సచివాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా శుక్రవారం సచివాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సంఘీభావంగా తాము నిరసనకు దిగామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్మికులందరికీ ప్రభుత్వం వేతనాల పెంపును వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో పాల్గొన్న ఉత్తమ్, భట్టి విక్రమార్క, కె.జానారెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్, ఎం.ఏ.ఖాన్, పొన్నాల లక్ష్మయ్య, పొంగులేటి సుధాకరరెడ్డి, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, డి. శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, వై. అనిల్‌కుమార్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: జానా
తెలంగాణ సాధన కోసం ఆనాడు అందరి సలహాలు తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు ఇతర పార్టీల నేతల సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జానారెడ్డి ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వామపక్షాలు బంద్‌కు సిద్ధమవగా కేసీఆర్ రాత్రికి రాత్రి కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారన్నారు.
మున్సిపల్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని అన్ని పార్టీలు కోరుతుండగా ఎవరినీ సంప్రదించకుండా సీఎం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఒక్క జీహేచ్‌ఎంసీకి కార్మికులకే వేతనాలు పెంచడం సరికాదని, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కార్మికులకు పెంచిన జీతాలు వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌చేశారు.