సర్కారీ బడుల్లో ‘బోగస్’ పిల్లలు!
♦ విద్యార్థుల్లేకున్నా ఉన్నట్లు పేర్కొన్న టీచర్లు
♦ రేషనలైజేషన్‌లో పోస్టులు పోతాయన్న భయమే కారణం
♦ ప్రైవేటు విద్యార్థులనూ ప్రభుత్వ స్కూళ్లలో చూపిన వైనం
♦ ప్రైవేటు యాజమాన్యాల ఫిర్యాదుతో వెలుగులోకి..
♦ విచారణ చేపట్టనున్న విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేకున్నా ఉన్నట్లుగా చూపించారు.. తక్కువగా ఉన్న చోట మరికొంత మందిని ‘అదనంగా’ చేర్చారు.. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నవారిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు చేర్చారు.. మొత్తంగా బోగస్ ఎన్‌రోల్‌మెంట్‌తో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చూపారు.. హేతుబద్ధీకరణలో తమ పోస్టులు పోకుండా ఉండేందుకు, మరో చోటికి బదిలీ కాకుండా ఉండేందుకు కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసిన వ్యవహారమిది. ఒక ప్రైవేటు పాఠశాల తమ విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్న సమయంలో ఈ బండారం బయటపడింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఇంగ్లిషు మీడియం స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్లుగా ఉపాధ్యాయులు విద్యాశాఖకు లెక్కలు ఇచ్చారు. జిల్లా విద్యా సమాచార సేకరణ (డైస్ డేటా)లో భాగంగా ఆ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా తమ ఉపాధ్యాయులు, టీచర్లు, వారి వివరాలు, వాటిల్లోని సదుపాయాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ మేరకు జమ్మికుంటలోని ఇంగ్లిషు మీడియం పాఠశాల యాజమాన్యం తమ పిల్లల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుండగా... అప్పటికే వారి వివరాలు ఉన్నట్లుగా (ఆల్ రెడీ ఎగ్జిస్ట్) చూపించింది. దీంతో ఆ పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ ఉన్నతాధికారులను సంప్రదించింది. దీనిపై ఉన్నతాధికారులు క్షుణ్నంగా పరిశీలన చేయడంతో... సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆ విద్యార్థులు చదువుతున్నట్లుగా ముందే ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిసింది. హేతుబద్ధీకరణలో తమ పోస్టులు పోకుండా ఉండేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులే ఈ పనిచేసినట్లు తేలింది.
ఇంకా ఇలా అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ‘బోగస్’ విద్యార్థులను చూపించి ఉంటారని విద్యాశాఖ అధికారులే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు ఉచిత పాఠ్య పుస్తకాల విషయంలోనూ ఇలాగే జరిగింది. రాష్ట్రంలోని 24.80 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన 1,73,93,042 పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేశారు. అయితే మెదక్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అదనంగా మరో 18 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని విజ్ఞప్తి వచ్చింది. ‘డైస్ డాటా’ ప్రకారమే పుస్తకాలను ముద్రించి పంపినా.. మళ్లీ అదనంగా ఎందుకు అవసరమయ్యాయన్న కోణంలో విద్యాశాఖ పరిశీలన చేస్తోంది. మొత్తంగా డైస్ డాటాకు సంబంధించి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయన్నదానిపై లోతైన విచారణ జరపాలని భావిస్తోంది.
ఎందుకిలా..?
19 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు.. 75 మంది లోపున్న ఉన్నత పాఠశాలలకు రెగ్యులర్ టీచర్లను ఇవ్వొద్దని, ఆ స్కూళ్లను సమీపంలోని స్కూళ్లలో కలిపేయాలని గతేడాది సెప్టెంబర్‌లోనే విద్యాశాఖ హేతుబద్దీకరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా స్కూళ్లలోని పోస్టులను విద్యార్థులు ఎక్కువగా ఉండి, టీచర్లు అవసరమైన పాఠశాలలకు పంపించాలని పేర్కొంది. దీంతో ఎక్కడ తమ పోస్టులు పోతాయోనని, ఎక్కడికి బదిలీ చేస్తారేమోనని విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. అయితే స్కూళ్ల విలీనం, రెగ్యులర్ టీచర్లను ఇవ్వకపోవడంపై ప్రభుత్వం ఆ తర్వాత వెనక్కి తగ్గింది. అయినా ఏం చేస్తారోనన్న అనుమానంతో ఉపాధ్యాయులు హేతుబద్ధీకరణ సమయంలో తప్పుడు లెక్కలు ఇచ్చారు. ‘బోగస్’ విద్యార్థుల వివరాలను డైస్‌డాటాలో నమోదు చేశారు.