చీకటి జీవితాలకు వెలుగునిచ్చాడు...
ఆదర్శం
బతుకే వద్దనుకున్నాడు.
బతకడం వృథా అనుకున్నాడు.
ఎందరికో బతుకునిస్తున్నాడు.
‘‘నేను జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయను... చావును దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను. ఎందుకంటే, నేను చనిపోయి నప్పుడు...ప్రజలు నేను చేసిన మంచి పనుల గురించి మాట్లాడుకోవాలి’’ అంటాడు స్వప్నీల్. అతడి బాల్యమంతా బాధలోనే గడిచింది. డిసొలెక్సియా వ్యాధి అతణ్ని చిత్రవధ చేసింది. తన లోపాన్ని చూసి కుంగిపోయేవాడు. అందరూ హేళన చేస్తుంటే సిగ్గుతో చితికిపోయేవాడు. అలాంటప్పుడు తండ్రి అతడిలో ధైర్యం నూరి పోసేవాడు.
కానీ తండ్రి హఠాత్తుగా కారు ప్రమాదంలో చనిపోవడంతో...ఆ వెలితిని తట్టుకోవడం పదమూడేళ్ల స్వప్నీల్ వల్ల కాలేదు. జీవితంలో దుఃఖం తప్ప ఏమీ లేదని, చావులోనే సుఖం ఉన్నదనే నిర్ణయానికి వచ్చాడు. స్లీపింగ్ పిల్స్ చేతిలోకి తీసుకున్నాడు. కానీ మింగ లేదు. ఒక మనిషిలో రెండు శక్తులు ఎప్పుడూ పోట్లాడుకున్నట్లే... స్వప్నీల్‌లో కూడా దట్టమైన నిరాశ, ఉత్తేజిత ఆశ పోరాడాయి. మెల్లిగా నిరాశ మీద ఆశ పై చేయి సాధించడం మొదలైంది.
‘జీవితం అంటే తినిపడుకోవడం కాదు... ఏదో ఒకటి సాధించడం, నలుగురికి మంచి చేయడం’ అని ఓసారి ఎవరో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. స్లీపింగ్ పిల్స్‌ని డస్ట్‌బిన్‌లో వేశాడు. తన మనసులోంచి నిరాశను తీసి పారేశాడు. కష్టపడి చదివాడు. ఎంబీఏ పూర్తి చేసి ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో చేరాడు. రిజర్‌వ బ్యాంక్‌లో పనిచేసే స్థాయికి చేరాడు.డబ్బు, హోదా, పలుకుబడి... అన్నీ ఉన్నాయి స్వప్నీల్‌కి. కానీ అందులో ఏదీ అతడికి సంతోషాన్ని ఇవ్వలేదు. తాను ఒక సంస్థకి కాదు, సమాజానికి ఉపయోగ పడాలి అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో మధుబని కళాకారుల కుటుంబం ఒకటి కష్టాల్లో ఉండడం చూశాడు.
ఇంకా అలాంటి కుటుంబాలెన్నో బిహార్‌లో బాధలు పడుతుండటం గమనించాడు. వారికి తన వంతుగా సహాయపడాలనే ఉద్దేశంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీలో ‘నేక్‌డ్ కలర్స్’ అనే సంస్థను ప్రారంభించాడు. మధుబని కళాకారుల కళాకృతులను మార్కెటింగ్ చేస్తూ వారికి ఆర్థికంగా ఉపయోగపడడం ప్రారంభించాడు. తంజావూర్, గోండు కళాకారులకు సైతం చేయూతనిచ్చాడు.
తర్వాత కొన్నాళ్లకు అనుకోకుండా ఓ నక్సలైట్ ఏరియాకి వెళ్లాడు స్వప్నీల్. వాళ్ల కుటుంబాలు ఎంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నాయో, వారి పిల్లలు చదువు లేకుండా ఎలా వెనుకబడిపోతున్నారో చూశాడు. ఆ పిల్లలకు అక్షరాలు నేర్పాలని, వారి జీవితాలను మార్చాలని సంకల్పిం చాడు. కానీ అతడి ఆలోచనను వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. అతడి వల్ల తమకు హాని ఉందని భయపడి స్వప్నీల్‌ను కిడ్నాప్ చేశారు. కొన్ని రోజుల పాటు చిత్ర హింసలు పెట్టారు. తర్వాత ఎప్పటికో అతడి ఆశయం అర్థమై వదిలిపెట్టారు. అతడు చేయాలనుకున్నదానికి అనుమతి ఇచ్చారు. దాంతో స్వప్నీల్ తన పని తాను చేసుకుపోయాడు. ఎంతో మంది పిల్లల్ని అక్షరాస్యుల్ని చేశాడు.
అలాగే స్వప్నీల్ చూపు రెడ్‌లైట్ ఏరియాల వైపు ప్రసరించింది. పొట్టకూటి కోసం పడుపు వృత్తిలోకి దిగిన మహిళలతో పలు దఫాలుగా మాట్లాడి, వారిని ఆ వృత్తి నుంచి తప్పించి గౌరవ ప్రదమైన ఉపాధి మార్గాల వైపు మళ్లిస్తున్నాడు. దానితో పాటు డిప్రెషన్‌లో ఉన్నవారి దగ్గరకు వెళ్లి ‘బిహేవియర్ సైకాలజీ’, ‘పాజిటివ్ థింకింగ్’కు సంబంధించి క్లాసులు తీసుకుంటూ ఉంటాడు. రకరకాల సమస్యలతో కుంగుబాటుకు గురై, ఆత్మహత్య చేసుకో వాలనుకున్న చాలామంది మనసు మార్చి జీవితంపై ఆశలు చిగురింపజేశాడు. జీవించేందుకు తగిన మానసిక స్థైర్యాన్ని ఇచ్చాడు.
మరోపక్క మహిళల భద్రత మీద కూడా దృష్టి పెట్టాడు. ‘పింక్ విజిల్’ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించి, ‘శక్తి’ పేరుతో ఒక విజిల్ తయారుచేశాడు. ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పుడు, విజిల్ మీద ఉన్న బటన్‌ను నొక్కితే, ఆత్మ రక్షణ చేసుకోవడానికి వీలుగా ఒక చిన్న కత్తి బయటికి వస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా ఎందరికో మార్గదర్శకు డయ్యాడు స్వప్నీల్. అతడు మాటల మనిషి కాదని, చేతల మనిషని అతని జీవిత పాఠాలను చదివితే సులభంగా అర్థమవుతుంది!