చాయ్.. ‘ఖావా’లా?
* ఆరోగ్యాన్యిచ్చేదిగా గుర్తింపు
* రంజాన్‌లో మంచి ఆదరణ
అరబ్ దేశపు చాయ్ ‘ఖావా’కు హైదరాబాద్‌లో భలే డిమాండ్ ఉంది. ఖావా అంటే అరబ్బీ భాషలో వివిధ ఔషధాల మిశ్రమం అని అర్థం. సుమారు వెయ్యేళ్లకు పూర్వం అరబ్ దేశమైన యెమన్‌లో షాజిలీ, ఖామిరి అనే ఇద్దరు ధర్మ పండితులు రాత్రి పూట దైవ నామస్మరణ (జాగరణ)లో గడపడానికి ఈ వేడి పానీయాన్ని తయారు చేసి వాడడం మొదలు పెట్టారు. దీనికి ‘ఖావా’ అని పేరు పెట్టారని చెబుతారు. కాలక్రమేణా ఇది ‘ఖావ’గా మారిపోయింది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ కాలంలో ప్రభుత్వ మిలట్రీ కోసం యెమన్ నుంచి అరబ్‌లను ఇక్కడికి తీసుకొచ్చి వారికి రక్షణ సంబంధిత బాధ్యతలను అప్పగించారు. సుమారు 150 ఏళ్ల నుంచి ఈ ఖావా మన హైదరాబాద్‌లోని అరబ్‌ల వాడకంలో ఉందని అంటారు. - సాక్షి, సిటీ బ్యూరో
ఇలా తయారవుతోంది
కాఫీ పొడి, సొంటి, ఎండు అల్లం, దాల్చిన చెక్క, ఇలాచీని నూరి పౌడర్‌లా తయారు చేస్తారు. దీనిని వేడినీటిలో కలపడంతో ఖావా తయారవుతుంది. ప్రస్తుతం ఇది ఖావా, పాల ఖావా, లెమన్ ఖావాలనే మూడు రకాలలో లభ్యమవుతోంది. అరబ్‌లు ఉన్నచోట ఖావా తప్పక ఉంటుంది. వారి దినచర్యలో దీనికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఖావా పౌడర్ బార్కాస్‌లోని ప్రధాన దుకాణాలలో లభ్యమవుతుంది. 25 గ్రాముల పౌడర్ ధర 100 వరకు ఉంటోంది.
ఇవీ ప్రయోజనాలు
ఖావా తాగడం ద్వారా జీర్ణశక్తి పెరగడంతో పాటు మలబద్ధకం దూరమవుతుంది. జలుబు తగ్గుతుంది. పరగడుపున ఖావా తాగడం ద్వారా ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని హబీబ్ అబ్దుల్ రెహమాన్ అంటున్నారు. గత 50 ఏళ్లలో ఖావా లేకుండా ఒక్క రోజు కూడా గడపలేదని చెబుతున్నారు. బార్కాస్‌లోని ప్రతి ఇంట్లో రంజాన్ ఉపవాసాలను ఇఫ్తార్ ఖావా, ఖర్జూరంతో విడవడం ఆనవాయితీగా వస్తోంది. రోజుకు మూడు నాలుగుసార్లు ఖావా తాగడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉందని సయ్యద్ అహ్మద్ బిన్ అల్వీ అంటున్నారు.
మార్కెట్‌లో...
రంజాన్ మాసంలో ఖావా దుకాణాలు పెద్ద ఎత్తున వెలిశాయి. యువకులు, మహిళలు, వృద్ధులు ఖావా తాగేందుకు ఎంతో ఇష్టపడతారు. పాల ఖావాకు మంచి ఆదరణ ఉంది. అన్ని వయసుల వారు దీనిని ఆదరిస్తున్నారు. పాతబస్తీలోని హుస్సేనీఆలం, డబీర్‌పురా, శాలిబండ, సలాల, బార్కాస్ తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఖావా విక్రయాలు కొనసాగుతున్నాయి.