సినిమా, సీరియల్ నటిగా తెలుగువారికి సుపరిచితురాలైన అస్మిత తొలిసారి ‘స్టార్ మా’ టీవీలో వచ్చే ‘అగ్నిసాక్షి’లో విలనిజం చూపుతోంది. ‘పాజిటివ్ రోల్‌కి పరిమితులు ఉంటాయి, అందుకే నెగిటివ్ రోల్ కోసం రెండేళ్లుగా ఎదురుచూశా.. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా నా కల నెరవేరింది’ అంటూ ఎన్నో కబుర్లను పంచుకుంది అస్మిత కర్నాని.
‘అగ్నిసాక్షి’గా నెగిటివ్ రోల్!
ఈ సీరియల్‌కు ముందు చేసినవన్నీ పాజిటివ్ రోల్సే. కొంతకాలానికి బోర్ వచ్చింది. ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అయితే బాగుంటుంది అనుకున్నాను. అందుకోసం చాలా ఎదురు చూశా. ఇప్పుడు విలన్ పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చే తిట్లను ఎంజాయ్ చేస్తున్నా. ఈ వర్క్ మిగతావాటికి భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు ఈ రంగంలో ఉన్న ప్రతి డైరెక్టర్ వద్ద రెండు–మూడు సీరియల్స్ అయినా చేసి ఉన్నాను. కానీ, నన్ను పాజిటివ్‌గా చూసిన వాళ్లు నెగిటివ్ రోల్‌కి యాక్సెప్ట్ చేయలేదు. మొత్తానికి అగ్నిసాక్షి సీరియల్ ద్వారా నా కల నెరవేరింది. భూదేవి పాత్రను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరైనా కలిసినప్పుడు ‘మిమ్మల్ని చూసి పలకరించడానికి భయపడ్డాం. కానీ, మీరు మంచిగానే ఉన్నారండి’ అంటుంటారు. అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఫీల్డ్‌లో గ్లామర్ చేస్తే దానికే పరిమితం, హీరోయిన్‌గా పాజిటివ్ రోల్ చేస్తే అదే లేబుల్. ఇప్పుడు నెగిటివ్ రోల్స్ బాగా వస్తున్నాయి. దీంతో ‘హమ్మయ్య’ అనుకుంటున్నాను.
లుక్స్‌కే ముందస్తు ప్రిపరేషన్
పెర్‌ఫార్మెన్స్ వరకైతే ప్రాక్టీస్ ఏమీ లేదు. లుక్స్ కోసం మాత్రం మొదట్లో ప్రాక్టీస్ చేసేదాన్ని. సినిమాలు, సీరియల్స్‌లో విలన్ రోల్ చూసి అందులో నన్ను నేను పోల్చుకునేదాన్ని. నా మొదటి సీరియల్‌కి ఇప్పటికీ నటనలో కొద్ది తేడా ఉంటుంది. అదంతా ఆ ఫ్లోలోనే వస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేసి ఉండటంతో డ్రెస్సింగ్ విషయంలోనూ ఐడియా ఉంది. విలనిజం లుక్స్‌కోసం మేకప్, డ్రెస్సింగ్, హెయిర్‌స్టైల్..ఇలా ప్రతీది ప్రేక్షకుల అటెన్షన్ నా వైపుకు తిప్పుకునేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందంటే.. ఇన్నిరోజులు చేసిన పాజిటివ్ రోల్స్ అన్నీ మర్చిపోయా. ఇప్పుడు చేస్తున్న సీరియల్‌పైనే నా దృష్టి అంతా.
నెగిటివ్‌కీ ఓ క్యారెక్టర్
విలన్ రోల్ కదా ఏదైనా చేసేస్తాను అనుకోను. విలన్‌కైనా ఒక క్యారెక్టర్ ఉండాలి. తనెందుకు అలా మారిందో తెలిసుండాలి. ఆ పాత్ర మూలం మారకూడదు. అలా ఉంటేనే ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంటుంది. ఏ క్యారెక్టర్ అయితే చేస్తున్నానో అదే నాకు స్ఫూర్తి. ఇంట్లో చూడరు మేం మార్వాడీలం. మా ఇంట్లో వాళ్లకు భాష రాకపోవడం వల్ల అర్థం కూడా కాదు. అందుకే ఎవరూ నా సీరియల్స్ చూడరు. కాకపోతే నాకు అందరిలో ఉన్న గుర్తింపు వాళ్లకు తెలుసు. చిన్నప్పటి నుంచి మోడలింగ్, యాక్టింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. అయితే అవేవీ వద్దని ఇంట్లో చెప్పేశారు. కాలేజీ రోజుల్లో ఒక బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని గెలిచాను. అప్పుడే మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. టీవీ సీరియల్‌లోనూ ఆఫర్ వచ్చింది. ఇంట్లో వద్దని చెప్పినా ‘ఈ ఒక్క సీరియల్ చేస్తాను’ అని రెండేళ్ల పాటు బతిమాలాను. ఆ ఒకటి తర్వాత ఇంకొకటిæ సీరియల్స్ చేస్తూనే ఉన్నాను. రెండేళ్లలోనే నా వర్క్ ఏంటో నాకూ, ఇంట్లోవారికీ అర్థమె పోయింది. మొదట్లో మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత సీరియల్స్ రావడంతో పూర్తిగా ఇటే వచ్చేశాను. మంచి రోల్ ఉంటే మధ్య మధ్యలో సినిమాల్లోనూ చేశాను.
పదమూడేళ్ల పరిచయం
కొరియోగ్రాఫర్ సుధీర్ కుమార్‌ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాను. మేం పదమూడేళ్ల క్రితం ఓ డ్యాన్స్ షో చేశాం. అలా మొదలయ్యింది మా పరిచయం. ఎనిమిది నెలలు ఆ షో కోసం చేసిన ప్రాక్టీస్‌తో మంచి స్నేహితులమయ్యాం. తర్వాత ఇద్దరికీ అర్ధమైపోయింది లవ్ అని. ఇంట్లో అందరికీ కొరియోగ్రాఫర్‌గా సుధీర్ ముందే తెలుసు. మా ఫ్యామిలీలో మూడు పెళ్ళిలకు సుధీర్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. పదకొండేళ్ల తర్వాత ఇంట్లో పెద్దవాళ్లు ‘ఇద్దరూ ఆలోచించుకొని, డిసైడ్ అవ్వండి. ఇంకా ఎందకు ఆలస్యం’ అన్నారు.
నెలలో పదిహేను రోజులు
పనిని పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదగాలనే లక్ష్యం, బాగా డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదు. నాకున్న ఇష్టంతో ఈ పని చేస్తున్నాను. నెలలో ముప్పై రోజులు పని చేస్తే ఆ పని పట్ల ఆసక్తి చచ్చిపోతుంది. కొన్నాళ్ల క్రితం ఓ ఆర్నెళ్లు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా పనిచేశాను. అప్పుడు చాలా చిరాకుపడేదాన్ని. నా చుట్టూ ఉన్నవారి మీద అరిచేసేదాన్ని. ఒకరోజు ‘ఎందుకిదంతా, ఎవరికోసం వర్క్ చేస్తున్నాను’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడే కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. నెలలో 15–18 రోజులు వర్క్ చేయాలి. మిగతా టైమ్ నా పర్సనల్ కోసం వాడుకోవాలి అని. ఆ టైమ్‌లో నాకిష్టమైన వ్యాపకాలు పెట్టుకున్నాను. కుటుంబంతో గడపగా ఉన్న ఖాళీ సమయంలో బ్యూటీ, లైఫ్‌స్టైల్ బ్లాగర్స్ నడుపుతున్నాను. బ్యూటీకి సంబంధించిన యూ ట్యూబ్ చానెల్ ఉంది. వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున నేను షూట్ చేస్తాను. మా వారు ఎడిటింగ్, అప్‌లోడ్ చేస్తుంటారు. చాలా మంది స్త్రీలు పెళ్లై, పిల్లలు పుట్టాక ఇంకేముందిలే అని అందం పట్ల దృష్టిపెట్టరు. కానీ, ఆ తర్వాత కూడా ఇంకా చాలా జీవితం ఉంది అనుకోవాలి. లుక్ మనకు హ్యాపీగా ఉండేలా చూసుకుంటే మన లోపలి నుంచి కూడా హ్యాపీనెస్ వస్తుంది. డిజిటల్ మీడియా ద్వారా ఇప్పుడా విషయాన్ని మహిళలకు చేరవేయడానికి ప్రయత్నిస్తున్నాను.’
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment