పెట్రోల్ రేట్ ఎక్కువైపోయి ఇంధనానికి ధనం నీళ్లలా ఖర్చవుతుంటే ఏం చేస్తాం? పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, వెహికిల్ షేరింగ్ వంటి ప్రత్యామ్నాయాలు వెదుకుతాం. ఇంట్లో ఇచ్చిన పాకెట్ మనీనంతా బైక్ పెట్రోల్ రూపంలో తాగేస్తుంటే గాబరాపడ్డ ఆ విద్యార్థులు నూతన ప్రయోగం చేశారు. ఫలితం సీఎన్‌జీతో నడిచే బైక్ ఆవిష్కృతమైంది. ఆ ఎనిమిది మంది పరిచయం, ఆ ప్రయోగం వివరాలు...
లార్డ్స్ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న మహ్మద్ అహ్మద్ లంగర్‌హౌస్ నివాసి. రోజూ ఇంటి నుంచి కాలేజ్‌కి తన 200సీసీ బైక్‌పై వెళతాడు. హైదరాబాద్ టవర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో కో-ఆర్డినేటర్‌గా పనిచేసే వాళ్లమ్మ మల్హేగినా... పాకెట్ మనీగా తనకు ఇచ్చే డబ్బులో ఎక్కువ భాగం ఇంధనానికే ఖర్చే అయ్యేది. దీంతో ఆ భారాన్ని తగ్గించుకోవాలని ఆలోచించాడు. తన ఆలోచనను ఫ్రెండ్స్‌తో పంచుకున్నాడు. తన మిత్రులు మహ్మద్ షారుఖ్, వైనతేయ, సైఫ్ బిన్ అబ్దుల్లా, అబూబాకర్ పాషా, మహమ్మద్ మునావర్, మహ్మద్ ముజఫర్, మహ్మద్ ఆలీ జునైద్‌తో కలిసి 20 రోజుల్లో తన ద్విచక్ర వాహన రూపురేఖలు మార్చాడు. ఖర్చు తక్కువ, మైలేజ్ ఎక్కువ ప్రణాళికతో రూపొందించిన ఈ బైక్ సీఎన్‌జీతో నడుస్తుంది. వాయుకాలుష్యం, ఫ్యూయల్ రేట్స్ పెరుగుదలే తమను ఈ సీఎన్‌జీ వాహన తయారీకి పురికొల్పుదంటున్నాడు మహ్మద్ అహ్మద్.
ప్రత్యేక ఇంధన ట్యాంకు...
ట్యాంకు సామర్థ్యం, పరిమాణాన్ని లెక్కగట్టి ఇంధన ట్యాంకు రూపురేఖల్ని మార్చారు. కచ్చితత్వాన్ని లెక్కగట్టకుంటే గ్యాస్ ఒత్తిడి కారణంగా ట్యాంక్ పేలే అవకాశాలు ఉంటాయి కాబట్టి... ట్యాంక్‌లో సీఎన్‌జీ వెపరైజర్‌ను ఏర్పాటు చేశారు. ‘ట్యాంక్‌ను మార్చడానికి దాదాపు 15 రోజుల వరకు సమయం పట్టింది. ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్న ద్విచక్రవాహనాల కంటే ఆరు కిలోమీటర్ల మైలేజీ అదనంగా ఇస్తోంది. పెట్రోల్ ధర లీటర్‌కు రూ.77 ఉంటే, మేం తయారుచేసిన బైక్‌కు వాడే సీఎన్‌జీ ధర రూ.50. అంటే ఇంధన ఖర్చూ తక్కువే. ఈ వాహనాన్ని తయారుచేసి మూడు నెలలు కావస్తున్నా... ప్రతిరోజు పరీక్షిస్తాం. పేటేంట్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నాం. నగరంలో పొల్యూషన్‌ని తగ్గించడం మా లక్ష్యం’ అంటున్నాడు మహ్మద్ అహ్మద్!
శతానీక్
సిటీ కుర్రాళ్ల సృష్టి సీఎన్‌జీ బైక్...
Published Wed, Mar 11 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement