హైదరాబాద్: జల్సాలకు అలవాటుపడి స్నేహితుల వద్ద తాను కూడా పెద్ద పొజిషన్‌లో ఉన్నానని చెప్పుకునే యువకుడు తన యజమాని కారు దొంగిలించాడు. ఆ పరారైన నిందితుడి కోసం జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన చరణ్(29) యూసుఫ్‌గూడలో నివాసం ఉంటూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తాత్కాలిక డ్రైవర్‌గా కూడా పని చేస్తూ జీవించేవాడు. ఈ నేపథ్యంలోనే రహ్మత్‌నగర్ సమీపంలో నివసించే సుబ్బారాయుడు తరచూ వివిధ కార్యక్రమాలకు వెళ్లేందుకు టెంపరరీ డ్రైవర్‌ను పిలిపించుకునేవాడు. అలా చరణ్ ఆయన కారు నడిపేందుకు చాలాసార్లు వెళ్లాడు.
గత నెల 24వ తేదీన చరణ్ ఆ ఇంటికి వచ్చి ఫోన్‌లో మాట్లాడుతూ పైకి వెళ్లి మళ్లీ కిందికి వస్తూ అక్కడి వాచ్‌మెన్‌లు వినేలా అలాగే సార్.. వెళ్తున్నాను.. అంటూ సెక్యూరిటీ రూం దగ్గర ఉన్న కారు తాళం చెవులు తీసుకుని కారుతో బయటకు వెళ్లాడు. సాయంత్రానికి కారు లేకపోవడంతో సుబ్బారాయుడు సెక్యూరిటీని అడిగాడు. తరచూ వచ్చే డ్రైవర్ మీతో మాట్లాడుతున్నట్టు నటించి కారుతో వెళ్లారని చెప్పారు. కారు చోరీకి గురైందని తెలుసుకున్న బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరుగా కాకినాడకు వెళ్లిన చరణ్ కారుతో జల్సాలు చేస్తూ కాకినాడ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలన్నీ చుట్టేస్తున్నట్లు ఫోన్‌ట్రాక్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. పక్కా నిఘా వేసి పట్టుకనే క్రమంలో పోలీసు బృందం విజయవాడలో మకాం వేసింది.
కారుతో ఉడాయించిన టెంపరరీ డ్రైవర్!
Published Sat, Feb 11 2017 8:38 PM | Last Updated on Thu, Oct 4 2018 8:31 PM
Advertisement
Advertisement