచే తెలుసు. అంటే, బతకడానికి మింగడం ఎంత కీలకమో అర్థమవుతుంది కదా!
ఆరోగ్య సమస్యలను ప్రతిఫలిస్తాను
నన్ను చూస్తే ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఉదాహరణకు ఆనంద్ ఎనీమియాతో బాధపడుతున్నాడనుకోండి... నేను ఎర్రగా, మరీ మృదువుగా మారిపోతాను. జాండీస్ సోకిందనుకోండి... పసుపురంగులోకి మారుతాను. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను సాధారణంగా ఎర్రగా ఉంటాను. కొన్ని రకాల ఫంగస్ సోకితే నాపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే. నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టవు. అయితే, జింక్ లోపం వల్ల తలెత్తే ‘డిస్‌గ్యూసియా’ మాత్రం నన్ను తెగ ఇబ్బందిపెడుతుంది. ఇది సోకితే, చక్కెర చేదుగా అనిపించవచ్చు. చాక్లెట్ ఉప్పగా అనిపించవచ్చు.
సాధారణంగా ఫ్లూ వంటి వ్యాధులు సోకిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకుంటే, కొద్ది రోజుల్లోనే నేను మళ్లీ సాధారణ స్థితికి వస్తాను. అరుదుగా నేను ఎదుర్కొనే మరో ఇబ్బంది ‘హైపోగ్యూసియా’. ఇది సోకితే, రుచులను గుర్తించే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. ఏది తిన్నా రుచీపచీ లేని చప్పిడి తిండి తిన్నట్లే ఉంటుంది. మరీ అరుదైన కేసుల్లోనైతే రుచిచూసే సామర్థ్యం పూర్తిగా నశిస్తుంది. రుచిమొగ్గల తీరుతెన్నుల్లో మార్పులు వంటి చాలా కారణాలు ఈ సమస్యకు దారితీస్తాయి. ఈ సమస్య తలెత్తితే జీవితమే రుచిరహితంగా మారుతుంది. ఆనంద్ తరచుగా నన్ను అద్దంలో చూసుకుంటూ ఉంటాడు గానీ, అతడి ఆరోగ్యానికి నేనే అద్దాన్ని.
మాట్లాడటం ఒక విన్యాసం
ఇప్పుడంటే ఆనంద్ అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు గానీ, పుట్టినప్పుడు అతనికి ఏ మాటలూ రావు. రెండేళ్ల వయసు వరకు క్రమంగా రకరకాల ధ్వనులను అనుకరించేవాడు. చిన్న చిన్న మాటలు ముద్దు ముద్దుగా పలికేవాడు. ఆ తర్వాత చిన్న చిన్న వాక్యాలు మాట్లాడేవాడు. క్రమంగా నాతో రకరకాల విన్యాసాలు చేయించడం ద్వారా క్లిష్టమైన మాటలను కూడా పలకడం నేర్చుకున్నాడు. మాట్లాడేటప్పుడు నేనో జిమ్నాస్ట్‌లా పనిచేస్తాను. ఒక్కోసారి ఆనంద్ తనకు ఆలోచన వచ్చిందే తడవుగా ఎదుటివారితో మాట్లాడేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు అతడు నా కదలికలను గమనిస్తే అర్థమవుతుంది... నేనెంతటి విన్యాసాలు చేస్తూ ఉంటానో.
అంతేకాదు, నేను నా బద్ధశత్రువులైన దంతాలతో సహజీవనం చేస్తుంటాను. అయినా, వాటి నుంచి నన్ను నేను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా కాపాడుకుంటూనే ఉంటాను. వాటి మధ్య చిక్కుకుని, నేను నలిగిపోయిన సందర్భాలు చాలా అరుదు. ఇక నా దిగువ భాగంలో చిన్న తీగ నోటి అడుగు భాగాన్ని అతుక్కుని ఉంటుంది. నా కదలికలన్నింటికీ ఈ తీగే ఆధారం. ఒకవేళ ఈ తీగ పొడవు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే, మాట్లాడటంలో నత్తి వంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారం ఉండేది కాదు. ఇప్పుడైతే ఇలాంటి సమస్యను శస్త్రచికిత్సతో సరిచేయడానికి వీలవుతోంది.