ప్రజా గొంతుకను అనుమతించండి
⇒ కొత్త అసెంబ్లీలోనైనా ప్రతిపక్షాన్ని అడ్డుకోకండి
⇒ వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అమరావతిలో కొత్తగా ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనైనా సంప్రదాయాలను పాటించాలని, ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ప్రతిపక్షంపై పదే పదే ఎదురుదాడి చేయవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత శ్రీకాంత్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్ల పాలనలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తాము లేవనెత్తే ఏ అంశానికీ అధికార పక్షం స్పష్టత ఇవ్వకపోగా, తాము చెప్పేదే వినాలనే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు.
హైదరాబాద్‌లో ఈ మూడేళ్లుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఒక్క రోజు కూడా అధికారపక్షం సభను సజావుగా కొనసాగించింది లేదని ఆక్షేపించారు. రానున్న సమావేశాల్లోనైనా ఎదురుదాడి సిద్ధాంతాన్ని మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారనే నమ్మకమే సీఎంకు ఉంటే అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.ప్రతిపక్షం ప్రశ్నించకూడదు, నిలదీయకూడదు, ఎప్పుడూ భజన చేస్తూ ఉండాలి అనే విధానాన్ని మానుకోవాలని సలహా ఇచ్చారు. ప్రతిపక్షాన్ని గంటల తరబడి తిట్టించే చెడు సాంప్రదాయానికి శాసనసభ స్పీకర్ శ్రీకారం చుట్టారని విమర్శించారు.
కరువు విలయ తాండవం
రాష్ట్రంలో విలయ తాండవం చేస్తున్న కరువు పరిస్థితులు, పంటల బీమా, రుణ మాఫీ, 13 శాతం వ్యవసాయాభివృద్ధి, రైతులు పడుతున్న ఇబ్బందులు, తాగునీటి కొరత, ఉద్యోగాలు– నిరుద్యోగ భృతి, ప్రాజెక్టుల అంచనాలు అసాధారణంగా పెంపు, ప్రభుత్వ అవినీతి వంటి అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని గడికోట వెల్లడించారు.