సాక్షి, సిటీబ్యూరో:
శరవేగంగా విస్తరిస్తోన్న మహా నగరంలో ఆ స్థాయిలో ప్రజా రవాణా వ్యవస్థ ఉందా?. మునుముందు ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి? పెరిగే జనాభాకు అనుగుణంగా మహా నగర రవాణా ముఖచిత్రం ఎలా ఉండనుంది?... ఇప్పటికే హైదరాబాద్ నగరాభివృద్ధికి అనుగుణంగా వచ్చే రెండు, మూడు దశబ్దాల్లో కల్పించాల్సిన మంచినీరు, విద్యుత్, రోడ్లు, రైల్వే మార్గాలు, తదితర మౌలిక సదుపాయాలపై విస్తృత అధ్యయనం చేసిన లీ అసోసియేట్స్ సంస్థ.. ప్రజా రవాణా రంగంపైనా పలు అంశాలను సోదాహరణంగా చర్చించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల గురించి ప్రస్తావిస్తూనే భవిష్యత్తులో ప్రజావసరాలకు అనుగుణంగా కల్పించాల్సిన సదుపాయాలను ప్రతిపాదించింది. నగర అంతర్గత, బహిర్గత రవాణా వ్యవస్థలపై దృష్టి కేంద్రీకరించింది. 2041 నాటికి పెరగనున్న ప్రజల అవసరాలు, అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రజా రవాణా సదుపాయాలపై లీ అసోసియేట్స్ పలు ముఖ్యమైన ప్రతిపాదనలు చేసింది.
నివేదికలో ప్రతిపాదనలివీ..
జనాభాతో పాటే నగరంలో వాహనాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో ప్రజా రవాణాకు పెద్దపీట వేయాలి
త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో రైలుతో పాటు ఆర్టీసీ సిటీ సర్వీసులను, దక్షిణమధ్య రైల్వే ఎంఎంటీఎస్ సర్వీసులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత పరిధికి అనుగుణంగా విస్తరించాలి
బస్సు ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ (బీఆర్‌టీఎస్)కు మార్గం సుగమం చేయాలి
విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా బస్సు టెర్మినల్స్ లేవు. దీంతో మహాత్మాగాంధీ బస్సుస్టేషన్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్సుస్టేషన్ (జేబీఎస్)పై ఒత్తిడి పెరుగుతోంది. ఇరుకు రోడ్లు, ఎంజీబీఎస్ లోపలికి, బయటకు వచ్చేందుకు తగినన్ని మార్గాలు లేవు. దీనివల్ల ఆ ప్రాంతంలో తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. ఈ పరిస్థితి నివారణకు ఎంజీబీఎస్‌కు అదనపు మార్గాలు వేయాలి. బస్సులు నిలిపేందుకు ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను పెంచాలి
నగరంలోని పలు బస్టాపుల్లో బస్సుల నిలుపుదల కారణంగా ఏర్పడుతున్న రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి
{పస్తుతం 2 లక్షల మంది ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ఎంఎంటీఎస్ రైలు మార్గాలను భవిష్యత్తు హైదరాబాద్ మెట్రో అథారిటీకి అనుగుణంగా దశలవారీగా విస్తరించాలి
ఎంజీబీఎస్‌లో ఉన్న ప్రస్తుత 74 ప్లాట్‌ఫామ్‌లను 100కి పెంచాలి. జేబీఎస్‌లో ఉన్న వాటికి అదనంగా మరో 17 ఏర్పాటు చేయాలి
ప్రత్యేక బస్సు టెర్మినల్స్: ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, బీహెచ్‌ఈఎల్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, జీడిమెట్ల, మియాపూర్
2041 నాటికి భారీగా మారనున్న నగరం రూపురేఖలు
Published Wed, Nov 27 2013 1:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement