తివాచీ... పాదాలకు పట్టు పరుపు | ... Feet silk carpet, bedding | Sakshi
Sakshi News home page

తివాచీ... పాదాలకు పట్టు పరుపు

Published Sun, Feb 8 2015 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

తివాచీ... పాదాలకు పట్టు పరుపు

తివాచీ... పాదాలకు పట్టు పరుపు

  • మీరే పారిశ్రామికవేత్త
  • తివాచీ... కాళ్ల కింద నలుగుతూ... కంటికి ఆహ్లాదాన్నిస్తుంది. చేత్తో తాకి మెత్తదనాన్ని ఆస్వాదించమని మనసును ఊరిస్తుంది. తయారీలో మెళకువలు నేర్చుకుంటే పారిశ్రామికవేత్తను చేస్తుంది.
     
    తివాచీ తయారీ కూడా చేనేత వంటిదే. నూలుతో వస్త్రాన్ని నేయడానికి ఉపయోగించే పరిజ్ఞానంతోనే ఊలుతో తివాచీ తయారు చేస్తారు. కనీసం ఆరు నెలలు శిక్షణ తీసుకుంటే ప్రాథమికంగా సాదా తివాచీ తయారు చేయగలుగుతారు. అది కూడా మాస్టర్ పర్యవేక్షణలో మాత్రమే. సొంతంగా పరిశ్రమ స్థాపించాలంటే ఏళ్ల పాటు సాధన చేయాలి. డిజైన్ల రూపకల్పన, రంగుల మేళవింపులో పట్టు సాధించాలి. తివాచీ నేతలో మహిళలు కీలకంగా పనిచేస్తారు. తివాచీ తయారైన తర్వాత దానికి ఫినిషింగ్ ఇవ్వడం, ఉతకడం వంటి పనులు మాత్రం మగవాళ్లే చేయాల్సి ఉంటుంది.
     
    తివాచీ తయారీలో శిక్షణ తీసుకున్న తర్వాత పరిశ్రమలో ఉద్యోగిగా చేరవచ్చు. ఒక చదరపు అడుగు తివాచీ తయారవ్వాలంటే ఒక మనిషి మూడు గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక రోజులో ఆరు గంటలు పని చేస్తే రెండు చదరపు అడుగుల తివాచీ నేయగలుగుతారు.
     
    పరిశ్రమ పెట్టాలంటే...
     120 చదరపు అడుగుల వసారా - 10 బై12 అడుగుల
     స్టాండుతో కూడిన చేనేత మగ్గం (చెక్కతో చేసినది) - 1
     బల్ల - 1; స్టాండు - 1; నిచ్చెనలు - 2
     ఇనుప రాడ్లు - 3; వెదురు బొంగులు - 2
     పనిముట్లు: కత్తి-1, కత్తెర-1, బైండింగ్ పంజా-1
     ఫినిషింగ్ కోసం... దువ్వెన-1, కత్తెర్లు-2, రాడ్లు-2
     వీటన్నింటికీ కలిపి పదిహేను వేల రూపాయలవుతుంది.
     ముడిసరుకు... (ఒక వ్యక్తి సుమారుగా రెండు నెలలపాటు పనిచేసుకోవడానికి అవసరమయ్యే కొలమానం ఇది)
     ఊలు - 40 కేజీలు (కేజీ రెండు వందల రూపాయల చొప్పున ఎనిమిది వేలు)
     బేస్ కాటన్ (6బై 6 దారం)- 5 కేజీలు (కేజీ 150 రూపాయల చొప్పున 750 రూపాయలు)
     బైండింగ్ కాటన్ (2 కౌంట్స్) - 20 కేజీలు (కేజీ 70 రూపాయల చొప్పున 1,400 రూపాయలు)
     ఈ మొత్తం ముడిసరుకు కొనుగోలుకు దాదాపుగా పది వేల రూపాయలవుతుంది. ఈ మెటీరియల్‌తో ఒక అంగుళం మందంతో కూడిన 120 చదరపు అడుగుల తివాచీ తయారవుతుంది.
     
    వాషింగ్... ఒక తొట్టె, తివాచీ పరవడానికి తగినంత అరుగు లేదా చదరంగా నేల ఉండాలి. బ్లీచింగ్, వాషింగ్ పౌడర్లతో శుభ్రం చేయాలి. రంగులు కొట్టొచ్చినట్లు కనిపించడానికి తివాచీ ఉతికేటప్పుడు కొన్ని రసాయనాలను వాడాల్సి ఉంటుంది. తివాచీ తయారీలో ఫినిషింగ్, వాషింగ్ కూడా కీలకమైనవే. తివాచీ నేతకారులందరూ ఈ పనులు చేయలేరు. వీటికి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి.
    శిక్షణ తీసుకోవాలనే ఆసక్తి ఉన్న వారు తమ పేరు నమోదు చేసుకోవడానికి సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ నంబరు:
     1800 123 2388
     - ‘ఎలీప్’  సౌజన్యంతో...

     
     మూలాలు పర్షియాలో...

     మా పూర్వీకులు తివాచీల తయారీలో నిష్ణాతులు. పర్షియా నుంచి భారత్‌కి వచ్చి స్థిరపడిన కుటుంబం మాది. మా వాళ్లు తివాచీల తయారీకి అవసరమైన ముడిసరుకు కోసం అన్వేషిస్తూ సంచార జీవనం చేసేవారు. తంగెళ్లపూడి దగ్గర తంగేడు పువ్వు విరివిగా లభించడంతో ఉన్ని రంగులు అద్దడానికి ఈ పువ్వు బాగా పనికొస్తుందనుకుని గోదావరి తీరాన ఏలూరులో స్థిరపడ్డారు. నాది ఐదవ తరం.
     - అబ్దుల్ నయీమ్
     ‘హఫీజ్ కార్పెట్స్’, ఏలూరు

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement