అరకొరగానే అందిన ‘ఆసరా’
- పింఛన్ల పంపిణీపై బ్యాంక్ సెలవుల ప్రభావం
- అక్టోబర్ పింఛన్ కోసం నేటికీ తప్పని ఎదురు చూపులు
- మొత్తం రూ.397 కోట్లకు ఇప్పటివరకు పంపిణీ చేసింది రూ.157 కోట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆసరా’ పథకం లబ్ధిదారులకు పింఛన్లు అరకొరగానే అందాయి. ఈ నెల 1నుంచి 10 లోగా పూర్తి కావాల్సిన పింఛన్ల పంపిణీ ప్రక్రియ నెలాఖరవుతున్నా ఓ కొలిక్కి రాలేదు. రాష్ట్రంలోని 36 లక్షలమంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల నిమిత్తం ప్రభుత్వం రూ.397 కోట్లను విడుదల చేసినప్పటికీ ఆ సొమ్ము క్షేత్రస్థాయికి చేరకపోవడం ప్రభుత్వ వర్గాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా మొదలైనప్పటికీ, తాజాగా శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు రావడంతో పంపిణీ ఎక్కడికక్కడే నిలిచిపోరుుంది. ప్రారంభంలో రూ.500 నోట్లు లేకున్నా బ్యాంకులిచ్చిన రూ.2000 నోట్లనే ఇద్దరు లేదా ముగ్గురు లబ్ధిదారులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పంపిణీ చేసింది.
ఆ నోట్లను పంచుకోవడంలో పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నుంచి వివిధ బ్యాంకులకు కొత్త రూ.500 నోట్లు విరివిగా వచ్చినా, క్షేత్రస్థారుులో సరిపడా మొత్తాలకు కొత్తనోట్లను బ్యాం కర్లు ఇవ్వడం లేదని పంపిణీ సిబ్బంది వాపోతున్నారు. బ్యాంకుల నుంచి కావాల్సినన్ని కొత్తనోట్లు అందినట్లయితే శని, ఆదివారాల్లో కూడా లక్షలాదిమందికి పింఛన్ సొమ్మును అందించగలిగేవారమని చెబుతున్నారు. శుక్రవారం వరకు మొత్తం లబ్ధిదారుల్లో 14.44 లక్షలమందికి రూ.157.22 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేసినట్లు సెర్ప్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులో పోస్టాఫీసుల ద్వారా.5.50 లక్షలమందికి రూ. 61.80 కోట్లు, బ్యాంకు ఖాతాలున్న 8.85 లక్షలమందికి రూ.94.41 కోట్లు, పంచాయతీ సిబ్బంది ద్వారా గ్రామాల్లోని సుమారు 9వేల మందికి ఇప్పటివరకు రూ.1.05కోట్లు పంపిణీ చేశారు. అక్టోబర్ పింఛన్ సొమ్మే నేటికీ అందకపోతే, నవంబర్ నెల పింఛన్ ఎప్పుడొస్తుందోనని పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెర్ప్ సిబ్బందికి 1న వేతనాలు డౌటే!
పెద్దనోట్ల రద్దు ప్రభావం ఆసరా పెన్షనర్లతో పాటు ఆయా పింఛన్లను పంపిణీ చేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సిబ్బందిపైనా పడింది. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలను అదుకునే సెర్ప్ సిబ్బందికి ఈ నెల 1న వేతనాలొచ్చేది డౌటేనని ఉన్నతాధికారులు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్‌లో వివిధ స్థారుుల్లో పనిచేస్తున్న 4,126 మంది ఉద్యోగుల వేతనాలకు రూ.11.5 కోట్లు అవసరమవుతాయి. ఈ మొత్తానికి ప్రతినెలా ఒకటో తేదీకి 15రోజుల ముందుగానే ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను జారీచేసేది. అరుుతే.. నెలాఖరు వస్తున్నా బీఆర్వోను సర్కారు విడుదల చేయకపోవడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పెద్దనోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెలలో వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోవడం, కీలకమైన ప్రభుత్వ పథకాలకు పెద్దమొత్తాల్లో బిల్లులను తప్పనిసరిగా చెల్లించాల్సి రావడం.. తదితర కారణాలతో సెర్ప్ ఉద్యోగుల వేతనాలకు బడ్జెట్ ఇవ్వడంపై ఆర్థిక శాఖ మీనమేషాలు లెక్కిస్తోందని తెలిసింది. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాని పక్షంలో ఇతర పద్దుల నుంచైనా వేతనాలను చెల్లించాలని పలువురు చిరుద్యోగులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.