మహిళలకు 4.73 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు
♦ ఉజ్వల పథకం ద్వారా త్వరలోనే అందజేస్తాం: దత్తాత్రేయ
♦ హైదరాబాద్‌లో 2019 నాటికి పైపులైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం కింద త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 4.73 లక్షల మంది మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని ఈపీఎఫ్ ప్రాంతీ య కార్యాలయంలో పెట్రోలియం శాఖ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులతో దత్తాత్రేయ సమావేశమయ్యారు. గ్యాస్ కనెక్షన్లతో పాటు గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్‌లను వాయిదాల పద్ధతిలో అందజేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 4.73 లక్షల మం దికి మంజూరు చేయనున్నట్లు చెప్పారు. గతేడాది తెలంగాణలో దీపం పథకం కింద 2.43 లక్షల కనెక్షన్లు, కేంద్రం తరఫున సీఎస్‌ఆర్ ఉచిత గ్యాస్ స్కీం ద్వారా 3.26లక్షల కనెక్షన్లు ఇచ్చినట్లు వివరించారు. మొత్తం 85.6 లక్షల మంది గ్యాస్ కనెక్షన్‌ను నిత్యం వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
సీఎన్‌జీ స్టేషన్లను పెంచుతాం..
హైదరాబాద్ మహానగర వాసులకు 2018-19 నాటికి వంటగ్యాస్‌ను పూర్తిస్థాయిలో పైపులైన్ ద్వారా సరఫరా చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. ఇప్పటికే మొదటి ఫేజ్‌లో భాగంగా శామీర్‌పేట నుంచి కుత్బుల్లాపూర్ వరకు 1,100 కుటుంబాలకు గ్యాస్ పైపులైన్ ద్వారా విజయవంతంగా వంటగ్యాస్ సరఫరా అవుతోందని పేర్కొన్నారు. రెండో విడతలో కుత్బుల్లాపూర్ నుంచి కూకట్‌పల్లి జేఎన్టీయూ వరకు చేపట్టిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలి పారు. ఇక వాహనదారుల కోసం ఏర్పాటు చేసిన సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్లను భారీగా పెంచనున్నట్లు చెప్పారు.