తన్వీ జోరీ, కార్మెసీ ఫౌండర్
తన్వీ ఉత్పత్తి చేస్తున్న బయోడీగ్రేడబుల్ నాప్‌కిన్స్ విరివిగా అందుబాటులోకి వస్తే.. గర్భాశయ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి మహిళ ఆరోగ్యాన్ని, పర్యావరణ కాలుష్యం నుంచి భూమాతను కూడా రక్షించినట్లవుతుంది.
‘పరిశుభ్రత ఒక అలవాటుగా మారాలి’ అంటుంటాం. దేహ పరిశుభ్రత గురించి అందరి ముందు మాట్లాడగలుగుతాం. నోటి పరిశుభ్రత గురించి దంత వైద్యులు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే పక్కవారిని కూడా పిలుచుకుని మరీ వెళ్తాం. అయితే రుతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి అవగాహన కోసం మాట్లాడటానికి ఎవరైనా వస్తే మనలో ఎంతమందిమి హాజరు అవుతాం? అలాగని రుతుక్రమ పరిశుభ్రత గురించి సమాజంలో సంపూర్ణ అవగాహన ఉందా అంటే.. అదీ ఇరవై శాతానికి మించదు. భారతదేశంలో ఈ అంశం ఇంకా ఒక కళంకిత భావనగానే ఉంది. ఆ భావన తొలగిపోయే వరకు రుతుక్రమ పరిశుభ్రత క్యాంపెయిన్‌ల అవసరం కాదనలేనిది అంటున్నారు తన్వీ జోరీ. అనడమే కాదు, తనే శానిటరీ నేప్‌కిన్‌లను తయారు చేస్తూ, క్యాంపెయిన్‌ను నడుపుతున్నారు.
ఇళ్లకే నేరుగా డెలివరీ
తన్వీ జోరీకి స్వయంగా ఎదురైన ఇబ్బందుల నుంచి ఈ ఆలోచన వచ్చింది. బయోడీగ్రేడబుల్ నాప్‌కిన్‌ల అవసరాన్ని గుర్తించి, వాటి వాడకాన్ని మహిళలకు అలవాటు చేయాలనుకుంది. తనే వాటిని తయారు చేసింది. ఇక ఇప్పుడు వాటి వాడకం ఎంత అవసరమో తెలియచేసే ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తన్వీ జోరీ న్యూఢిల్లీలో బిజినెస్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. మార్కెట్‌లో దొరికే శానిటరీ నాప్‌కిన్స్ వల్ల ఆమెకు స్కిన్ ర్యాష్ వస్తుండేది. దీని నుంచి బయటపడే మార్గం ఏమిటని ఆలోచించి తానే సొంతంగా 2016లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెట్టింది. మొక్కజొన్న పిండి, వెదురు పీచులను కలిపి నాప్‌కిన్‌లను తయారు చేసే టెక్నాలజీని కనుక్కుంది. ఇప్పుడు ఆమె ప్రారంభించిన ‘కార్మెసీ’ కంపెనీకి ఐదువేల మంది వినియోగదారులున్నారు. నేరుగా వాళ్ల ఇళ్లకే నేప్‌కిన్‌లు నెలనెలా డెలివరీ అవుతుంటాయి. ఈ ఉత్పత్తుల కోసం వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అవుతున్నారు మహిళలు. తన్వీ వినియోగదారుల్లో 24–36 ఏళ్ల మధ్య వారే ఎక్కువ. నగరాల్లో నేచర్ బాస్కెట్ వంటి సహజమైన ఉత్పత్తులను విక్రయించే అవుట్‌లెట్‌లను ఇందుకోసం తన్వీ ఎంచుకుంది. ‘‘నెల నెలకూ 30 శాతం వ్యాపారం పెరుగుతోంది’’ అంటోంది తన్వి.
ధైర్యమివ్వడమే ధ్యేయం
కంపెనీ స్థాపనలో తన ఉద్దేశం అమ్మకాలు– కొనుగోళ్ల ఆధారంగా జరిగే వ్యాపారం కాదని, ఆధునిక మహిళలను కూడా వదలని సామాజిక కళంక భావనను సమూలంగా తుడిచేయడమేననీ ఆమె అంటోంది. రుతుక్రమం సమయంలో వాడి పారవేసే వ్యర్థాలు ఏటా మనదేశంలో లక్షా పదమూడు వేల టన్నులుగా ఉంటున్నాయి. రసాయనాలు, జెల్స్, సింథటిక్ ఫైబర్‌తో తయారైన నాప్‌కిన్‌లకు బదులుగా సహజపద్ధతుల్లో నేలలో కలిసి పోయే (బయోడీగ్రేడబుల్) నాప్‌కిన్‌ల వాడకం గురించి అవగాహన పెరగాలని ఆమె కోరుకుంటోంది. అంతకంటే ముందుగా తన అవసరాన్ని ధైర్యంగా చెప్పగలిగేటట్లు మహిళల్లో చైతన్యం తీసుకురావాలనేదే.. ఈ యూనిట్‌ను ప్రారంభించడంలో ఆమె ముఖ్యోద్దేశం.
ఉన్నవాటికంటే మంచివి
రెండు మూడు తరాలకు ముందు మహిళలు ఇంట్లో చేసుకుని వాడిన శానిటరీ నాప్‌కిన్స్ స్థానాన్ని ఇప్పుడు అధునాతన నాప్‌కిన్స్ భర్తీ చేస్తున్నాయి. మార్కెట్‌లో ఉన్న రసాయనాల ప్రభావంతో కూడిన నాప్‌కిన్స్ వాడకం మీద కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే అంతకంటే మరో మార్గం లేదు. అందువల్లనే ప్రభుత్వాలు కూడా పరిశుభ్రత లేని, అనారోగ్యకరమైన సంప్రదాయ పద్ధతుల నుంచి బయటకు వచ్చి మార్కెట్‌లో దొరికే స్టెరిలైజ్‌డ్ నాప్‌కిన్‌లను వాడమని సూచిస్తున్నాయి. ఇప్పటికి అందుబాటు ఉన్నవాటిలో అవే కొంత ఆరోగ్యకరం కాబట్టి! అయితే తన్వీ ఉత్పత్తి చేస్తున్న బయోడీగ్రేడబుల్ నాప్‌కిన్స్ విరివిగా అందుబాటులోకి వస్తే.. గర్భాశయ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి మహిళ ఆరోగ్యాన్ని, పర్యావరణ కాలుష్యం నుంచి భూమాతను కూడా రక్షించినట్లవుతుంది.
మహిళలకు ఎదురయ్యే ఆ కష్టం ఎవరికీ అర్థం కాదు.. అలాంటి సమస్యనే ఎదుర్కొన్న మరో మహిళకు తప్ప. నేను పడిన ఇబ్బందిని మాటల్లో చెప్పలేను. సంపన్న మహిళ అయినా, సాధారణ మహిళ అయినా ఇందులో అంతా సమానమే. అధునాతనమైన పరిశుభ్రమైన జీవనశైలిలో కూడా ఆ కష్టం తప్పలేదంటే, సాధారణ జీవితంలో ఇంకెలా ఉంటుందో అనుకునేదాన్ని. స్త్రీలకు ఆరోగ్యక రమైన జీవితాన్నివ్వడానికి నేను ఎంచుకున్న మార్గం ఇది.
– తన్వీ జోరీ, కార్మెసీ ఫౌండర్
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment