∙కొంత కాలం పాటు పిల్లలు వద్దనుకుంటున్నాం. ‘లూప్’ వాడాలనుకుంటున్నాను. అయితే దీని గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ‘లూప్’ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? రక్తస్రావం ఎక్కువ అవుతుందని విన్నాను. ఇది నిజమేనా? ఏ కారణాల వల్ల ‘లూప్’ బయటికి వస్తుంది? ఎంత కాలానికి ఒకసారి దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది? – బీఆర్, సికింద్రాబాద్
కొంతకాలం పిల్లలు వద్దనుకున్నప్పుడు బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం పాటించాలనుకు న్నప్పుడు గర్భం రాకుండా ఉండటానికి ‘లూప్ లేదా కాపర్ టీ’ అనే సాధనం వాడతారు. ఈ లూప్ సన్నని ప్లాస్టిక్ ట్యూబుపై కాపర్ వైరు చుట్టబడి ఉంటుంది. ఇందులో అనేక రకాలు ఉంటాయి. మూడు, ఐదు, పది సంవత్సరాల పాటు పనిచేసే రకాలు ఉంటాయి. కాకపోతే ఈ లూప్ అందరికీ సరిపడకపోవచ్చు. శరీర తత్వాన్ని బట్టి కొందరిలో పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువవడం, పొత్తికడుపులో నొప్పి, మధ్య మధ్యలో బ్లీడింగ్ కనిపించడం, గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు రావడం, తెల్లబట్ట ఎక్కువవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వేసిన తర్వాత మూడు నెలల పాటు చూసి, సమస్యలు ఎక్కువవుతూ ఉంటే లూప్‌ను తొలగించడం జరుగుతుంది. కొందరిలో గర్భాశయం కండరాలు కుంచించుకుపోయినట్లయి లూప్ బయటకు వచ్చేస్తుంది. కొందరిలో గర్భాశయాన్ని చొచ్చుకుంటూ పొత్తికడుపులోకి వెళ్లిపోవచ్చు. ఇది ఎంతకాలం పనిచేసే లూప్ వేయించుకున్నారో దాని బట్టి మార్చడం జరుగుతుంది. ఒకవేళ మూడేళ్లకు వేయించుకుంటే మూడేళ్ల తర్వాత అది తీసేసి కొత్తది వేయడం జరుగుతుంది. ఐదేళ్లది అయితే ఐదేళ్లకు, పదేళ్లది అయితే పదేళ్లకు మార్చడం జరుగుతుంది. మధ్యలో ఎప్పుడైనా వద్దనుకుంటే అప్పుడు తీసివేయవచ్చు. కాపర్ టీ వేశాక మొదటి పీరియడ్ తర్వాత ఒకసారి చెక్ చేయించుకోవాలి. తర్వాత ప్రతి ఆరునెలలకోసారి డాక్టర్‌తో చెక్ చేయించుకుంటూ ఉంటే అది పొజిషన్‌లో ఉందా లేదా, ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయా వంటి సమస్యలు తెలుస్తాయి. కాపర్ టీ వేసినా వెయ్యిమందిలో ఒకరికి లూప్ ఫెయిలై లేదా అది జారి గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా తక్కువ మందిలో గర్భం ట్యూబ్‌లో ఉండిపోయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
∙నేను డ్యాన్సర్‌ని. నృత్యం చేయడం ద్వారా చాలా రిలాక్స్ అవుతుంటాను. అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఇప్పుడు డ్యాన్స్ చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? 28 వారాల ప్రెగ్నెన్సీతో ఒక డ్యాన్సర్ నృత్యప్రదర్శన ఇచ్చిన వార్త చదివాను. ప్న్రెగ్నెన్సీతో డ్యాన్స్ చేస్తే సమస్యలేమీ ఉండవని ఆమె అంటుంది. దీని గురించి తెలియజేయగలరు. – కె.లయ, పిట్లం, నిజమాబాద్ జిల్లా
గర్భం దాల్చిన తర్వాత ముందు నుంచే డ్యాన్స్ చెయ్యడం అలవాటుంటే, మొత్తంగా డాన్స్ చెయ్యకూడదనే నియమమేం లేదు. కాకపోతే డాక్టర్‌తో చెకప్ చెయ్యించుకుని, స్కానింగ్ చెయ్యించుకుని లోపల బిడ్డ పొజీషన్, లోపల మాయ పొజిషన్ కిందకి ఉందా? పైకి ఉందా? అనే అంశాలను బట్టి డాక్టర్ సలహా మేరకు, వారి అనుమతి తీసుకుని.. వారు ఫర్వాలేదు అంటే చెయ్యవచ్చు. వద్దంటే చెయ్యకపోవటం మంచిది. గర్భంతో ఉన్నప్పుడు డ్యాన్స్ అనేది.. చిన్న చిన్న స్టెప్స్‌తో మొదలుపెట్టి, ఆయాసం లేనంత వరకూ మెల్లగా చేస్తూ ఉండవచ్చు. డ్యాన్స్‌లో ఎక్కువ ఎగరడం, దుమకటం వంటివి లేకుండా డ్యాన్స్ చెయ్యటం కూడా ఒకరకమైన వ్యాయామమే. దీంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. డ్యాన్స్ వల్ల, కండరాలు గట్టిపడతాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. అన్ని అవయవాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. కాన్పు సమయానికి శరీరం సులభంగా సహకరిస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్నీ బట్టి మరీ అతిగా డ్యాన్స్ చెయ్యడం వల్ల కొందరిలో బ్లీడింగ్ అవ్వటం, అబార్షన్ కావడం, నెలలు నిండకుండా కాన్పులు అయ్యే ప్రమాదం కూడా ఉండవచ్చు. కాబట్టి ఏదైనా డాక్టర్ సలహా మేరకు మాత్రమే చెయ్యడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment