రూ. 38 వేలకే మ్యూజిక్ ఇచ్చా
సిక్కోలు సిన్నోడిగా సిటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతం లేకున్నా.. హైదరాబాద్‌లోనే సరిగమలు సాధన చేశాడు. తాళంపై పట్టు దొరికాక.. సినిమాల్లో పట్టు కోసం ప్రయత్నించాడు. మ్యూజిక్ అసిస్టెంట్‌గా పనిచేసి తనను తాను మెరుగుపర్చుకున్న సత్య కాశ్యప్.. మరోవైపు సంగీతంలో పరిశోధనలు చేస్తూ రాగాల్లో రాటుదేలాడు. తాజాగా ‘ఐస్‌క్రీమ్-2’తో మ్యూజిక్ డెరైక్టర్‌గా తానేంటో ప్రూవ్ చేసుకున్న సత్య కాశ్యప్‌తో ‘సిటీప్లస్’ మాటామంతీ..
నేను పుట్టింది, పెరిగింది శ్రీకాకుళంలోనే. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత మ్యూజిక్‌లో డిప్లొమా కోసం రామ్‌కోఠిలోని త్యాగరాజ మ్యూజిక్ అకాడమీలో చేరాను. డిప్లొమా పూర్తయిన తర్వాత చాలా మంది మ్యూజిక్ డెరైక్టర్ల దగ్గర అసిస్టెంట్‌గా చేశాను. పుత్రుడు మూవీకి మొదటిసారిగా మ్యూజిక్ డెరైక్టర్‌గా పనిచేశాను. పవన్ కళ్యాణ్ జనసేన వందేమాతరం థీమ్ సాంగ్ నేనే చేశాను. ఇండియా తరఫున నెల్సన్ మండేలా ట్రిబ్యూట్ కూడా చేశాను. రక్త చరిత్ర మూవీకి మ్యూజిక్ డెరైక్టర్‌గా చేశాను కానీ నేను చేసిన సాంగ్స్ రాకపోవడం బాధనిపించినా.. ఇంకో అవకాశం తప్పకుండా వస్తుందన్న నమ్మకంతో స్పోర్టివ్‌గా తీసుకున్నాను.
తలచినదే..
నేను అనుకున్నట్టుగానే ఐస్‌క్రీమ్ 2 మూవీ కోసం ఒకరోజు రామ్ గోపాల్ వర్మ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆయన ‘ఈ సినిమాకు నువ్వే మ్యూజిక్ డెరైక్టర్‌వి’ అని చెప్పారు. ఫోన్‌లోనే కథ వినిపించి ట్యూన్స్ రెడీ చేయమన్నారు. ఆయన అనుకున్న స్టోరీకి నేను ఇచ్చిన మ్యూజిక్‌ని జత చేసి చూసుకున్నారు. ఇందులో ఐదు పాటలున్నాయి. ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నాదే. నేను ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కోసం రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాను. అలాంటి టైమ్‌లో నాకు కాల్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ చాన్స్ ఇచ్చిన ఆర్జీవీకి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను.
ప్రయోగమే చేశాను..
ఈ రోజుల్లో లో బడ్జెట్ సినిమాకైనా మ్యూజిక్ డెరైక్షన్ చేయాలంటే కనీసం 20 వాయిద్యాలు, 25 మంది టెక్నీషియన్లు కావాల్సి ఉంటుంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే రూ.15 లక్షల వరకూ అవుతుంది. కానీ ఐస్‌క్రీమ్ 2 సినిమాకు మ్యూజిక్ కంపోజిషన్ కోసం ఓ ప్రయోగమే చేశాను. నేనొక్కడినే హోల్ అండ్ సోల్‌గా మ్యూజిక్ అందించాను. మరో టెకీ్నిషియన్ సాయం తీసుకోలేదు. అంతెందుకు ఒక్క ఇన్‌స్ట్రుమెంట్ కూడా వాడలేదు. కేవలం ఒక సాఫ్ట్‌వేర్‌ను బేస్ చేసుకుని ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాను. దీనికైన ఖర్చు అక్షరాలా రూ.38 వేలే. చిన్న సినిమాలు బడ్జెట్‌ను తగ్గించుకోవడానికి ఈ టెక్నాలజీని వాడుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఇక నాకు సరిగమలు నేర్పి.. నన్ను మ్యూజిక్ డెరైక్టర్‌ని చేసిన హైదరాబాద్‌ను ఎప్పటికీ మరచిపోలేను.
..:: సిరి