జీవో 123 చట్టబద్ధతను తేలుస్తాం
సోమవారం నుంచి వాదనలు వింటాం: హైకోర్టు
⇒ 2013 చట్టం కింద ప్రయోజనాలు కల్పించాలని కోర్టు చెప్పింది: ఏజీ
⇒ ఈ మేరకు జీవో 38 తెచ్చాం
⇒ ఇప్పటికే రూ.5 వేల కోట్లు వెచ్చించి 49 వేల ఎకరాలు సేకరించాం
⇒ కోర్టు స్టేతో ప్రాజెక్టు పనులన్నీ నిలిచిపోయాయి
⇒ తుది విచారణకు ధర్మాసనం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల కోసం భూముల విక్రయానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారి నుంచి భూములను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 123 చట్టబద్ధతపై తుది విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఇందుకు సోమవారం నుంచి వాదనలు వింటామని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాగునీటి ప్రాజెక్టుల కోసం జీవో 123 ద్వారా భూములు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. 2013 చట్టం కింద పరిహారం చెల్లించడం లేదని, అలాగే బాధితులకు ప్రయోజనాలను కల్పించడం లేదంటూ పెద్దసంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.
భూ సేకరణ ప్రక్రియను నిలిపేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం... 2013 భూ సేకరణ చట్టంలోని షెడ్యూల్ 2, 3ల కింద ఉన్న వారి హక్కులను హరించేలా జీవో 123 ఉందని, అందువల్ల సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు ఆ జీవోను వర్తింపజేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ ఏడాది జనవరి 5న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 123 ద్వారా భూములమ్మిన వారికి కాక, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి పునర్నిర్మాణం, పునరావాసం కోసం 2013 చట్ట నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 38 జారీ చేసింది. ఈ విషయాన్ని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి గతవారం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏజీ ఓ అనుబంధ పిటిషన్‌ను కోర్టు ముందుంచారు.
ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం..
ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు 2013 భూసేకరణ చట్టంలోని 2, 3 షెడ్యూళ్లలో ఉన్న వారి పునర్నిర్మాణం, పునరావాసం కోసం ఈ నెల 14న జీవో 38 జారీ చేశామని ఏజీ కోర్టుకు నివేదించారు. జీవో 123 ద్వారా సేకరించే భూముల వల్ల ప్రభావితులయ్యే వారి ప్రయో జనం కోసమే ఈ జీవో ఇచ్చామన్నారు. జీవో 123 ద్వారా ప్రభుత్వం ఇప్పటికే 49 వేల ఎక రాలు సేకరించిందని, ఇందుకు రూ.5,138 కోట్లు వెచ్చిందన్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల సాగునీటి ప్రాజెక్టు పనులే కాకుండా తాగునీటి ప్రాజెక్టుల పనులు కూడా నిలిచిపోయాయని వివరించారు.
మిగిలిన భూసేకరణ పూర్తి చేయకుండా... ఇప్పటికే సేకరించిన భూమిని వినియోగించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అందువల్ల ప్రభుత్వం ముం దుగా తాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని వివ రించారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం వల్ల అం చనా వ్యయాలు పెరిగిపోయే అవకాశం ఉం దని, ఇది ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావితం చూపుతుం దన్నారు. అందువల్ల జీవో 38ని పరిగణనలోకి తీసుకుని జీవో 123 ద్వారా భూములు సేకరించేందుకు అనుమతి ఇవ్వా లని కోర్టును కోరారు. అయితే ఈ అనుబంధ పిటిషన్‌పై పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయ వాదుల్లో ఒకరైన ఎ.సత్యప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అఫిడవిట్ ద్వారా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించిం చాలని ప్రభుత్వం కోరుతోందని, అసలు ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు.
కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే పునః సమీక్ష పిటిషన్ లేదా సుప్రీం కోర్టును ఆశ్రయించడం మినహా ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని లేదా జీవో 123 చట్టబద్ధతపై తుది విచారణ జరపాలని కోరారు. కొద్దిసేపు తర్జనభర్జనల అనంతరం జీవో 123 చట్టబద్ధతపై తుది విచారణ చేపట్టి తేలుస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సోమవారం నుంచి విచారణ చేపడుతామంటూ ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.